మన దేశంలో రకరకాల సెంటిమెంట్లున్నాయి. మూఢనమ్మకాలున్నాయి. పిచ్చి ఆలోచనలున్నాయి. వాటిల్లో మతానికి-భాషకు సంబంధం ఉందనే మూఢ నమ్మకమో, పిచ్చి ఆలోచనో ఒకటి ఉంది. ఈ నమ్మకానికి లాజిక్ లేదు. సహేతుకత లేదు. దాన్ని సమర్థించుకోవడానికి ఓ పునాది లేదు. 'మతం మత్తు మందు' అంటారు హేతువాదులు, నాస్తికులు. మతమే మత్తు మందు అయినప్పుడు దానికి మతాన్ని జోడించి ఎలా మాట్లాడతారు? ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిషు మీడియం (తొలి దశలో) ప్రవేశపెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే కదా. దాని మీద రచ్చ జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే కదా. తెలుగు భాషను చంపేస్తున్నారని కొందరు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు ఇంగ్లిషు మీడియం నిర్ణయానికి సంబంధించి జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
'చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ సంతానం ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి' అని జగన్ బహిరంగంగా ప్రశ్నించారు. కాని వారి నుంచి ఇప్పటివరకు జవాబు లేదు. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. తెలుగు భాషను ఎత్తేస్తున్నామని జగన్ చెప్పలేదు. కేవలం మీడియం మాత్రమే తీసేస్తున్నామని, తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా కొనసాగుతుందని వివరించినా నాయకుల విమర్శలు ఆగడంలేదు. పిల్లల తల్లిదండ్రులెవరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనబడటంలేదు. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టేటప్పుడు ఉపాధ్యాయులకు ఆ భాషలో తగినంత శిక్షణ ఇవ్వాలని, బోధన పకడ్బందీగా ఉండాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. ఇది కరెక్టే కదా.
అవసరమైన జాగ్రతలు తీసుకొని ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడితే పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని విద్యారంగ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏ రంగంలోనైనా మారుతున్న అవసరాలకు తగినట్లుగా కొత్త విధానాలు ప్రవేశపెట్టాల్సిందే. ఏదో జరిగిపోతుందని పాత విధానాలే పట్టుకొని వేలాడితే అభివృద్ధి, వికాసం ఉండవు. ఇంగ్లిషు మీడియానికి సంబంధించిన వివాదం కొనసాగుతుండగానే. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడానికి కారణం క్రైస్తవ మతాన్ని విస్తారించడానికేనని 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ ఓ గొప్ప అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ అభిప్రాయంలో ఆయనకు జగన్ మీద కోపం, ద్వేషం కనిపించాయని స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఇంగ్లిషు భాషకు లేదా ఇంగ్లిషు మీడియానికి, క్రైస్తవానికి సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి.
భాషకు, మతానికి సంబంధం ఉంటుందన్న లాజిక్ ఏమిటి? దీంట్లో సహేతుకత ఉందా? బ్రిటిషువారు భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించారు కాబట్టి, వారి భాష ఇంగ్లిషు కాబట్టి, వారి మతం క్రిస్టియానిటీ కాబట్టి భాషకు, మతానికి సంబంధం పెడుతున్నట్లుగా ఉంది. మరి ఆంగ్లం వచ్చినవారు మాత్రమే కిరస్తానీ మతం పుచ్చుకున్నారా? ఇంగ్లిషు అక్షరం ముక్క రాని వేలాదిమంది క్రైస్తవంలో చేరారు కదా. హిందూ మతంలో బ్రిటిషువారిని మించిన ఆంగ్ల పండితులున్నారు. మరి భాషకు-మతానికి సంబంధముంటే వారు కూడా క్రైస్తవంలో చేరాలి కదా.
ఆంధ్రాలో చాలామంది ముస్లిములకు ఉర్దూ రాదు. ఆ భాష రాదు కాబట్టి వారు హిందువులా?వాస్తవానికి ఇదో పెద్ద సబ్జెక్టు. ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మతానికి భాషకు సంబంధం లేదని నిరూపించవచ్చు. ఇందుకు రెండు ఉదాహరణలు చూద్దాం. ఫిరోజ్‌ఖాన్ అనే ముస్లిం సంతస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్ అనే విద్యా సంస్థలో సంస్కృత ప్రొఫెసర్. సంస్కృతాన్ని హిందూ మతానికి ప్రతీకగా భావిస్తారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పౌరాణిక మూల గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి. మరి సంస్కృతం బోధించే ముస్లిం ప్రొఫెసర్‌కు హిందూ మతంతో సంబంధం ఉందా?
కాని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. గోపాలిక అంతర్జనం అనే ఆమె బ్రాహ్మణ మహిళ. బ్రాహ్మణులు హిందూ మతంలోనే ఉంటారు కదా. ఆమె కేరళలో అరబిక్ టీచరుగా పనిచేశారు. ఆమె మతానికి, భాషకు సంబంధం ఉందా? భారతదేశం భిన్న మతాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాషలు ఉన్న వైవిధ్యభరిత దేశం. కాబట్టి ఏ భాషను ఎవరైనా నేర్చుకునే హక్కు ఉందంటారు ఆమె. అరబిక్ అందమైన భాష అని చెప్పే ఈమె 29 ఏళ్లపాటు ఆ భాషా టీచరుగా పనిచేశారు. ఆమెకూ నిరసనలు ఎదురయ్యాయి. ఓ లాయరు ఆమెకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి భంగపడ్డాడు. బాషకు-మతానికి సంబంధం లేదని ఇప్పుడు అర్థమైంది కదా.