రేప్ క్యాపిటల్ ఢిల్లీ మరో బాలిక జీవితంలో చెరగని చేదును మిగిల్చింది. వీధికుక్కలనుంచి తప్పించుకోబోయిన ఓ బాలిక కామాంధుడికి బలైన ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
ఈస్ట్ ఢిల్లీలోని శశి గార్డెన్ పరిసరాల్లో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… స్థానిక బస్తీలో నివసించే పదిహేనేళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం పచారీ కొట్టుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా అక్కడి వీధికుక్క ఒకటి అరుస్తూ బాలిక వెంటపడింది. దీంతో బాగా భయపడిన బాలిక… పరుగులు తీస్తూ ఒక గుడి వెనుకకు వెళ్లి అక్కడ ఉన్న పొదల్లో దాక్కుంది. ఆ వీధి కుక్క వెళ్లిపోయింది గాని పొదల్లో అప్పటికే మాటు వేసి ఉన్న మానవ మృగాన్ని ఆమె గుర్తించలేదు.
ఆమె పొదల్లో నుంచి లేవబోయేంతలో అక్కడే కాపు కాసి ఉన్న ఓ కామాంధుడు ఆమెని పక్కనే ఉన్న తన ఇంట్లోకి లాక్కుపోయాడు. ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. సంగతి ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించి వదిలేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఆలస్యం అవడంపై తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం చెప్పేసింది.
దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు జరిగిన వైద్య పరీక్షలు రేప్‌ను నిర్ధారించాయి. దీంతో పోలీసులు బాలిక చెప్పిన చిరునామా ప్రకారం నేరం జరిగిన ఇంటిపై దాడి చేశారు. అయితే నిందితుడు అప్పటికే తప్పించుకున్నాడని తెలిసింది. ఇంత ఘాతుకానికి పాల్పడింది ఒక టీనేజర్ అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. అప్పటికే అతడు పలు రకాల సంఘ వ్యతిరేక చర్యలతో అక్కడ పేరు పడ్డాడని, డ్రగ్ అడిక్ట్ కూడానని పోలీసులకు స్థానికులు చెప్పారు.
ఇటీవలే ఇద్దరు మైనర్ బాలికల రేప్ అనంతరం ఇలాంటి కేసులపై మరణదండనే సరైందని సిఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇలాంటి కేసుల్లో నిందితుడు మైనర్ అయినప్పటికీ సదరు చట్టాల్ని సవరించైనా కఠినంగా శిక్షించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.