బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. మాజీ మంత్రి. రాజకీయంగా పండిపోయిన నాయకుడు. ఫక్త్ ఉత్తరాంధ్రా భాషలో, యాసలో ఆయన ప్రత్యర్ధులను కడిగిపారేస్తారు. చంద్రబాబుకు బొత్స చేత తలంటించుకోవడం ఎంత సరదావో తెలియదు కానీ తరచూ విజయనగరం పెద్దాయన ఇలా బాబుకు అడిగేస్తూంటారు, కడిగేస్తూంటారు.
తాజాగా వేయి రూపాయల ఆర్ధిక సాయం పేదలకు ఇచ్చే విషయంలో కూడా టీడీపీ రాధ్ధాంతం చేస్తోంది. చంద్రబాబు మొదలు తమ్ముళ్ల వరకూ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. నానా యాగీ చేస్తున్నారు.
దీంతో ఒళ్ళు మండిన బొత్స చంద్రబాబు మీద బాగానే ఫైర్ అయ్యారు. బాబుకు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతోందా అంటూ తగులుకున్నారు. అన్నం తిన్నవారు ఎవరైనా ఈ సమయంలో రాజకీయాలు చేస్తారా అని దారుణమైన మాటలనే వాడేసారు.
తాము అధికార పక్షంలో ఉన్నాం, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన కర్తవ్యం మా మీద ఉంది. చంద్రబాబు మాదిరిగా పొరుగు రాష్ట్రంలో హాయిగా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పలేముగా అంటూ సెటైర్లు వేశారు.
రాజకీయాలు తరువాత చేసుకోవచ్చు, కరోనా విపత్తులోనైనా వివేకంతో ఉండాలంటూ బాబు గారికి ఆయన గ్యాంగ్ కి బాగానే క్లాస్ పీకారు. మొత్తానికి ఒకటి అనడం నాలుగు తినడం బాబుకు, తమ్ముళ్ళకు అలవాటే. మరి బొత్స యాసను, ఆయన వాడిన భాషను తప్పుపడతారా, అందులో అర్ధం వెతుక్కుని గమ్మునుంటారా అన్నది పచ్చ పార్టీ నేతలకే వదిలేయాలి.