కుమారికి… పేమ్రతో…!

''నువ్వన్నట్లు నిన్ను ప్రేమించడానికి సిద్ధూకి తగినంత 'మెథ్యూర్టీ' లేదు.  నీకైతే ఓ క్లారిటీ… 'బోల్డ'ంత మెథ్యూరిటీ      ఉన్నాయి కదా! ఆవారాగాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే సిద్ధూని ఏం చూసి లవ్‌…

''నువ్వన్నట్లు నిన్ను ప్రేమించడానికి సిద్ధూకి తగినంత 'మెథ్యూర్టీ' లేదు.  నీకైతే ఓ క్లారిటీ… 'బోల్డ'ంత మెథ్యూరిటీ      ఉన్నాయి కదా! ఆవారాగాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే సిద్ధూని ఏం చూసి లవ్‌ చేసావు? ఆ సమయంలో నీ మెథ్యూర్టీ ఏమైంది? ఈ క్వశ్చన్లకి నీ దగ్గర్నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్‌-'లవ్‌ఎట్‌ ఫస్ట్‌సైట్‌'.  మొదటి చూపులోని ప్రేమముందు 'మెథ్యూర్టీ' కూడా బలాదూర్‌ అనంటావు నువ్వు. అంటే…'మెథ్యూర్టీ' అనే పదాన్ని 'మెథ్యూర్డ్‌'గా వాడుకున్నావు. అంతేకాదు…'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌' అంటే ఏంటో కూడా నువ్వే ఓ సైన్స్‌ టీచర్లా చెప్పేసావు. ఓ వ్యక్తిని చూసీ చూడగానే మెదడులోని 12 నరాల్లో కలిగే రసాయనిక సంచలనం అదనీ…పాయింట్‌ ఫైవ్‌ సెకన్లో కలిగే భావావేశం అదనీ శాస్త్రీయంగానూ చెప్తూ-'నే చేసింది కచ్చితంగా కరెక్టే'నంటూ లాజికల్‌గా లాక్‌ చేస్తావు. అదేంటో…అనాలోచితంగా పడిపోయే శారీరక ఆకర్షణలాంటి 'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌'కి కూడా ఇంత తర్కమా? ఇంత విశ్లేషణా? ''

డియర్‌ కుమారి!

ఎక్కడ్నుంచి ఎలా మొదలెట్టాలో తెలీడంలేదు. కానీ, ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా! 'ఏజ్‌ ట్వంటీవన్‌…వెయిట్‌ ఫార్టీ ఎయిట్‌..నడుం కొలత ట్వంటీసిక్స్‌…'అంటూ అప్పుడప్పుడే పరిచయమవుతున్న ఓ అ'బ్బాయ్‌'ని కవ్విస్తూ, గలగలా నవ్వేస్తూ చెప్పకూడనవన్నీ చెప్పేస్తావు. క్యూరియాసిటీ కొద్దీ అతగాడు  ఆరాలు తీసి కూపీలు లాగబోతే ఆరిందలా ఫోజిస్తూ-'నా బైక్‌ ఎక్కడానికి, నన్ను ప్రేమించడానికి నేను మాత్రం చాలనా! నా బయోడేటా మొత్తం కావాలా?' అంటూ కలహిస్తూ… కన్వీనియెంట్‌గా కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తావు. 

పాపం సిద్ధూ…నువ్వు విసిరిన మోహాలవలలో చిక్కుకుని…అది అచ్ఛమైన ప్రేమో, ఒట్టి ఆకర్షణో, ఆటో, వేటో అర్ధం కాక సీనుసీనుకో సినిమా చూసేస్తాడు. సిద్ధూ అలా గందరగోళంలో పడి గిలగిలా కొట్టుకుంటుంటే నువ్వు మాత్రం 'బోల్డ'ంత 'స్థితప్రజ్ఞత'… అదే 'మెథ్యూర్టీ'ని   చూపిస్తావు. ఎంత 'మెథ్యూర్టీ' అంటే…తాము ప్రేమించినవాళ్లు మరొకరితో సన్నిహితంగా ఉంటే కలిగే ప్రేమకు పరాకాష్ట అనదగ్గ అసూయలాంటి మరో భావోద్వేగాన్ని నీకు తెలియపరచాలనుకున్న సిద్ధూ దగ్గర నువ్వు చాలా 'మెథ్యూర్డ్‌'గా బిహేవ్‌ చేసావు.  సిద్ధూకి కొత్త షర్ట్‌ ఇచ్చి…హెయిర్‌ని స్టయిల్‌గా సరిచేసి…ఒళ్లంతా పర్‌ఫ్యూమ్‌ పూసి…ఆపై, చేతుల్లో 'సేఫ్టీ' ఉంచి…మరీ పంపించేంత 'మెథ్యూరిటీ' అది. 'నువ్వు నా బాయ్‌ ఫ్రెండ్‌వి. నా బాయ్‌ఫ్రెండ్‌ అంటే ఇలాగేనా ఉండేది…నిన్ను చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్‌ కావాల్సిందే. నేనే పడిపోయాన'ంటూ అంతులేని ప్రేమ ఒలకబోస్తావు. అంతేనా! 'నువ్వు లీడ్‌ తీసుకోకు. మోమాటపడే మగాళ్లంటే ఆడాళ్లకు ఎంతో ఇష్టమ'ంటూ ఓ సిద్ధాంతాన్ని జనరలైజ్‌ చేస్తావ్‌. నీ మాటలు వింటుంటే  సిద్ధూలాంటి కుర్రాళ్లకి కునుకే రాదుసుమా! అయినా.. ఎక్కడో డౌటు. 'బార్‌కెళ్తుంది.. బీరు కొడ్తుంది.పబ్‌కెళ్తుంది… డాన్స్‌ చేస్తుంది… లవ్‌ చేయాలా? వద్దా? అనే డౌటు. సిద్ధూకి నీకున్నంత 'మెథ్యూర్టీ' లేదు కదా.. అందుకే అన్ని డౌట్లు. మరి, ఆ డౌట్లు తీర్చాల్సిన నువ్వే…పజిల్‌ని పజిల్‌గానే ఉంచేస్తూ క్లయిమాక్స్‌ దాకా ఓ లెవెల్లో ఆటాడుకున్నావు. 

సరే…నువ్వన్నట్లు నిన్ను ప్రేమించడానికి సిద్ధూకి తగినంత 'మెథ్యూర్టీ' లేదు.  నీకైతే ఓ క్లారిటీ… 'బోల్డ'ంత మెథ్యూరిటీ ఉన్నాయి కదా! ఆవారాగాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే సిద్ధూని ఏం చూసి లవ్‌ చేసావు? ఆ సమయంలో నీ మెథ్యూర్టీ ఏమైంది? ఈ క్వశ్చన్లకి నీ దగ్గర్నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్‌-'లవ్‌ఎట్‌ ఫస్ట్‌సైట్‌'.  మొదటి చూపులోని ప్రేమముందు 'మెథ్యూర్టీ' కూడా బలాదూర్‌ అని సింపుల్‌గా ఆన్సరిచ్చేస్తావు నువ్వు. అంటే…'మెథ్యూర్టీ' అనే పదాన్ని 'మెథ్యూర్డ్‌'గా వాడుకున్నావు. అంతేకాదు…'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌' అంటే ఏంటో కూడా నువ్వే ఓ సైన్స్‌ టీచర్లా చెప్పేసావు. ఓ వ్యక్తిని చూసీ చూడగానే మెదడులోని 12 నరాల్లో కలిగే రసాయనిక సంచలనం అదనీ…పాయింట్‌ ఫైవ్‌ సెకన్లో కలిగే భావావేశం అదనీ శాస్త్రీయంగానూ చెప్తూ-'నే చేసింది కచ్చితంగా కరెక్టే'నంటూ లాజికల్‌గా లాక్‌ చేస్తావు. అదేంటో…అనాలోచితంగా పడిపోయే శారీరక ఆకర్షణలాంటి 'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌'ని కూడా ఇంతలా తర్కించి విశ్లేషించే 'మెథ్యూర్టీ' కలిగిన నువ్వు నిన్ను నీవు నియంత్రించుకోలేక చటుక్కున ఫస్ట్‌ కిస్‌ ఎలా ఇచ్చేసావు?  చూసీచూడగానే అత్తరు తుఫానులా చుట్టేసి 'ఐలవ్‌యూ?' చెప్పేయడం…'మెథ్యూర్టీ' ఇచ్చిన సంస్కారమా? దానికీ వివరణ ఇస్తూ…కనిపించిన వెంటనే నచ్చేసిన నీకు వెనుకాముందు చూసుకోకుండా 'ఫస్ట్‌కిస్‌' ఇచ్చేసినంతమాత్రాన కేరక్టర్‌ లేనట్లు కాదు.. నీపై బోల్డంత ఇష్టమున్నట్లు…అంటూ నీదైన తర్కాన్ని వినిపిస్తావు. పాపం, అర్భకుడు…ఇదేమాట నువ్వు ఇంకెవరితోనైనా చెప్పావనుకోవడంలో తప్పేముంది? అలా డౌట్‌ పడకూడదంటే ఎలా? పైపెచ్చు-గతంలో ఏం జరిగిందో ఇప్పుడు నమ్మించలేనంటూనే…నమ్మకం ఉండాలంటూ ఉచిత సలహా పడేస్తావు. ఆపై- 'తప్పు చేస్తే తప్పు  చేసిన కుమారిని ప్రేమించు…తప్పు చేయకపోతే తప్పు  చేయని కుమారిని ప్రేమించం'టూ  సమ్మోహనంగా చూస్తావు. 

ఓ వ్యక్తిని చూడగానే శరీరంలో కలిగే సంచలనాల్ని ఏమంటారో నీకు బాగా తెలుసు?  అపోజిట్‌ సెక్స్‌ను చూసీచూడగానే శరీరంలో కలిగే రసాయనిక చర్యలే రాన్రాను ప్రేమగా మారి ఆ వ్యక్తితోనే కడవరకు జీవితాన్ని పంచుకునేంతగా ప్రేరేపిస్తాయి. ఆ పరిణామానుక్రమంలో అంతిమంగా కోరిక కూడా అంతర్లీనంగా ఉంటుంది. ముందు భౌతిక ఆకర్షణే తర్వాత మానసికానుబంధాన్ని అభిలషిస్తుంది. ఇదంతా క్షణాల్లోనే అంకురించి అంతకంతకూ పెరిగిపెద్దదవుతుంది. అయితే, ఆ ప్రేరణ అంకురించగానే…అదే  ప్రేమగా భ్రమించి…'ఐలవ్‌యూ' చెప్పేసి..హాల్స్‌ ఇచ్చేసి ఫస్ట్‌కిస్‌ ఇచ్చేసి… 'ఇదే ఫస్ట్‌కిస్‌…బాగా పెట్టానా?' అని అడగడం తొందరపాటుతనం కాదా?  ఆ తొందరపాటుని నీకు బాగా అలవాటైన 'మెథ్యూర్డ్‌' బిహేవియర్‌తో కాస్త అణచివేసి…నువ్వు  స్థిమితపడి…అతగాడూ నీ ధోరణిని అర్ధం చేసుకున్న తర్వాతనే 'లవ్‌ ఎక్స్‌ప్రెస్‌' చేస్తే బాగుండేదేమో? ఓహో! ఇన్‌స్టెంట్‌ లవ్‌లో ఈ లాజిక్‌ వర్తించదా? లేక, సినిమా ముందుకు కదలదా?

 'గుండెల్లో నేనే ఉన్నానంటుంది…ఎఫ్‌బీలో ప్రొఫైల్‌ పిక్‌ బన్నీదుంటుంది…లవ్‌ చేయాలా వద్దా?' అంటూ పొద్దస్తమానం నీగురించి వ్యతిరేక ఆలోచనల్తో సతమతమౌతూ సందిగ్ధంలో కొట్టుకుపోయే సిద్ధూకి మనసిచ్చేసావు. అదెలా? అని క్వశ్చన్‌ చేస్తే… గతాల స్వగతాలు లేకుండా ప్రేమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలంటావు. అలా అనుకోవడం కూడా ఓ షరతే కదా! ప్రేమ లో డౌట్లు ఉండకూడదు. నమ్మకమే ప్రధానమనే నువ్వు మాత్రం అనుమానాస్పదంగా బిహేవ్‌ చేయొచ్చు. ఆ విషయం మాత్రం నీతో జీవితం పంచుకోవాలనుకునే నీ లవర్‌ అడక్కూడదు. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఎవరెవరితోనో నువ్వు బైక్‌లో ఇంటికి వస్తూపోతుంటావు. అదేమంటే…ప్రొఫెషన్‌ వల్ల ఇంటికి చేరే అవసరం నిమిత్తం ఎవర్నోఒకర్ని ఆశ్రయిస్తానంటూ సింపుల్‌గా తేల్చేస్తావు. ఆ 'ప్రొఫెషనల్‌' అవసరాల్ని ఎవ్వరూ తప్పు పట్టరు కానీ…జరుగుతున్నదేంటో తెలీక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న అభాగ్య ప్రేమికుడి వేదనను కూడా అర్ధం చేసుకోవాలి కదా! …కోలేదు.  పైపెచ్చు నిన్ను ప్రేమించేంత 'మెథ్యూర్టీ' లేదని తేల్చేస్తావు.

అంతపెద్ద ముంబై సిటీలోనూ, మోడల్‌గా, సినిమాల్లోనూ ఎంతోమంది మగాళ్ల మధ్య పనిచేస్తున్నప్పటికీ… వేరెవరితోనూ కలగని 'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌' ఫీలింగ్స్‌…సిద్ధూపట్ల కలగడం కధానుగుణంగా ఆడియన్స్‌కి ఆశ్చర్యం కాదు. కానీ…లవ్‌ వ్యక్తీకరించేపద్ధతిలోని నీ 'మెథ్యూర్టీ'యే  అభ్యంతరం. 'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌' ప్రభావం గురించి నీకు సశాస్త్రీయంగా తెలుసు కానీ…ఆ 'లవ్‌'ను ఎలా ఎప్పుడు ఎక్స్‌ప్రెస్‌ చేయాలో మాత్రం తెలీదా? నచ్చిన వ్యక్తి బయోడేటాలు, గతాలు అవసరం లేని, అక్కర్లేని ప్రేమ నీది. అలాంటి ప్రేమ వాంఛనీయమా? అన్నదే ఇక్కడ ప్రశ్న. నువ్వన్నట్లే ఏ నేర చరిత్ర ఉన్నవ్యక్తితోనో 'లవ్‌ఎట్‌ఫస్ట్‌సైట్‌' ముడిపడితే…వచ్చే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావన్నది నీకు మాత్రం తెలీదా? సిద్ధూ ఫ్రెండ్సయిన ఆవారాగాళ్లు నీతో ఎలా బిహేవ్‌ చేసారో నీకు అనుభవైకవేద్యమే. 

అంతెందుకు? నువ్వెంతగానో ప్రేమించిన నీ సిద్ధూయే ఒకానొక దశలో-'నిన్ను వాడుకుని వదిలేసినా..ఫ్రెండ్స్‌మధ్య గర్వంగా ఉండేదం'టూ నీకే అడ్డం తిరిగాడు. మరినువ్వో…'నా నడుంకే అయిదువేలు ఇవ్వొచ్చ'ంటూ మాటిమాటికీ రెచ్చగొట్టావు. ఎంతసేపూ 'షేపులూ..బాడీ కొలతలచుట్టూనే సిద్ధూని తిప్పితిప్పి..నీది మాత్రం ప్రేమంటావు. అయిదొందలకు వస్తావా? అంటూ లవర్‌ని సరదాకోసం 'మేల్‌ప్రాస్టిట్యూట్‌'గా మార్చేసావు. ఒళ్లంతా వయసు అత్తరుపూసుకుని కాటేసే చూపుల్తో…చిట్టిపొట్టి స్కర్ట్‌లు, షార్ట్‌ల్లో కాట్‌వాక్‌ చేస్తూ ప్రొవోక్‌ చేసావు. 

ఇంతచేసినా… కుమారి 21 ఎఫ్‌…గా నువ్వు సిల్వర్‌స్క్రీన్‌పై చేసిన మాయాజాలం అంతాఇంతా కాదు. 'ఏం…మమ్మల్ని మీరడగొచ్చు కానీ…మేం అడక్కూడదా?' అంటూ అమాయకత్వాన్ని నటిస్తూ నువ్వు చెప్పే కబుర్లకి థియేటర్లో ఫిదా అయిన ఆడియన్సే…బయటకొచ్చి 'బాబోయ్‌!' అనుకుంటూ గుండెలు పట్టుకుంటున్నారు. ఔను…సినిమాలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ చుట్టూ 'వైఫై'లా కోరిక కమ్మేసింది. ఆపై అనుమానం. బోల్డ్‌గా మాట్లాడే కుమారి బాడీ కొలతల భాషే హాల్లోంచి బయటకొచ్చిన ఆడియన్స్‌ని వెంటాడుతోందంటే అతిశయోక్తి కాదేమో? ఈ కోవలో కొంతమందికి మినహాయింపు ఉంటుంది సుమా! 

సినిమాలో చూపించింది కుమారి లైఫ్‌… సిద్ధూపై కోరిక…ప్రేమ. అయితే, కుమారి పీడకలలాంటి గతమంతా ముంబైలోనే గడిచింది. అదే ముంబైలోని శక్తిమిల్స్‌లో ప్రొఫెషనల్‌ లేడీ ఫొటోగ్రాఫర్‌పై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఘటనకు కూడా ముంబై వేదిక. ముంబై రైల్వేస్టేషన్లో దిగిన ఆ అమ్మాయిని ఓ మగమృగం ఆటోఎక్కిస్తానని తనతో తీసుకెళ్లి అత్యాచారం చేసి…ఆపై కాల్చి చంపిన ఉదంతం అది.  ఆ ఒక్క ఇన్సిడెంటే కాదు…దేశరాజధాని ఢిల్లీలోని 'నిర్భయ' దారుణం కూడా యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. ఇలా మగమృగాళ్లు మహిళల్ని కాటేసేందుకు కాచుక్కూచుని వెంటాడి, వేధించి, చంపేస్తున్న నేపధ్యంలో 'కుమారి 21 ఎఫ్‌' తన బిహేవియర్‌ ద్వారా సమాజానికి అందిస్తున్న సంకేతాలేంటీ? సూచిస్తున్న సందేశమేంటీ? చాలామంది  'కుమారి'లు సమాజంలోనే ఉన్నారు. సినిమా సమాజానికి నిలువెత్తు దృశ్యరూపమే..అని సమర్ధించుకున్నప్పటికీ కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆ 'కుమారి'లను సెవన్టీఎంఎం స్క్రీనంతా పరిచి గ్లామరైజ్‌ చేయడం ఏమేరకు సబబు?  

 క్లయిమాక్స్‌ హృద్యంగా ఉన్నా…పస్టాఫ్‌లో ప్లే  అయ్యే బోల్డ్‌ దృశ్యాల్ని మళ్లీమళ్లీ చూస్తూ థియేటర్ల ముందు జాతర చేస్తోంది కుర్రకారు. 

'షార్ట్‌లు, స్కర్ట్‌లు వేసుకున్నవాళ్లంతా చెడిపోయినవాళ్లు కాదు…పోలీస్‌స్టేషన్‌కి వెళ్లినవాళ్లంతా ప్రాస్టిట్యూట్‌లు కారు…' అంటూ కుమారి క్లయిమాక్స్‌లో చెప్పినా…షార్ట్‌లు, స్కర్ట్‌ల అందాల్నే స్క్రీనంతా పరిచేసిన వాణిజ్యవ్యూహంలోనే కుమారి బోల్డ్‌నెస్‌ వెల్లువెత్తింది. ఆమేరకు సినిమా యూనిట్‌ కృషి ఫలించింది.  కుమారిని క్షమించే 'మెథ్యూర్టీ'ని సిద్ధూ సాధించినా…రీల్‌లైఫ్‌లో 'కుమారి'ని ఆదరించే 'మెథ్యూర్టీ'ని ఆడియన్స్‌ కనబరిచినా…రియల్‌లైఫ్‌లో ఈస్థాయి 'కుమారి' బోల్డ్‌నెస్‌ ప్రమోదం కాదు..ముమ్మాటికీ ప్రమాదమే! 

అర్ధం చేసుకోవాలనుకునే 'కుమారికి…ప్రేమతో'!

-పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌