కంప్యూటర్లు క్రాష్ చేయడానికి ఎన్నో ఎత్తులు. అందుకే స్పామ్ మెసేజీల్లో ఎన్నో రకాలు. తాజాగా ఇలాంటిదే మరో మెసేజ్ పుట్టుకొచ్చింది. అయితే ఈసారి ఇది టార్గెట్ చేసింది కంప్యూటర్లను కాదు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్ అప్లికేషన్ ను. తద్వారా మొబైల్ ఫోన్లను లక్ష్యంగా చేసుకుంది.
అవును.. నిన్నట్నుంచి చాలామందికి వాట్సాప్ లో ఓ మెసేజ్ వస్తోంది. ఓ అందమైన బంతి మాత్రమే మెసేజ్ రూపంలో వస్తుంది. దాన్ని టచ్ చేయొద్దు, చేస్తే మీ ఫోన్ కాసేపు హ్యాంగ్ అవుతుందనే మెసేజ్ కూడా దానితో పాటు వస్తోంది. ఇదేదో కామెడీ మెసేజ్ అని టైపు చేసిన వాళ్లంతా తమ మొబైల్స్ హ్యాంగ్ అవ్వడాన్ని గమనించారు.
అయితే ప్రస్తుతానికి ఇది ఎలాంటి ప్రమాదాన్ని తీసుకురావడం లేదు. కేవలం 7-8 సెకెన్ల పాటు ఫోన్ హ్యాంగ్ అవుతుందంతే. కానీ అదే సమయంలో ఓ ప్రమాదకరమైన వైరస్ మొబైల్ లోకి ప్రవేశిస్తున్నట్టు వాట్సాప్ గుర్తించింది. ఓ అందమైన బంతి స్థానంలో, ఇప్పుడు ఓ పెద్ద నల్లటి చుక్కతో కూడా మెసేజీలు రావడం మొదలయ్యాయి.
ప్రస్తుతానికి ఈ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్లను మాత్రమే తాకింది. ఐఫోన్లపై ఈ వైరస్ ప్రభావం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రం వినియోగదారులు తమ డేటాను కోల్పోయే ప్రమాదముందని వాట్సాప్ హెచ్చరించింది.