హీరో పేరు మీదే ఒక సినిమా బిజినెస్ రేంజ్ ఆధారపడుతుందనేది నిజమే కానీ ఏడాదికో సినిమా చేసే అగ్ర హీరోలు ఆ ఒక్క సినిమాతోనే అందినంత వెనకేసుకోవాలని చూస్తున్నారు. ఈ తరహా ఆలోచనలతో నిర్మాతలకి భారంగా మారుతున్నారు. కోటానుకోట్ల పారితోషికం తీసుకోవడమే కాకుండా విడిగా లాభాల్లోను వాటా కావాలని అడుగుతున్నారు. 'అల వైకుంఠపురములో' చిత్రానికి అల్లు అర్జున్ డీల్ అన్‌రీజనబుల్‌గా వుందనేది ఇండస్ట్రీలో బాగా మాట్లాడుకుంటున్నారు.
ఈ చిత్రానికి గాను అతనికి పారితోషికం పాతిక కోట్లట. అది కాకుండా మళ్లీ లాభాల్లో వాటా తన తండ్రికి ఇవ్వాలట. మేకింగ్ పరంగా గీతా ఆర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ అల్లు అర్జున్ అలా మాట్లాడుకున్నాడట. హీరోదే రాజ్యం కనుక ఇది ఎంత అన్రీజనబుల్ అయినా ఓకే చేయక తప్పలేదట. అలాగే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి నిర్మాతగా తన పేరు వేసుకుంటున్నాడు.
కానీ ఇందులో అతను పెట్టే పెట్టుబడి లేదు. పోనీ లాభాల్లో సమమైన, సమంజసమైన వాటా లేదు. నాన్ థియేట్రికల్ ఎంత వచ్చినా కానీ అది మహేష్ ఖాతాలోకే వెళుతుందని నిర్మాత సంతకం చేయక తప్పలేదు. పోనీ ఇంత తీసుకుంటున్నందుకు మేకింగ్ పరంగా కాస్ట్ కటింగ్ చేసి నిర్మాతకి ఏమైనా మిగల్చాలని చూస్తారా అంటే అదీ లేదు. పావలా ఖర్చయ్యే చోట రూపాయి ఖర్చు పెట్టిస్తున్నారు.
ఇంతా చేసి సినిమా ఫెయిలయితే బయ్యర్లు వచ్చి నిర్మాత పీకల మీదే కత్తి పెడతారు. వాళ్లకొచ్చిన అరకొర లాభం కూడా లాక్కుపోతుంటారు. ఈ కారణంతోనే ఇప్పటికే అగ్ర నిర్మాతలు ఒక్కొక్కరుగా సినీ నిర్మాణానికి దూరమైపోతున్నారు. ఇంకా ప్యాషన్‌తో వున్న ఆ కొందరు నిర్మాతలని కూడా హీరోలు ఇలా నీరుగార్చేస్తున్నారు.