లక్షణంగా కనిపిస్తున్నాయ్‌… కోటి ఆశలు రేకెత్తిస్తున్నాయ్‌!

గత సంవత్సరం వెళుతూ వెళుతూ తెలుగు సినిమా పరిశ్రమని చిన్ని ఉయ్యాలనెక్కించి జంపాలలూగించింది. చివర్లో విడుదలైన చిన్న సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ పెద్ద విజయాన్ని సాధించి 2013కి ఘనమైన వీడ్కోలుని పలికింది. భారీ విజయాలు……

గత సంవత్సరం వెళుతూ వెళుతూ తెలుగు సినిమా పరిశ్రమని చిన్ని ఉయ్యాలనెక్కించి జంపాలలూగించింది. చివర్లో విడుదలైన చిన్న సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ పెద్ద విజయాన్ని సాధించి 2013కి ఘనమైన వీడ్కోలుని పలికింది. భారీ విజయాలు… ఘోర పరాజయాలని చవిచూపించిన గత ఏడాది చరిత్రలో కలిసిపోయి… కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో కొత్తగా పుట్టింది. మరి ఈ సంవత్సరం తెలుగు సినిమాకి ఎలా ఉండబోతోంది. ఈసారి బాక్సాఫీస్‌ సింహాసనాన్ని అధిష్టించబోతున్న సినిమా ఏది? కోటి ఆశలు రేకెత్తిస్తోన్న ఆ లక్షణమైన సినిమాలేమిటి? ఈ ఏడాదిలో ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకట్టుకుని, బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుకుంటాయనిపిస్తోన్న మోస్ట్‌ ప్రామిసింగ్‌ ఫిలింస్‌ ఏమిటో ఓ లుక్కేద్దాం. 

మూడోసారి పవర్‌ చూపిస్తాడా?     

వరుసగా రెండేళ్ల పాటు టాలీవుడ్‌ సింహాసనాన్ని కైవసం చేసుకుని తన సత్తా చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఈ ఏడాదిలో మరోసారి ‘గబ్బర్‌సింగ్‌’ అవతారం ఎత్తబోతున్నాడు. ‘గబ్బర్‌సింగ్‌’ సీక్వెల్‌ షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు కానీ ఈ ఏడాదిలో రిలీజ్‌ కావడమైతే ఖాయం చేసుకోవచ్చు. ఎప్పుడొచ్చినా కానీ ఈ చిత్రంపై ఉండే అంచనాలు అలా, ఇలా ఉండవు. దర్శకుడు సంపత్‌నందికి చెప్పుకోతగ్గ ట్రాక్‌ రికార్డ్‌ లేకపోవచ్చు. కానీ ఒక స్టార్‌ని హ్యాండిల్‌ చేయగలడని ‘రచ్చ’తో ప్రూవ్‌ చేసుకున్నాడు. అయినా ఫామ్‌లో ఉన్న పవన్‌కళ్యాణ్‌ని డీల్‌ చేయడం, హ్యాండిల్‌ చేయడం అంత కష్టమేం కాదు. అతడిని సరిగ్గా ప్రెజెంట్‌ చేస్తే, రెండున్నర గంటల పాటు కాలక్షేపమైపోతే… అతడి సినిమాని కోట్లతో అభిషేకించడానికి ప్రేక్షకులు పెద్దగా అద్భుతాలు ఏమీ కోరుకోరు. సింపుల్‌ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టగల పవర్‌ అతనిది. అతని సినిమా ఉందీ అంటే… అది తప్పకుండా ఆ ఏడాది ‘మోస్ట్‌ అవైటెడ్‌’ లిస్ట్‌లో ఉండి తీరాల్సిందే… అతను ఫామ్‌లో ఉన్నా, లేకున్నా!

‘దూకుడు’ కొనసాగిస్తాడా? 

2011లో ఫామ్‌ని తిరిగి అందుకున్న నాటి నుంచీ మహేష్‌బాబు ‘దూకుడు’కి ఎదురు లేకుండా పోయింది. వరుసగా మూడేళ్లలో మూడు విజయాలు అందుకుని ఫుల్‌ జోరు మీదున్న మహేష్‌బాబు ప్రతి సినిమాకీ ఒక కొత్త తరహా పాత్రని ఎంచుకుంటూ, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే ప్రయత్నం చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో మహేష్‌వి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతికి 1 నేనొక్కడినే అంటూ రాబోతున్న మహేష్‌ ఆ తర్వాత ‘ఆగడు’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తాడు. ‘పోకిరి’తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న తర్వాత మహేష్‌ మళ్లీ బిగ్గెస్ట్‌ హిట్‌ని అందుకోలేదు. కానీ ఈసారి ‘1 నేనొక్కడినే’తో కాకపోతే ‘ఆగడు’తో అయినా అన్ని లెక్కలు సరి చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో బాగా ఉంది. ‘నేనొక్కడినే’ చుట్టూ కావాల్సినంత హైప్‌ ఉంది. దానికి తగ్గ సినిమా అని ప్రేక్షకులకి అనిపిస్తే ఆకాశమే హద్దు అవుతుంది. ఇక దూకుడుతో మహేష్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన శ్రీను వైట్ల ఈసారి ఆగడుతో ఆల్‌టైమ్‌ హిట్‌ ఇవ్వాలని చూస్తున్నాడు. పవన్‌కళ్యాణ్‌లానే మహేష్‌బాబు సినిమాలెప్పుడూ ఆశలు రేకెత్తించే సినిమాల్లో ముందు వరుసలో ఉంటాయ్‌. 

రభస రేంజ్‌ ఎంత?

పూర్తిగా అవుట్‌ ఆఫ్‌ ఫామ్‌ లేకపోయినా కానీ ఎన్టీఆర్‌ ఎందుకో నిలకడ ప్రదర్శించలేకపోతున్నాడు. చెప్పుకోతగ్గ హిట్లు అయితే సాధిస్తున్నాడు కానీ తన స్థాయికి తగ్గ విజయాల్ని ఎన్టీఆర్‌ సాధించలేకపోతున్నాడు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్‌ నుంచి మళ్లీ ‘నంబర్‌వన్‌ హీరో ఇతనే’ అనిపించుకునే సినిమా రాలేదనేది వాస్తవం. గత ఏడాది ‘బాద్‌షా’గా తన పవర్‌లో సగం చూపించిన ఎన్టీఆర్‌ ఈ సారి అయినా ఫుల్‌గా ‘రభస’ చేస్తాడా? ఎన్టీఆర్‌ని ఈ చిత్రం యాభై కోట్ల క్లబ్‌లోకి చేరుస్తుందనే నమ్మకాలు అయితే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్‌కి ఇప్పుడు జస్ట్‌ హిట్‌ కాకుండా బెస్ట్‌ హిట్‌ కావాలి. ఎన్టీఆర్‌ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అతని చిత్రాలకి బిజినెస్‌ జరిగిపోవడం, అతని చిత్రాలకోసం మొదటి రోజునే ఆడియన్స్‌ ఎగబడడం షరా మామూలే. దర్శకుడితో సంబంధం లేకుండా తన సినిమాకి క్రేజ్‌ తీసుకురాగల హీరో కాబట్టి అతని సినిమా కూడా ప్రామిసింగ్‌ లిస్ట్‌లో రెగ్యులర్‌ ఫీచర్‌. 

ఇంకొక్కసారి చూపిస్తే చాలు!

మెగాస్టార్‌కి తగిన వారసుడని, భవిష్యత్తులో తెలుగు సినిమాని ఏలే హీరోల్లో ఒకడని రామ్‌ చరణ్‌ ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు. అయినప్పటికీ అతని సత్తాపై అనుమానాల ప్రశ్నలు వేలాడ్డం మానలేదు. మీడియాలో ఇంకా ఒక వర్గం రామ్‌ చరణ్‌ని రైట్‌ ఆఫ్‌ చేస్తూనే ఉంది. అతి సాధారణ సినిమాలు రచ్చ, నాయక్‌తో ఘన విజయాలు సాధించినా కానీ ఇంకా అతడి స్టార్‌డమ్‌ని అనుమానిస్తూనే ఉంది. తుఫాన్‌ ఫెయిల్యూర్‌ చరణ్‌ క్రిటిక్స్‌కి జోష్‌ ఇచ్చింది. ఇప్పుడు వారి ఉత్సాహంపై నీళ్లు చల్లి, వారి నోళ్లు మూయించే భారం చరణ్‌పై ఉంది. ‘ఎవడు’తో ఈ ఏడాదిని ఫ్రెష్‌గా ఆరంభించబోతున్న చరణ్‌ ఎలాంటి సమాధానం ఇస్తాడనేది చూడాలని విమర్శకులే కాకుండా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్‌ స్టామినా ఏమిటనేది ఆన్‌లైన్‌ పోల్స్‌లో తెలీదు. మాస్‌ మెచ్చే హీరోల లిస్ట్‌లో ముందు వరుసలో ఉండే చరణ్‌లాంటి వాళ్ల చిత్రాల సత్తా, వాటిపై ఉన్న బజ్‌ రియల్‌ మార్కెట్‌లోనే తెలుస్తుంది. ఎవడుతో చరణ్‌ తనని తాను ఇంకొక్కసారి నిరూపించుకుంటే విమర్శకుల నోళ్లు పర్మినెంట్‌గా కాకుండా టెంపరరీగా మూత పడతాయి. ‘ఎవడు’ కాకుండా ఈ ఏడాదిలో కృష్ణవంశీతో చేస్తున్న సినిమా కూడా వచ్చే అవకాశముంది. ఒకవేళ వస్తే అది కూడా బై డిఫాల్ట్‌ ‘ప్రామిసింగ్‌ లిస్ట్‌’లో చేరిపోతుంది. 

ఇప్పటికీ లెజెండ్‌!

సీనియర్‌ హీరోల పని అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. యువ హీరోలని ఆదరిస్తూ సీనియర్లని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని విశ్లేషకులు తెగ రాస్తున్నారు. అయితే బాలకృష్ణ తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టింది నాలుగేళ్ల క్రితమే. తిరుగులేని మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలకి ఏజ్‌ బార్‌ అయిపోవడం, ఒక అరడజను ఫ్లాపులతో క్రేజ్‌ పడిపోవడం ఉండదు. బాలకృష్ణ కెరీర్‌లో వచ్చిన బిగ్గెస్ట్‌ హిట్స్‌ అన్నీ ఆయన స్లంప్‌లో ఉన్నప్పుడు, ఇక బాలయ్య షాప్‌ కట్టేసుకోవచ్చు అనుకున్నప్పుడే వచ్చాయి. అందుకే బాలయ్యని, ఆయన సినిమాని అండర్‌ ఎస్టిమేట్‌ చేయడానికి లేదు. మాస్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా వస్తే ఇప్పటికీ ఆయన సినిమాలు భారీ హిట్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా కలెక్ట్‌ చేస్తాయి. సింహా కాంబినేషన్‌లో వస్తున్న లెజెండ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ గెటప్‌కి తోడు, బోయపాటి శ్రీనుకి మాస్‌ సినిమాలపై ఉన్న పట్టు లెజెండ్‌ని కూడా ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంచుతుంది. 

మన బలమెంతో చూపించే టైమ్‌

అక్కినేని హీరోల హవా ఈమధ్య బాగా తగ్గింది. నాగార్జున ప్రైమ్‌ అయిపోయిన తర్వాత ఆయన నుంచి చెప్పుకోతగ్గ విజయాలేం రాలేదు. ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఇంకా ‘స్టార్‌’ హోదా తెచ్చుకోలేదు. తెలుగు సినిమాపై చెరిగిపోని ముద్ర వేసిన ఈ ఫ్యామిలీ గత పదేళ్ల వరకు టాప్‌ జాబితాలోనే ఉంది. కానీ ఈమధ్య మాత్రం అక్కినేని వారి నుంచి గత వైభవానికి తగ్గ విజయాలు రావట్లేదు. అయితే అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేస్తున్న ‘మనం’తో ఘన విజయం ఖాయమని, తిరిగి అక్కినేని జెండా ఎగరడం సాధ్యమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మూడు తరాల హీరోలతో, ఒక విచిత్రమైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ‘మనం’ కూడా ఈ ఇయర్‌ మోస్ట్‌ ప్రామిసింగ్‌ ఫిలింస్‌లో ఒకటిగా కనిపిస్తోంది. నాగార్జున ఈమధ్య కాలంలో ఈ చిత్రం గురించి ఎక్సయిట్‌ అవుతున్నట్టుగా మరి దేని గురించీ కాలేదు. ఆయన నమ్మకంగా చెప్పిన సినిమాల్లో గురి తప్పినవి చాలా తక్కువ కాబట్టి ‘మనం’ తప్పక జనం మెచ్చే సినిమా అవుతుందని ఆశించవచ్చు. 

రేసులో ఉన్నాడు

జులాయి విజయం తర్వాత ఇద్దరమ్మాయిలతో చేసి పొరపాటు చేసిన అల్లు అర్జున్‌ ఈసారి రేసులో ముందుకొచ్చే సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. అతని మలి చిత్రం రేసుగుర్రం మంచి ఎంటర్‌టైనర్‌ అనే ఫీలర్స్‌ అందుతున్నాయి. సురేందర్‌రెడ్డి ఇచ్చిన హిట్స్‌ తక్కువే అయినా అతని సామర్ధ్యంపై నమ్మకం అయితే సడలిపోలేదు. అతను వినోదాన్ని నమ్ముకుంటే రేసుగుర్రానికి తిరుగు లేనట్టే. ఇక అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌తో వెంటనే సినిమా చేసే అదృష్టాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్‌ ఈ ఏడాదిలోనే అది కూడా పూర్తి చేసే అవకాశముంది. ఒకవేళ అది పూర్తయి రిలీజ్‌ అయినట్టయితే జులాయి కాంబినేషన్‌లో మరో మంచి హిట్‌ వస్తుందని ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా ఉంటాయి. హ్యాట్రిక్‌ హిట్‌ ఇచ్చే అవకాశాన్ని త్రివిక్రమ్‌ కూడా వేస్ట్‌ చేసుకోడని నమ్మకం పెట్టుకోవచ్చు. 

వాపు కాదు బలుపే!

రవితేజ ఇక కోలుకోవడం కష్టమేననే డౌట్స్‌ పెరిగిపోతున్న టైమ్‌లో అతడినుంచి ‘బలుపు’ వచ్చింది. అయితే అది వాపు కాదు బలుపే అని చాటుకోవడానికి, అతనిపై మునుపటి ‘మినిమమ్‌ గ్యారెంటీ హీరో’ అనే నమ్మకం తిరిగి ఏర్పడడానికి ఇప్పుడు రాబోతున్న సినిమా రోల్‌ చాలా ఉంటుంది. ‘బలుపు’ రచయిత బాబీతో రవితేజ చేస్తున్న సినిమాని కూడా ఈ ఏడాది వస్తున్న సినిమాల్లో ‘లెక్కలోకి’ తీసుకోవచ్చు. 

వెంకీ సంగతేంటి?

సోలో హీరోగా ఫెయిలై, మల్టీస్టారర్‌ మసాలాతో కూడా పరాజయం పాలైన వెంకటేష్‌ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒకప్పుడు వెంకటేష్‌ సినిమా అంటే తప్పక చూడాలి అని కుటుంబం మొత్తం తరలి వచ్చే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వెంకటేష్‌ నుంచి సమ్‌థింగ్‌ ఎక్సెప్షనల్‌ రావాలి. ఆడియన్స్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు మారుతి తన యూత్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్స్‌ని కాకుండా, వెంకటేష్‌లాంటి సీనియర్‌ని కూడా హ్యాండిల్‌ చేయగలడా? ఈ యేడాది వస్తున్న సినిమాల్లో వీరిద్దరి ‘రాధ’ కూడా ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనే దానిపై రిజల్ట్‌ డిపెండ్‌ అయి ఉంటుంది. 

రజనీతో సహా…

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో లింక్‌ అయి ఉంటే మోషన్‌ క్యాప్చర్‌ సినిమా ఏంటి, మామూలు సినిమా ఏంటి… దేనికైనా క్రేజ్‌ గ్యారెంటీ. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న రజనీకాంత్‌ ‘యానిమేటెడ్‌’ సినిమా ‘విక్రమసింహా’ ఈ వేసవిలో రాబోతోంది. అలాగే కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం’ సీక్వెల్‌ కూడా త్వరలోనే విడుదల కానుంది. గత ఏడాదిలో విడుదలకి నోచుకోలేకపోయిన ‘ఆటోనగర్‌ సూర్య’పై కూడా సినీ ప్రియులకి ఆసక్తి బాగానే ఉంది. శేఖర్‌ కమ్ముల చేస్తున్న కహానీ రీమేక్‌ ‘అనామిక’ కూడా ఈ ఏడాదిలో విడుదలవుతుంది. ఇవి కాకుండా కొందరు సీనియర్‌ దర్శకుల చిత్రాలు, గత ఏడాది విజయాలతో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకున్న యువ దర్శకుల చిత్రాలు, అన్నిటికీ మించి ఏ అంచనాలు లేకుండా వచ్చి అనూహ్య విజయాలు సాధిస్తోన్న చిన్న సినిమాలు… ఇంకా చాలానే ఉన్నాయ్‌. 2014పై తెలుగు సినిమా హోప్స్‌ పెంచుకోడానికి తగినన్ని సినిమాలైతే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ఎన్ని వాటిని నిలబెట్టుకుంటాయో… ఎన్ని అంచనాల్ని తలకిందులు చేస్తాయో చూడాలి మరి. 

– గణేష్‌ రావూరి

twitter.com/ganeshravuri