ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒట్టి గన్ మాత్రమే అని, బుల్లెట్లు లేవని వ్యాఖ్యానించిన టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ పై పంచ్ లు వేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. లోకేష్ కు తెలియనట్టుగా ఉంది కానీ, ఆయనకు బుల్లెట్ లు దిగి రెండేళ్లు అయ్యాయని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో లోకేష్ కు బుల్లెట్లు దిగాయని.. అయితే ఆయనకు ఆ విషయం అర్థం కావడం లేదన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకదాంట్లో ఈ డైలాగ్ ఉంటుంది. లావుపాటిగా ఉన్న కామెడీ విలన్ ను ఉద్దేశించి తారక్ ఈ డైలాగ్ చెబుతాడు. నీకు తోలుమందం ఎక్కువై అర్థం కావడం లేదు, నీకు బుల్లెట్ దిగి చాలాసేపైంది.. అంటూ ఎన్టీఆర్ సరదా డైలాగ్ ఒకటి చెబుతాడు.
సరిగ్గా లోకేష్ ను ఉద్దేశించి అలాంటి డైలాగ్ నే పేల్చాడు కొడాలి నాని. ఏరి కోరి మంగళగిరికి వెళ్లి పోటీ చేసి, అక్కడ గెలవలేక, ఓటమిని మూటగట్టుకున్నాకా కూడా లోకేష్ ఇంకా జగన్ గన్ను మాత్రమే బుల్లెట్లు లేవంటూ ఉండటాన్ని నాని ఈ తరహాలో ఎద్దేవా చేశారు. 151 సీట్లలో తెలుగుదేశం పార్టీని చిత్తు చేసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, లోకేష్ ఇంకా ఏం కోరుకుంటున్నారు? అన్నట్టుగా నాని ప్రశ్నించారు.
మంగళగిరిలో ఓటమి పాలైనా.. చాల్లేదా, 151 చోట్ల చిత్తైనా ఇంకా నొప్పి తెలియలేదా.. దిగిన బుల్లెట్లు చాలవా, స్వయంగా నీకే దిగినా, రెండేళ్లు గడుస్తున్నా తెలియనట్లేదా? అని నాని లోకేష్ ను ప్రశ్నించారు.
అయినా లోకేష్ కు నిజంగానే నొప్పి తెలుస్తున్నట్టుగా లేదు! నామినేటెడ్ పదవితో మంత్రి అయిపోయి, అధికారాన్ని వెలగబెట్టి, ఆశలు పెట్టుకున్న ప్రాంతంలోకి వెళ్లి పోటీ చేస్తే.. చిత్తుగా ఓడిపోయాకా, మళ్లీ మాట్లాడటానికి ఎవరైనా కాస్త జడుస్తారు.
తండ్రి సీఎంగా ఉండగా, తను మంత్రి పదవిని పొంది, ఆ హోదాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తు అయిన తర్వాత.. మళ్లీ తలెత్తుకోవడం ఈజీ ఏమీ కాదు. అయితే అలాంటి ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా పైకి మాత్రం అవేం లేవన్నట్టుగా.. లోకేష్ మాట్లాడుతూ ఉంటారు. అది కూడా హద్దుల్లేకుండా బూతులు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన నువ్వు ముఖ్యమంత్రిని, మంత్రులను ఉద్దేశించి బూతులు మాట్లాడటం ఏమిటి? అంటూ జనాలు ఆలోచించరనేది లోకేష్ ఫీలింగ్ కాబోలు!