ఇప్పటి దాకా బన్నీ సినిమాలు ఏవీ క్రిటిక్స్ దగ్గర పెద్దగా రేటింగ్ లు తెచ్చుకోలేదు. ఎందుకంటే బన్నీ చేసినవన్నీ మాస్ సినిమాలే. సన్నాఫ్ సత్యమూర్తి ఒక్కటే కాస్త క్లాస్ టచ్ వున్న సినిమా. మిగిలనవన్నీ బి సి సెంటర్ల ఆడియన్స్ ను టార్గెట్ చేసినవే.
అయితే ఆ సినిమాలు చేసినపుడు క్రిటిక్స్ సపోర్ట్ దొరక్కపోయినా, మీడియా న్యూట్రల్ గా వుంది. అందువల్ల ఆ సినిమాలు అన్నీ మంచి కలెక్షన్లు సాధించాయి. బన్నీకి రేటింగ్స్ తో సంబంధం లేదు అనిపించాయి.
కానీ ఇప్పుడు నా పేరు సూర్య దగ్గరకు వచ్చేసరికి రెండు సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి బన్నీకి తనలోని నటుడుని సంతృప్తి పరిచే పాత్ర కావాలన్న తహతహ వుంది. అందుకే వక్కంతం వంశీ క్యారెక్టరైజేషన్ చెప్పగానే, ఎలా చేస్తాడో అని కూడా చూడకుండా, ఆలోచించకుండా సినిమా చేతిలో పెట్టేసాడు. పైగా ఈ సినిమా బి సి సెంటర్లు మెచ్చే మాస్ మసాలా కాదు. కాస్త ఆలోచింపచేసే సినిమా.
ఇలాంటి టైమ్ లో బన్నీకి మీడియా సపోర్ట్ లేకుండా అయిందని మెగాభిమానులు ఫీలవుతున్నారట. సరిగ్గా బన్నీ సినిమా విడుదల టైమ్ నుంచి, ఈ సినిమాను ఏమీ టచ్ చేయకుండా, ఈ సినిమాతో సంబంధం లేకుండా వేరే రకమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయట కొన్ని చానెళ్లు. దీంతో ఆ కారణంగా బన్నీకి వేరే విధంగా సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది.
దీన్ని ఎలా అధిగమించాలా? అని సూర్య సినిమా యూనిట్ కిందా మీదా అవుతోంది. సినిమాను కింద జనాల్లోకి మీడియా సపోర్ట్ లేకుండా ఎలా తీసుకెళ్లాలా? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి మూడురోజులు గడచిపోయాయి. ఫరవాలేదు అనే కలెక్షన్లు వచ్చాయి. సోమవారం నుంచి వీటిని నిలబెట్టుకోవాల్సి వుంది.