అసలే కేసీఆర్. మాట మాట్లాడితే బుల్లెట్లా దూసుకెళుతాయి. ఆ బాధ ఏంటో బుల్లెట్ తగిలిన వాడికే తెలుస్తుంది. ఇప్పుడీ మాటలన్నీ ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ గురించే. తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో కొన్ని పత్రికల్లో వచ్చిన రాతలపై ఫైర్ అయ్యాడు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఆ పిచ్చిరాతలు రాసిన పత్రిక ఆంధ్రజ్యోతే. రాయించిన చిల్లర వ్యక్తి ఆర్‌కేనే. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కేసీఆర్ హెచ్చరించింది కూడా ఆర్‌కేనే.
ఈ నెల 5న ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్‌లో “రక్షణ ఏదీ?” శీర్షికతో ఫస్ట్ పేజీలో కథనాన్ని వండి వార్చారు. ఈ కథనానికి సబ్ హెడ్డింగ్స్‌గా …
“వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత; రాష్ట్రంలో 6118 పీపీఈ సూట్లు-వారం రోజులకు కూడా సరిపోని స్థితి” తదితరాలు ఇచ్చారు. అలాగే కథనం చివర్లో తెలంగాణ సర్కార్‌ను కించపరిచేలా రాశారు.
“గాంధీ ఆస్పత్రిలో వైద్యులకు పీపీఈలు లేవని, ఎన్నిసార్లు సర్కార్‌కు మొరపెట్టుకున్నాపట్టించుకోవట్లేదని, పీపీఈ కిట్ల కోసం దాతలు ముందుకు రావాలని కోరుతూ గాంధియన్స్ ఫైట్ కొవిడ్-19 పేరుతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది” అని రాశారు.
ఇలాంటి రాతలు సహజంగానే కేసీఆర్‌కు కోపం తెప్పించాయి. అందుకే కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
“కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నయ్. వైద్యులకు రక్షణేదీ.. అని రాస్తున్నయ్. పీపీఈ కిట్లు లేవా? 40వేలున్నయ్ మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతం. ఎంతో చిత్తశుద్ధితో, ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వెకిలి వార్తలు రాస్తరా? ఈ సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి. వారికి శిక్ష తప్పదు. మీరు రాసేదాంట్లో వాస్తవం లేదు” అని ఆంధ్రజ్యోతి పేరు చెప్పకుండానే తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. కేసులు పెడతామని కూడా హెచ్చరించాడు.
“వక్రబుద్ధి ఉన్నవాళ్లు సక్రమంగా మారాలి. తర్వాత మీ ఇష్టం. అది మీ ఖర్మ. ఇప్పటికైనా క్లీన్‌మైండ్ ఉండాలి. వీరికి సరైన సమయంలో సరైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లు ప్రజాద్రోహులు, దేశద్రోహులు. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది. మామూలుగా చెప్పడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి ” అని ఆర్‌కేను కేసీఆర్ హెచ్చరించాడు. ఆర్‌కేను ప్రజా ద్రోహి, దేశ ద్రోహి అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటదని, మామూలుగా చెప్పడని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆర్‌కేను ఓ రేంజ్‌లో హెచ్చరించాడు.
బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ఓ పత్రికాధిపతిని హెచ్చరించిన దాఖలాలు ఉండవేమో. అది కూడా పబ్లిక్‌గానే. బహుశా ఏ పత్రికాధిపతి కూడా దేశం ఓ పెద్ద విపత్తులో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర రాతలు రాసి ఉండరేమో! ఆంధ్రప్రదేశ్‌లో ఏం రాసినా సీఎం జగన్ ఏమీ చేయలేకపోవడంతో పాటు పట్టించుకోవడం లేదు. ఆ అలుసుతోనే తెలంగాణలో కూడా ఆర్‌కే తోక జాడించాలని చూశాడు. దానికి పర్యవసానం ఏంటో కేసీఆర్ హెచ్చరికతో అర్థమైంది. దేవునికైనా దెబ్బే గురువని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇక మీదట ఆర్‌కే ఒళ్లు దగ్గర పెట్టుకుని వార్తలు రాయాల్సిన పరిస్థితి. అంతేగా మరి.