షమ్మీ కపూర్ వేషాన్ని రాజేంద్ర కుమార్ వేషం లాగేసుకున్న సంగతి చెప్పాను కదా ! రాజేంద్ర కుమార్ వేషాన్ని షమ్మీ కపూర్ లాగేసుకున్న సంగతి కూడా చెప్తాను. 1967 ప్రాంతాల్లో అతని వద్దకు అతనితో అనేక హిట్ సినిమాలు తీసిన దర్శక నిర్మాత జె ఓమ్ ప్రకాష్ ఓ కథ పట్టుకు వచ్చాడు. 'సచిన్ భౌమిక్ రాసిన ఈ కథ నాకు నచ్చింది. జి.పి. సిప్పీ (ఇంకో నిర్మాత, తర్వాత కాలంలో 'షోలే' కూడా తీశాడు) క్కూడా చూపించాట్ట. వాళ్లింకా ఊగిసలాడుతున్నారు. నీకు నచ్చితే మనమే చేద్దాం.' అన్నాడు. ఓ బ్రహ్మచారి అనాథ పిల్లలకోసం అవస్థలు పడే కథ అది. రాజేంద్ర కుమార్‌కు బాగా నచ్చింది. 'నాకేమీ పారితోషికం అక్కరలేకుండా యీ సినిమా చేస్తాను.' అన్నాడు.
అది జరిగిన కొన్నిరోజులకు ఆశా పరేఖ్ ఒక నృత్యప్రదర్శన యిస్తూ సచిన్ భౌమిక్‌ను, ఓమ్ ప్రకాశ్‌ను, జిపి సిప్పీని, రాజేంద్ర కుమార్‌ను, షమ్మీ కపూర్‌ను ఆహ్వానించింది. అక్కడ పక్కపక్కన సీట్లలో కూచున్న రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్ కబుర్లలో పడ్డారు. 'మేరే పాస్ ఏక్ కమాల్ కా కహానీ ఆయా యార్' అంటూ రాజేంద్ర కుమార్ షమ్మీకి ఆ సినిమా కథ చెప్పాడు. జరిగినదేమిటంటే జిపి సిప్పీ ఆ కథను షమ్మీ కపూర్‌కే చూపించాడు. షమ్మీ పెద్దగా ఉత్సాహం చూపలేదు. దాంతో సిప్పీ చల్లబడ్డాడు. ఈ లోపున రచయిత ఓమ్ ప్రకాశ్‌కు చూపించడం జరిగింది. రాజేంద్ర కుమార్ కథపై చూపిన ఉత్సాహం చూడగానే షమ్మీకి ఆ కథ గొప్పదనం తెలిసివచ్చింది. 'తగ్గు, తగ్గు, ఆ కథ నేనే చేయబోతున్నాను.' అంటూ ఖరాఖండీగా చెప్పేశాడు షమ్మీ. ఆ సినిమానే సిప్పీ ఫిలిమ్స్‌వారు భప్పీ సోనీ దర్శకత్వంలో తీసిన ''బ్రహ్మచారి'' (1968). ఆ కథాంశం తీసుకుని ఇన్‌విజిబుల్ మాన్ కథను జోడించిన ''మిస్టర్ ఇండియా'' (1987) కూడా సూపర్ హిట్టే!
xxxxxxxxxxx
యాహూ కపూర్ – 'యాహూ' అనగానే రెండు గుర్తుకు వస్తాయి. ఒకటి ఇంటర్నెట్, మరొకటి ''జంగ్లీ'' సినిమాకై మహమ్మద్ రఫీ పెట్టిన కేక ! రెండింటికీ షమ్మీ కపూర్ లింకుంది. ''జంగ్లీ'' (1961) సినిమాలో తెరపై 'యాహూ, చాహే ముఝే కోయీ జంగ్లీ కహే' అంటూ కేక పెట్టి యువతరాన్ని ఓ వూపు వూపినది అతనే. అలాగే భారతదేశపు తొలి యింటర్నెట్ వాడకందార్లలో అగ్రస్థానమూ అతనిదే. అందుకే ఎథికల్ హాకర్స్ అసోసియేషన్ వారు నెలకొల్పిన 'ఇంటర్నెట్ యూజర్స్ క్లబ్ ఆఫ్ ఇండియా' అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
అప్పట్లో హిందీ సినిమా హీరోలందరి తీరూ ఒకలా వుండేది, షమ్మీ కపూర్‌ది భిన్నంగా వుండేది. సినిమాలలో ప్రవేశించిన తొలి దినాల్లో షమ్మీ కూడా యితరుల బాటలోనే వెళ్లాడు. తర్వాత ''రెబెల్ స్టార్''గా గుర్తింపు తెచ్చుకుని ఖ్యాతి పొందాడు. ఆ రెబెల్ స్టార్ యిమేజి యీ 'యాహూ'తోనే వచ్చిందనుకుంటారు చాలామంది. కానీ అతనికి అలాటి యిమేజి అంతకు నాలుగేళ్లకు ముందే ''తుమ్‌సా నహీఁ దేఖా'' (1957) సినిమాతో వచ్చింది. అలాటి 'లవబుల్ రోగ్' పాత్రను తీర్చిదిద్దినది రచయిత-దర్శకుడు నసీర్ హుస్సేన్. నిజానికి అతను ఆ పాత్రను దేవ్ ఆనంద్‌ను దృష్టిలో పెట్టుకుని తయారుచేశాడు. కానీ హీరోయిన్‌గా అమితా వంటి చిన్న హీరోయిన్ను పెట్టడంతో కినిసి దేవ్ తప్పుకున్నాడు. అప్పుడు నిర్మాత ఎస్.ముఖర్జీ (ఫిల్మ్‌స్తాన్) నసీర్‌తో ''షమ్మీని తీసుకో'' అన్నాడు.
షమ్మీ అప్పట్లో పెద్ద ఫ్లాప్ స్టార్. ఐదేళ్ల్లగా పడి కొట్టుకుంటున్నా, ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. కానీ నాటకరంగం నుండి రావడంతో క్రమశిక్షణ కలిగి వుండేవాడు. అది ముఖర్జీకి నచ్చింది. నసీర్‌కు ఫ్లాప్ స్టార్‌ను తీసుకోవడం యిష్టం లేకపోయినా, నిర్మాత మాట కాదనలేకపోయాడు. పైగా షమ్మీ అతనికి కొత్త కాదు. ఫిల్మిస్తాన్ స్టూడియోలో ''పేయింగ్ గెస్ట్'', ''హమ్ సబ్ చోర్ హైఁ '' (రెండూ వాళ్లు తీసినవే) పక్క పక్క సెట్లలో తయారవుతూండేవి. మొదటిదానికి నసీర్ రచయిత. రెండో దాంట్లో షమ్మీ హీరో. ఇద్దరూ సెట్లలో కలుస్తూ వుండేవారు.
ఒకసారి షమ్మీయే ''తుమ్‌సా..''లో హీరో అనుకున్నాక సెట్‌పై యిద్దరూ కలిసి పాత్రను ఎలా రూపొందించాలి అన్నదానిపై వర్క్ చేస్తూ వుండేవారు. డ్రస్ ఎలా వుండాలి, హెయిర్‌స్టయిల్ ఎలా వుండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి.. అని ప్రతీ విషయంలో నవ్యత చూపించారు. మామూలుగా రాముడు-మంచిబాలుడు వంటి హీరోగా కాకుండా, కాస్త అల్లరిచిల్లరిగా, కిల్లాడీగా, బద్మాష్‌గా వుండేలా రూపు దిద్దారు. అప్పటిదాకా మీసం పెట్టుకున్న షమ్మీని మీసం పీకేయమన్నాడు నసీర్. పాటలు సాహిర్ రాయగా ఓ పి నయ్యర్ ట్యూన్లు కట్టాడు. వాటికి షమ్మీ తన యింటి డాబా మీద డాన్సు చేస్తూ ప్రాక్టీసు చేస్తూ వుండేవాడు. కొంతకాలం తర్వాత సాహిర్ తప్పుకుని అతని స్థానంలో మజ్రూహ్ వచ్చాడు. ఫైనల్‌గా సినిమా రిలీజై షమ్మీని స్టార్‌ను చేసింది. అలాటి పాత్రలు ఆ తర్వాత ఎన్నో వేశాడు.
అయితే తమాషా ఏమిటంటే షమ్మీ ఓ దశలో ఆ పాత్ర వదిలేద్దామని అనుకున్నాడు. కారణం – పారితోషికం వద్ద తగాదా ! అంతకుముందు అతను వేసిన ''హమ్ సబ్ చోర్ హైఁ '' సినిమాకి ఫిల్మిస్తాన్ వారు అతనికి ఐదు నెలలపాటు షూటింగు వుంటుందని నెలకు 4 వేల రూపాయల జీతం, 10 గాలన్ల పెట్రోలు యిస్తామన్నారు. అయితే దాని డైరక్టరు ఐయస్ జోహార్ (హాస్యనటుడు కూడా) పుణ్యమాని ఆ సినిమా 8 నెలలకు డేకింది. దాంతో షమ్మీకి 32 వేలు ముట్టాయి. ''తుమ్‌సా..'' ఆఫర్ రాగానే షమ్మీ 32 వేలిమ్మన్నాడు. కానీ ఫిల్మిస్తాన్‌లో డబ్బు వ్యవహారాలు చూసే తొలారం జలాన్ ''20 వేలిస్తా, కావాలంటే తీసుకో, లేకపోతే దారి చూసుకో'' అన్నాడు. షమ్మీ నిర్మాత ముఖర్జీ దగ్గరకి వెళ్లి ఏడుపుమొహం పెట్టాడు. ఆయన చివాట్లు వేశాడు – ''డబ్బు గురించి చూస్తావేమిటి, ఆ పాత్ర నీకోసం పుట్టింది.'' అని. పైగా ''మీ నాన్నగారి పృథ్వీ థియేటర్స్‌లో వేషాలు వేసినప్పుడు నీకు నెలజీతం ఎంతేమిటి?'' అని అడిగాడు.
''నెలకు ఏభై..''
''ఇంకేం మరి ! డబ్బు ముఖ్యం కాదు. పాత్ర ముఖ్యం.. అది తెలుసుకో. దీనితో నీ రూపే మారిపోతుంది. మీ నాన్న పృథ్వీరాజ్ కపూర్‌ను, అన్న రాజ్ కపూర్‌ను అనుకరించవలసిన పని లేదు. వారి బాట వేరు. ఈ బాట నువ్వే వేస్తావ్. దీనిలో నీకు తిరుగుండదు.'' అన్నాడు ముఖర్జీ.
అదే జరిగింది ! ముఖర్జీ మాట భవిష్యవాణి అయింది. (సశేషం)(ఫోటోలు- బ్రహ్మచారి, తుమ్‌సా నహీ దేఖా)
– ఎమ్బీయస్ ప్రసాద్