యంగ్ ఏజ్ లో కొంతమంది దర్శకులు మంచి మంచి సినిమాలు తీస్తారు. తమ తొలి సినిమాల్లో వాళ్లు తమ సత్తా అంతా చూపిస్తారు. విజయవంతమైన సినిమాలు తీసిన అనుభవంతో కొన్నేళ్లు ఆ బాణీని కొనసాగిస్తారు. అయితే ఒక దశకు వచ్చాకా ఆ దర్శకులు ప్రేక్షకులకు బోర్ కొడతారు. వాళ్లు ఎంత తీసినా అవే సినిమాలను తిప్పి తిప్పి తీస్తారనే ముద్ర పడిపోతుంది! స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు… కీర్తిని చాలా కాలం కలిగి ఉంటారేమో కానీ, వారు సినిమాలు తీస్తే మాత్రం బాక్సాఫీస్ వెలవెలబోతుంది!
ప్రతి దర్శకుడకూ రెండు రకాల టైమ్ ఉంటుంది. ఒకటి తామేం తీసినా ప్రేక్షకులు హిట్ చేసే టైము, రెండు వీళ్లేం తీసినా ప్రేక్షకులు చాలు పొమ్మనే టైము! ఈ ఉపోద్ఘాతం కేవలం సినిమాలకే కాదు.. రాజకీయ నేతలకూ చెల్లుబాటు అవుతుంది! దేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. ఒక్కో రాజకీయ నేత ఒక్కో నినాదంతోనో, తన మార్కుతోనో వస్తాడు.
అధికారం అనే సూపర్ హిట్ ను అందుకుంటాడు. ఆ అధికారాన్ని అందుకోవడంలో అతడికో ఫార్ములా ఉంటుంది. ఆ అధికారం చేజారినా ఆ ఫార్మాలకు మళ్లీ పదును పెట్టి ఇంకోసారి అధికారాన్ని అందుకుంటాడు. మరోసారి కూడా అతడి ఫార్ములా విజయవంతం కావొచ్చు. అయితే.. ఎంత విజయవంతం అయినా.. అతడెంత పేరును తెచ్చుకున్నా.. ఒక దశ వచ్చాకా మాత్రం అతడి రాజకీయ జీవితం ముగుస్తుంది. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు, కాబోరు!
హఠాత్తుగా రాజకీయ తెర మీద నుంచి మాయం అయిన కొందరు నేతలను మినహాయిస్తే.. జీవిత చరమాంకం వరకూ తమ పదును కోల్పోని నేతలు అరుదుగా కూడా కనపడరు. ఇప్పటికే అలాంటి వాడి కోల్పోయిన నేతల జాబితా పెద్దది.
భారతీయ జనతా పార్టీ కురువృద్ధనేత ఎల్కే అద్వానీ తో మొదలుపెడితే.. వాడి కోల్పోయిన బరిసెలు, బల్లేలు ఎన్నో ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్, మాయవతి, లాలూ ప్రసాద్ యాదవ్.. ఇలాంటి జాబితా పెద్దదే. ఒక్కోరిది ఒక్కో స్థాయి. అయితే వీళ్లంతా ఒకప్పటి రాజకీయ సంచలనాలు. అధికారాన్ని అందుకున్న వారు. గొప్ప జనాదరణను పొందిన నేతలు. అయితే.. ప్రస్తుతం మాత్రం ఔట్ డేటెడ్! అందులో వారి తప్పేం లేదు. ప్రేక్షకుల అభిరుచి మారినట్టుగా, ఓటర్ల ఎంపిక కూడా మారింది. దీంతో వారు ఔట్ డేటెడ్ అయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మరొక వ్యక్తి ఉన్నారు. ఆయనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఔట్ డేటెడ్ ప్లాన్స్ తో, ఔట్ డేటెడ్ విధానాలతో, ఔట్ డేట్ మాటలతో, ఔట్ డేటెడ్ రాజకీయం చేస్తూ.. రోజు రోజుకూ తన స్థాయిని దిగజార్చుకుంటున్న నేత చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడి అంకం పూర్తయ్యింది. ఆయన గతంలో ఎలా అధికారాన్ని అందుకున్నా, ఎలా ఓటమి పాలయినా.. ఇకపై మాత్రం తెలుగు రాజకీయ తెరపై ఆయనకు ఎలాంటి వ్యాక్యూమ్ మిగిలి లేదని స్పష్టం అవుతోంది.
అయినా ఇంకా పార్టీని తన ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకుని దాని అధ్యక్ష పదవి అని తనకు తాను ఇచ్చుకున్న పదవిని పట్టుకుని వేలాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ చంద్రబాబుకు ఏపీ ప్రజలు రిటైర్మెంట్ ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని ఇంకా ఆయన గమనించడం లేదు. తనను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని గ్రహించక నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరింత పలుచన అవుతున్నారు.
కే రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి వంటి దర్శకులు ఒకప్పటి స్టార్ డైరెక్టర్లే. తెలుగు సినిమా కమర్షియల్ స్టామినాను చూపించిన దర్శకులే. 80లలో వాళ్ల హవా సాగింది. 90లలో సో.. సో.. గా సాగింది. 2000లు వచ్చేసారికి వాళ్ల సినిమాలు బోర్ కొట్టాయి. 2010 వచ్చే సరికి ఇక ఆపండి బాబోయ్ అనేశారు ప్రేక్షకులు. వాళ్ల అనుభవం ఎంతో ఉంటుంది. ఆ అనుభవంతో ఇప్పటి తరానికి తగ్గట్టుగా వాళ్లు సినిమాలు తీయడం వాళ్లకు చేతగాక కాదు. ఆ టచ్చే ప్రేక్షకులకు నచ్చదిప్పుడు. దేనికైనా ఒక టైమ్ ఉంటుంది, ఎక్స్ పైరీ టైమ్ ఉంటుంది.
సినిమా దర్శకులు ఎలా బోర్ కొడతారో, రాజకీయం అనే వినోదంలో రాజకీయ నేతలు కూడా ప్రేక్షకులకు బోర్ కొడతారు. సరిగ్గా అప్పుడే తెరపై వారి వారసులు రంగ ప్రవేశం చేస్తూ ఉంటారు. ములాయం సింగ్ యాదవ్ ను ప్రజలు ఎన్నుకున్న దశలోనే ఆయన వ్యూహాత్మకంగా తన వారసుడిని తెర మీదకు తీసుకొచ్చాడు. అతడిని సీఎంగా చేశాడు. ఆ వారసుడు తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు అప్పటికే. దీంతో పీఠం అధిష్టించాడు.
ఇప్పటికీ పార్టీకి ఉనికిని అయితే కాపాడుతున్నాడు. మాయవతిది మరో వ్యథ. పార్టీలో వన్ అండ్ ఓన్లీగా ఉంటూ వచ్చారామె. వారసులు లేరు, రాజకీయ వారసులను తయారు చేసుకోలేదు. పార్టీలో ద్వంద్వ అధికార కేంద్రాలు ఉండకూడదని లెక్కలేశారేమో. ఏ పార్టీ మద్దతుదార్లు అయినా రేపటి నాయకత్వం వైపు ఆశగా చూస్తారు. ఆ ఆశలేనప్పుడు పార్టీ క్యాడర్ నిర్వీర్యం అయిపోతుంది. ప్రత్యామ్నాయ శక్తి అనే హోదా ఆ పార్టీ కి పోతుంది.
భారతీయ జనతా పార్టీ 2014లో కూడా అద్వానీ నాయకత్వంలోనే ఉండి ఉంటే? ఆయననే ఆ పార్టీ ఆ ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే? ఫలితాలు ఎలా ఉండేవో చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు. అద్వానీ సంఘ్ పరివార్ ముద్దుబిడ్డ. బీజేపీకి బేస్ మెంట్ వేసిన వ్యక్తి. ఒకప్పటి యాంగ్రీ పొలిటీషియన్.
వాజ్ పేయిలా సాత్వికుడు కాదు. కరడుగట్టిన హిందుత్వ వాది. ఇలా ఎన్ని అర్హతలున్నా.. ఆయన 2014లో బీజేపీకి ప్రధానమంత్రి అభ్యర్థి కాలేకపోయారు. అదే బీజేపీ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. బీజేపీ సిద్ధాంతాలకు మూలపురుషుడు అయినా.. అద్వానీని మరోసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటో సంఘ్ పరివార్ సిద్ధాంతకర్తలకు అప్పుడే అర్థం అయ్యింది. వాళ్లకు మరో అద్వానీ కావాలి కానీ, అద్వానీ కాదు! అప్పుడే వాళ్లకు మోడీ ఛాయిస్ అయ్యారు. ఆ తర్వాతి కథ అందరికీ తెలిసిందే.
ఇక తెలుగుదేశం కథకు వస్తే.. టీడీపీకి ఇప్పటికీ క్యాడర్ ఉంది. ఏపీలో ప్రత్యామ్నాయ శక్తి అనే ట్యాగ్ ఉంది. కుల బలం ఉంది. సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అయితే.. ఇవి మాత్రమే మళ్లీ అధికారాన్ని అందుకోవడానికి సరిపోవు. వీటన్నింటికీ తోడు.. సమ్మోహన శక్తి ఒకటి కావాలి. ప్రజల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పుట్టించగల పవర్ కావాలి. అది చంద్రబాబులో ఒకప్పుడు ఉండేదేమో కానీ, వయసు- ఆయన చేసిన రాజకీయంతో అదంతా ఇప్పుడు గల్లంతయ్యింది.
ప్రత్యేకించి ఆయన ముఖ్యమంత్రిగా చేసిన 2014-19ల మధ్యన ఆయన వ్యవహరించిన తీరు ప్రజల్లో ఆయన గ్రాఫ్ ను పతనం చేసింది. మాటలు మార్చడం, అవకాశవాదాన్ని ప్రదర్శించడం, రాజకీయాలు అంటనే విసుగెత్తిపోయే రీతిన వ్యవహరించడం, ఒక వ్యక్తిత్వం, విధానం అంటూ ఏమీ లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడటం, విచ్చలవిడి అవినీతి, కులప్రీతి, బంధుప్రీతి, చేతగాని తనయుడిని రాష్ట్రం మీద రుద్దాలని చూడటం… ఇవన్నీ చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించాయి. 1995-2004ల మధ్యన చంద్రబాబు నాయుడు పూర్తి రూపం బయటపడకుండా మీడియా విపరీతంగా ఐరన్ తెరలు ఏర్పాటు చేసింది.
చంద్రబాబును ఎవరైతే ముఖ్యమంత్రిని చేశారో, వారు వార్తలుగా ప్రజలకు ఏం చెబితే అదే నమ్మే పరిస్థితి ఉండేది. అయితే ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పే రోజుల్లో కూడా.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి ఏపీలోనే గల్లంతయ్యింది. మీడియా ఇనుప తెరలు వేసి చంద్రబాబును ప్రొజెక్ట్ చేసినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు టీడీపీ చిత్తు చేశాయి. ప్రజాగ్రహం అలా వెల్లువెత్తింది. ఇక రాష్ట్ర విభజన అంశంలో చంద్రబాబు నాయుడు ఎన్ని వంకర్లు పోయినా 2014లో ఆయనకు అధికారం లభించిందంటే.. అది ఆయనను చూసి అయితే కాదు అనేది బహిరంగ సత్యం.
మోడీతో పొత్తు చంద్రబాబు రాజకీయ జీవితానికి ప్రాణం పోసింది. దేశమంతా ఆ సమయంలో వెల్లువెత్తిన కాంగ్రెస్ వ్యతిరేకత ఏపీలో కూడా వెల్లువెత్తింది. ఏపీలో అప్పటికే పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. జగన్ పై కావాల్సినంత విష ప్రచారం చేసింది చంద్రబాబు మీడియా. జగన్ అంటే కాంగ్రెస్ అనే భావనను ఒక సెక్టార్ ప్రజల్లో బలంగా కలిగించారు. వీటన్నింటికీ తోడూ పవన్ కల్యాణ్ మద్దతు కలిసి వచ్చింది. అన్నీ కలిస్తే.. కేవలం ఐదు లక్షల అదనపు ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అందుకుంది. 2014లో చంద్రబాబు నాయుడుది సాంకేతిక విజయమే తప్ప.. ఆయనే రావాలి అని ప్రజలు బలంగా కోరుకుని ఇచ్చిన తీర్పు కాదు అది.
అలా అధికారాన్ని దక్కించుకున్నాకా అయినా చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రజల నమ్మకాన్ని చూరగొనాలనే ప్రయత్నం చేశారా? అంటే.. ఐదేళ్ల పాలనలో తనను తను ఎంతగా తక్కువ చేసుకోవచ్చో అంతగానూ చేసుకున్నారు. చివరకు ఎవరిపై వ్యతిరేకతతో ప్రజలు తనకు అధికారాన్ని కట్టబెట్టారో ఆ కాంగ్రెస్ తోనే చేతులు కలిపారు. ఎవరి వేవ్ తో అయితే తను అధికారాన్ని అందుకున్నదీ మరిచిపోయి .. బీజేపీతో పంచుకున్నంత కాలం అధికారాన్ని పంచుకుని చివర్లో ప్లేట్ ఫిరాయించారు. ఇలా ఒకరకంగా కాదు.. ప్రజల సహనానికి పరీక్షలా సాగింది చంద్రబాబు పాలన. దాని ఫలితాలు 2019 ఎన్నికల ఫలితాల్లో కనపడ్డాయి.
కొనసాగుతున్న అదే తీరు!
2019 ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు నాయుడు ఏదైనా గుణపాఠాన్ని నేర్చుకుని ఉంటే.. గత రెండేళ్లుగా ఆయన తీరు ఇలా అయితే ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు ఏ తీరును అనుసరించి అధికారాన్ని కోల్పోయారో.. ఇప్పటికే అదే అవకాశవాదం, అడ్డగోలు తనాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. బీజేపీ భజన చేయడం ఆయన చేస్తున్న మరో రొటీన్ పొరపాటు.
కాంగ్రెస్ తో ఒకసారి, బీజేపీతో మరోసారి చేతులు కలిపి తను జనం మధ్యకు వెళ్తే వాళ్లు చేతిలో ఏది ఉంటే దాంతో వేస్తారు, తప్ప ఓట్లు వేయరు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించలేకపోతున్నట్టున్నారు! చంద్రబాబునాయుడు ఎంత వినయం ప్రదర్శించినా అది నక్క వినయం అయిపోతోంది. ఇన్నేళ్ల ఆయన రాజకీయ పోకడల ఫలితం అది.
ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారీ నమ్ముతారేమో.. కానీ.. దేనికైనా ఒక హద్దుంటుంది. చంద్రబాబు విషయంలో ఆ హద్దులు దాటిపోయాయి. ఇక ఆయన తలకిందుల తపస్సు చేసినా ఏపీ ప్రజలు నమ్మే అవకాశాలు లేవని పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పూర్తి స్పష్టత వచ్చింది!
వారసుడు సత్తా చూపలేకపోవడం మరో మైనస్!
ములాయం, లాలూ.. వీళ్లంతా ఆయా రాష్ట్రాల్లో చంద్రబాబు కన్నా గట్టి మాస్ లీడర్లు ఒకప్పుడు. వాళ్లు ఏం చేసినా కొన్నేళ్ల వాళ్ల రాజకీయం నడిచింది. అయితే.. వాళ్ల కథ ముగిసింది. కానీ.. వాళ్ల వారసులు అందుకున్నారు! ములాయం వారసులు అఖిలేష్ ఎస్సెట్ అయ్యాడు. ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన అఖిలేష్ కు మళ్లీ కాలం కలిసొస్తే సీఎం అవుతాడేమో అనే భావన మిగిలే ఉంది. యూపీలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎస్పీకి అవకాశం ఉంటుంది, ఆ ఎస్పీకి టైమ్ వచ్చినప్పుడు అఖిలేష్ దాన్ని సద్వినియోగం చేసుకోగలడు.
ఇక లాలూ జైల్లో ఉన్నా.. అతడి తనయుడు ఉద్ధండపిండాలను ఎదుర్కొని తన పార్టీ ఉనికిని మళ్లీ చాటాడు. అయితే.. చంద్రబాబుకు వారసుడు కూడా ఉన్నా.. అతడు ప్లస్ కాకపోగా, పెద్ద మైనస్ కావడం టీడీపీ భవితవ్యానికే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పాటికే చంద్రబాబు నాయుడు కనీసం పార్టీ పగ్గాలను, వ్యవహారాలను పూర్తిగా లోకేష్ నాయుడు చేతిలో పెట్టాల్సిందేమో. నలుగురి మధ్యకు వస్తే లోకేష్ ఏం మాట్లాడతాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎవరో పోస్టు చేసే ట్వీట్లతో లోకేష్ ఎప్పటికీ నాయకుడు కాలేడని వాళ్ల సొంత సామాజికవర్గం వాళ్లే అనుకుంటూ ఉంటారు.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడే మళ్లీ తెర మీద 80 ల నాటి తన కుటిల రాజకీయాన్నే చేస్తే.. ఈ తరం అటు వైపు చూడటం కూడా లేదు. కొత్త తరం ఓట్లేస్తోంది, చంద్రబాబు నాయుడేమో పాత తరం రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ తరం విసుగ్గా చూసే అవకాశావాదాన్ని చూపుతున్నారు. నవ్వులపాలవుతున్నారు. రాజకీయ నేత అంటే అతడి అవకాశవాదాన్ని క్షమించే రోజులు పోయాయి. అవి మధ్యలో వచ్చాయి, మధ్యలోనో పోయాయి. ఈ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. ఇన్నేళ్లూ ఆ మినహాయింపును పొందిన చంద్రబాబు నాయుడు మళ్లీ అవకాశవాదం కోటా కింద మళ్లీ తన రిజర్వేషన్ ను కోరుతున్నట్టుగా ఉంది ఆయన తీరంతా.
అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు వింటే.. ఆయనేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అంతుబట్టని పరిస్థితి. ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్టుగా ఆయన మానసిక ఆరోగ్యం పట్ల అనుమానాలు బలపడేలా ఉంటున్నాయి ఆయన ఊకదంపుడు ప్రసంగాలు. పంచాయతీ ఎన్నికలకు ఆయన మెనిఫెస్టోను విడుదల చేయడం టీడీపీ వీరాభిమానులను కూడా నిస్తేజపరిచి ఉండవచ్చు.
ప్రజల్లో ప్రతీదీ కౌంట్ అవుతూ ఉంటుంది. ఆపై చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి బూతులు మాట్లాడుతూ ఉన్నారు మైకుల ముందు. చంద్రబాబు నాయుడు ఆఫ్ ద రికార్డుగా ఎలా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లకు అటెండ్ అయిన జర్నలిస్టులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆన్ ద రికార్డుగా ఆయనే తన తీరును చాటుకుంటూ ఉన్నారు. మనవడికి సంస్కారాన్ని నేర్పాల్సిన వయసులో ఒక మాజీ ముఖ్యమంత్రి వాడూ, వీడు, పోటుగాడా, పీకుతాడా.. అంటూ మాట్లాడటం.. బహుశా ఆయన రాజకీయ ఫ్రస్ట్రేషన్ కూ, పతనావస్థకు నిదర్శనం కాక మరేమటి?
పంచాయతీ ఎన్నికలతో చంద్రబాబు నాయకత్వం పట్ల ఏపీ ప్రజల విముఖత ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమైంది. ఇక మున్సిపోల్స్- ఎంపీటీసీ-జడ్పీటీసీ పోల్స్ తో అది మరింతగా స్పష్టంగా బయటపడే అవకశాలున్నాయి. ఆ ముచ్చట కాస్తా ముగిస్తే, మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ చంద్రబాబు చేసేదంతా ప్రహసనం అవుతుంది. నెక్ట్స్ సార్వత్రిక ఎన్నికలు.. ఏపీ రాజకీయ చిత్రంపై చంద్రబాబును తెరమరుగు చేయవచ్చు.
హిమ