దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14 తో ముగుస్తోంది. అందుకు సరిగా వారం మాత్రమే సమయముంది. దీంతో లాక్ డౌన్ పొడిగింపా? ఎత్తివేతా? అనే ప్రశ్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా విషయంలో మొదటినుంచి చురుగ్గా ఉన్న తెలంగాణా సీఎం కేసీఆర్ మరోసారి మీడియా సమావేశం పెట్టి సుదీర్ఘంగా, కూలంకషంగా మాట్లాడారు.
కరోనా కలకలం మొదలైనప్పటినుంచి తరచుగా మీడియా సమావేశాలు పెడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కేసీఆర్. లాక్ డౌన్ గడువుకు ఇంకా వారం సమయం ఉండగానే చురుగా స్పందించారు కేసీఆర్. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంగతేమోగానీ ఈ విషయంలో కేసీఆర్ మాత్రం ముందున్నారు. లాక్ డౌన్ పొడిగించాల్సిందేనంటూ కేసీఆర్ తన కీలక అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ప్రధాని మోడీకి ఇదే విషయం చెప్పానన్నారు. మరో వారమో రెండువారాలో పొడిగిస్తే నష్టం లేదన్నట్లుగా చెప్పారు. కేసీఆర్ చాలా స్పష్టంగా, నిష్కర్షగా, సూటిగా విషయం వివరించారు.
లాక్ డౌన్ పొడిగించాలనే ఆయన అభిప్రాయం సమంజసంగా అనిపించింది. ఇప్పుడు ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేస్తే ఈ 21 రోజులూ చేసిన కట్టడి అంతా వృధా అవుతుందనే మాట వాస్తవమే. ఒక్కసారి అంతా ఖుల్లా చేశాక అందరూ రోడ్ల మీదికి వస్తారు. వారిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు కాబట్టి ఆకలిగొన్న సింహాల్లా ఊరిమీద పడతారు. కథ మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదముంది. మళ్ళీ లాక్ డౌన్ పెట్టాలంటే చాలా కష్టం.
కాబట్టి వేడిలో వేడి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే పరిస్థితి మెరుగు పడవచ్చు. లాక్ డౌన్ కు మించిన ఆయుధం, మార్గం మరొకటి లేదని కేసీఆర్ చెప్పింది వాస్తవం. ఇన్నాళ్లు ఓపికగా ఉన్నాం. మరికొన్ని రోజులు ఓపిక పడితే ఆ తరువాత నెమ్మదిగా పుంజుకోవచ్చు. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ ఎత్తేస్తే దానికి కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవచ్చు. కేంద్రం లాక్ డౌన్ ఎత్తేస్తే తాను సమాజం (తెలంగాణ) అభిప్రాయం తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు.
దీన్ని బట్టి ఆయన లాక్ డౌన్ పొడిగింపుకే కట్టుబడి ఉన్నారని అర్ధమవుతోంది. దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న వేగం కూడా ఎక్కువగా ఉంది. ఏపీలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14 నాటికి కూడా ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. నిన్న విలేకరుల సమావేశంలో కేసీఆర్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికను ప్రస్తావించారు.
అది కరోనాకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి బీసీజీ వివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇది చాలా విశ్వసనీయమైన సంస్థ అని కేసీఆర్ చెప్పారు. ఆయన ఆ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. గతంలో అంటే మోడీ మొదటి టర్మ్ లో ఆయన కొన్ని విషయాల్లో కేసీఆర్ సలహాలు తీసుకున్నారు.
అప్పట్లో పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ మోడీకి కేసీఆర్ సలహాలు ఇచ్చారు. అప్పట్లో ఆయన పాటించారు కూడా. మరి ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితిలో కేసీఆర్ ఇచ్చే సలహాలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఉంటారా ? మోడీ అందరు సీఎంలతో మాట్లాడబోతున్నారు. వారి అభిప్రాయాలు అడగబోతున్నారు. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ ప్రతిపాదనపై మోడీ ఆలోచించకుండా ఉండరు.