ఇప్పుడు కాంగ్రెసు పార్టీ రాజకీయాల గురించి రాయబోతున్నాను. దాని గురించి తెలుసుకుంటే తక్కిన అన్ని పార్టీల గురించి తెలుసుకున్నట్లే. ఎందుకంటే కాంగ్రెసు పార్టీ ఆదర్శాలతో ప్రారంభమై, ఆచరణలో అవి సాధ్యంకాక, ఎన్నికలలో విజయం సాధించడమే గమ్యం అనే ఉచ్చులో పడింది. దాని విధానాలను విమర్శిస్తూ ప్రత్యామ్నాయంగా పుట్టుకుని వచ్చిన పార్టీలన్నీ అదే బాట పట్టాయి. ప్రభుత్వానికీ, పార్టీకి మధ్య గీతను చెరిపివేశాయి. వారసత్వ రాజకీయాలను దిగుమతి చేసుకున్నాయి. అంతఃకలహాలతో చీలాయి.
కాంగ్రెసు పార్టీ విలువలు క్రమేపీ పతనం అవుతూ వచ్చాయి. మొదట్లో యిలా వుండేది కావు. ఆ పరిణామక్రమం గమనించినపుడు మనకు ప్రజాస్వామ్యంలో వున్న క్లిష్టత అవగతమవుతుంది. 1947 వరకు జరిగిన స్వాతంత్య్రోద్యమానికి కాంగ్రెసు నాయకత్వం వహించింది. స్వాతంత్య్రానంతరం ఏర్పడబోయే ప్రభుత్వవిధానం ఎలా వుండాలన్న విషయంలో భేదాభిప్రాయాలు ఎన్ని వున్నా అందరూ కాంగ్రెసు ఛత్రం కిందే పనిచేశారు. ఇతర పార్టీల్లో సభ్యత్వం వున్నా, కాంగ్రెసు సభ్యులుగా కొనసాగారు. భారతదేశంలో ఎన్ని వైరుధ్యాలున్నాయో కాంగ్రెసులో కూడా అన్ని వుండేవి. ఒకరు ఒక పక్కకు లాగితే మరొకరు యింకో పక్కకు లాగేవారు. ఇలా వుంటేనే అది భారతీయుల ఆశలను ప్రతిబింబిస్తుందని, కాపిటలిస్టుల నుంచి పేదలవరకు అన్ని వర్గాల ఆమోదాన్ని పొంది, పటిష్టంగా వుంటుందని నెహ్రూ నమ్మాడు. ఎందుకంటే స్వాతంత్య్రానికి పూర్వమే కాదు, తరువాత కూడా కాంగ్రెసుకే అన్ని ఓట్లూ, సీట్లూ రాలేదు. 1952 లోకసభలో ప్రతిపక్షాలకు 26% సీట్లు వచ్చాయి. 1957లో 25% సీట్లు, 1962లో 28% సీట్లు తెచ్చుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే మొత్తం ఎసెంబ్లీ సీట్లలో 1952లో 32%, 1957లో 35%, 1962లో 40% గెలిచాయి. ప్రతిపక్షాల ఓట్లన్నీ కలిపితే కాంగ్రెసు ఓట్ల కంటె ఎక్కువే వుండేవి. అయితే ప్రతిపక్షం పలురకాలుగా విడిపోయి వుండేది కాబట్టి కాంగ్రెసు గెలిచేది. ఈ విషయం గుర్తెరిగిన నెహ్రూ సోషలిస్టులు, కమ్యూనిస్టులు కాంగ్రెసులో అంతర్భాగంగానే కొనసాగాలని, వారి సాయంతో కాంగ్రెసును తను కోరుకున్న సోషలిస్టు పంథాలో నడిపిస్తూ పేదలకు సన్నిహితంగా తీసుకెళ్లాలనీ కోరుకున్నాడు.
కానీ సర్దార్ పటేల్‌కు అది యిష్టం లేదు. ఆయనకు కమ్యూనిజమన్నా, సోషలిజమన్నా పడదు. నెహ్రూ, పటేల్ యిద్దరూ మహానుభావులే, నిజాయితీపరులైన దేశభక్తులే. చాలా విషయాల్లో వారికి ఏకాభిప్రాయం వుంది. రెండు మౌలికమైన విషయాల్లో మాత్రం తేడా వుంది. పటేల్‌కు పెట్టుబడిదారీ విధానమంటే మక్కువ, నెహ్రూకు సోషలిజమంటే మక్కువ. రాజకీయాల్లో మతాన్ని రంగరించడం నెహ్రూ సహించలేడు, పటేల్‌కు అభ్యంతరం లేదు. నెహ్రూ ఆదర్శవాది, ఆవేశపరుడు. పటేల్ ఆచరణవాది, సమర్థపాలకుడు. ప్రజల్లో యువకుడు, ఆదర్శవాది ఐన నెహ్రూ అంటే మోజుంది. అది గ్రహించిన గాంధీ ప్రధాని పదవికి అతన్ని ఎంపిక చేశాడు. పటేల్ ఆ సంగతి అర్థం చేసుకుని నెహ్రూ నాయకత్వాన్ని ఆమోదించాడు. కానీ అతనితో విభేదించినప్పుడల్లా పిలిచి మాట్లాడేవాడు. ఇద్దరూ వాదించుకునేవారు. చివరిలో ఎవరి మాట నెగ్గితే ఆ ప్రకారం జరిగేది. పటేల్ పెద్దరికాన్ని నెహ్రూ మన్నించేవాడు. తనకిష్టం లేని పనులు జరిగినప్పుడు అభ్యంతరం తెలిపి వూరుకునేవాడు. వాళ్లిద్దరూ ఒకరి కొకరు పూరకాలుగా (కాంప్లిమెంటరీ) వుండేవారు. కాంగ్రెసుకు నెహ్రూ అనుయాయులెందరున్నారో, వ్యతిరేకులూ అంతేమంది వుండేవారు. వారు పటేల్‌ను ఆశ్రయించేవారు. కాంగ్రెసులో రైట్, లెఫ్ట్ ఆలోచనాధోరణులకు ప్రతీకలుగా నిలిచేవారు. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఒక సమతుల్యత తనంతట తానే ఏర్పడేది.
స్వాతంత్య్రం వచ్చాక పటేల్ కాంగ్రెసు పార్టీలో సభ్యత్వం వున్నవారు యితర పార్టీల్లో వుండడానికి వీల్లేదు అనే తీర్మానం చేయించాడు. దాంతో యికపై కాంగ్రెసు పార్టీ రైటిస్టు పార్టీగా వుండజాలదని భావించి సోషలిస్టులు, కమ్యూనిస్టులు కాంగ్రెసు పార్టీ విడిచి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోతే కాంగ్రెసుకున్న విశాలదృక్పథం క్షీణిస్తుందన్న భయంతో నెహ్రూ సోషలిస్టులను వెళ్లిపోవద్దని కోరాడు. వెళ్లిపోయినా మళ్లీ పార్టీలోకి తేవాలని ప్రయత్నించాడు. కానీ వాళ్లు వినలేదు. విడిగా వెళ్లి బావుకున్నదీ లేదు. నెహ్రూ కాలంలో పార్టీలో ప్రజాస్వామ్యం బాగా వుండేది. క్రమశిక్షణ వుండేది కానీ మరీ కఠినం కాదు. పార్టీలోకి ఎవరైనా చేరవచ్చు, విడిచి పోవచ్చు, మళ్లీ చేరవచ్చు. ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలూ పార్టీలో సభ్యులుగా వుండేవారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో స్థానిక నాయకులు పార్టీ అధినాయకులకు చేరవేసేవారు. అట్టడుగు వర్గాల ఆశలకు అనుగుణంగా పార్టీ తన విధానాలను ప్రకటిస్తూ వుండేది. రష్యా చైనా తరహా నియంతృత్వం మనకి పనికిరాదని, పెట్టుబడి పెట్టి కష్టపడేవారిని ప్రోత్సహించాలని, కానీ ప్రయివేటు సెక్టార్‌ను ఒక పరిమితికి మించి ఎదగనీయకుండా, పబ్లిక్ సెక్టార్‌ను బలోపేతం చేయాలని నెహ్రూ అనుకునేవాడు. 'సోషలిజం అంటే పేదరికాన్ని పంచడం, పెంచడం కాదు. సంపద వుండాలి, అధికోత్పాదన ద్వారా సంపద పెరగాలి. పెంచుకోవడానికి, సొంతంగా ఎదగడానికి అందరికీ సమానావకాశాలున్న ఎగాలిటేరియన్ సమాజం ఏర్పడాలి.' అని నెహ్రూ చెప్పేవాడు. అందుకే ఆయన కాలంలో కాంగ్రెసు పాటించిన విధానానికి లెఫ్ట్ ఆఫ్ సెంటర్‌గా ముద్ర పడింది. అంటే వామపక్షంవైపు మొగ్గు చూపేది కానీ పూర్తిగా వామ విధానం కాదన్నమాట. పటేల్‌ది రైట్ ఆఫ్ సెంటర్ విధానం. పెట్టుబడిదారులందరికీ ఆయన రక్షణ కల్పించేవాడు. అంతేకాదు, హిందూ మహాసభ పట్ల ఉదారంగా వుండేవాడు. ఆయన చిటికేస్తే వాళ్లు వచ్చి వాలేవారు. ఇవన్నీ నెహ్రూకు గిట్టేవి కావు. పార్టీని తమ విధానంలో నడిపిద్దామని యిద్దరూ ప్రయత్నించేవారు.
వీళ్లు యిలా అనుకుంటూ వుంటే అసలు పార్టీ ద్వారా మొత్తం ప్రభుత్వాన్నే అదుపు చేద్దామని కాంగ్రెసు అధ్యక్షుడు జెబి కృపలానీ ప్రయత్నించాడు. పార్టీ, ప్రభుత్వం రెండూ వేర్వేరు స్వతంత్ర సంస్థలనీ, ఒక వ్యక్తి రెండింటిలోనూ పదవులు అనుభవించకూడదని నమ్మిన నెహ్రూ 1946 నవంబరులో తనకు మధ్యంతర ప్రభుత్వంలో పదవి రాగానే కాంగ్రెసు అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అతని తర్వాత వచ్చిన కృపలానీ కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీకి ప్రభుత్వనిర్వహణలో పాలు వుండాలని, తమను సంప్రదించందే ప్రభుత్వం విధాన నిర్ణయాలేవీ తీసుకోకూడదనీ వాదించాడు. ప్రభుత్వం అనేది ప్రజలందరికీ చెందినది. పార్టీ కొందరికే చెందినది. రెండిటి మధ్య అంతరం వుండాలని నమ్మిన పటేల్, నెహ్రూ కృపలానీతో విభేదించారు. ప్రభుత్వ రహస్యాలను పార్టీనాయకులతో పంచుకోవడం అసాధ్యమన్నారు. పార్టీ దీర్ఘకాలిక ప్రణాళికలను, సిద్ధాంతాలను నిర్ణయిస్తే చాలని, ప్రభుత్వం రోజువారీ పనుల్లో జోక్యం చేసుకోనక్కరలేదని, ప్రభుత్వపు పనితీరును గమనించడానికి అసెంబ్లీ, పార్లమెంటు వున్నాయని, వారికి జవాబుదారీగా వుంటే చాలనీ వాదించారు. అలా అయితే పార్టీకి విలువేముంది అంటూ అలిగిన కృపలానీ 1947 నవంబరులో తన అధ్యక్షపదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడై ఒక ఏడాది వున్నారు. ఆయన తర్వాత భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు రెండేళ్లున్నారు. వాళ్లు ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదు. (సశేషం)
(ఫోటో – పటేల్, నెహ్రూ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)