ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ ఆర్కేపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పౌరుషం ప్రదర్శించారు. తానన్న మాటకు వీర్రాజు కట్టుబడ్డారు. తన పర్యటనకు ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌ను బీజేపీ ఆహ్వానించకపోవడం గమనార్హం. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై ఏబీఎన్ చానల్లో జరిగిన దాడిని నిరసిస్తూ, ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ మీడియా గ్రూపును బహిష్కరిస్తున్న ఏపీ బీజేపీ శాఖ మూడు రోజుల క్రితం ప్రకటించింది.
“తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది.
రాష్ట్ర బీజేపీ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ, ఏబీఎన్ చానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి, వారిని పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, ఆ చానల్‌పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర అనువైన చర్యలకై పార్టీ ఉపక్రమిస్తుంది” అని బీజేపీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నిర్వహించిన మీడియా సమావేశానికి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ను ఆహ్వానించారు. ఈ విషయంపై తన వారాంతపు కొత్తపలుకులో ఆర్కే ప్రస్తావించడంతో పాటు ప్రశ్నించారు. ఆర్కే ఏమన్నారంటే…
“మీరు వద్దనుకున్నాక మీ వాళ్లను పిలిచి స్టూడియోలో కూర్చోబెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. అయితే తన నిర్ణయాన్ని పార్టీ నాయకులే గౌరవించరన్న అనుమానం సోము వీర్రాజును పట్టి పీడిస్తున్నట్టుంది. ఆయన అనుమాన పడుతున్నట్టుగానే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశానికి మా సంస్థలను ఆహ్వానించారు. తన ఆదేశాలను ఉల్లంఘించినందుకు కన్నాపై వీర్రాజు ఏ చర్యలు తీసుకుంటారో తెలుసుకోవాలని ఉంది” అని వీర్రాజును ఆర్కే దెప్పి పొడిచారు.
ఈ నేపథ్యంలో నిన్న విశాఖలో సోము వీర్రాజు పర్యటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో దశావతార కేసులతో ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ గెలిచేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాట వినని వారిపై కేసులు, అనర్హత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రౌడీ షీట్లు, సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తూ పది రకాల కేసులు నమోదు చేస్తున్నారని వీర్రాజు విమర్శించారు.
కానీ సోము వీర్రాజు పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వార్త రాకపోవడం గమనార్హం. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లకు ఆహ్వానం అందలేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పిలచని వారి వార్తల్ని తామెందుకు రాయాలనే భావన ఆంధ్రజ్యోతిలో కనిపించింది. మొత్తానికి పరస్పరం పట్టింపులకు పోతున్నట్టే కనిపిస్తోంది. అయితే బహిష్కరణ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసే క్రమంలో సోము వీర్రాజు పౌరుషంగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.