-సహజీవనం కాదు దాపరికం
-సెలబ్రిటీల జీవన శైలిలో భాగం
-పెళ్లి ఇప్పుడు కాదు, కాపురం మాత్రం ఇప్పుడే
-మిగిలిన సమాజంలోనూ అక్కడక్కడ ఈ పోకడ
-గమ్యం లేని ప్రయాణం, జీవితమే ఒక ప్రశ్నార్థకం!
చక్కగా చీరకట్టుతోనే అగుపిస్తున్నా.. అక్కడక్కడ, అప్పుడప్పుడు.. పైట జారిన ప్రౌడలా కనిపిస్తోంది భారతీయ సమాజం!
సంస్కృతి సంప్రదాయాలకు నెలవు… అని చెప్పుకోవడానికి బోలెడన్ని రెఫరెన్సులున్నాయి, బోలెడంత చరిత్ర ఉంది. ప్రత్యేకించి వివాహ బంధం గురించి చెప్పుకోవాలంటే భారత్ గురించినే మాట్లాడుకోవాలి. పురణాల నిండా పుణ్య స్త్రీలు, పుణ్య పురుషులే.. మరి వర్తమానంలో? దాన్నేమంటారు.. హిపోక్రసీ, దాన్ని పక్కన పెట్టి చూస్తే.. మన సమాజం కట్టుబాటు దాటేస్తోందేమో అనే అభిప్రాయం కలుగుతుంటుందొక్కోసారి.
విలువలు అనే వారసత్వాన్ని వదలించుకోవడానికి భారతీయులు యత్నిస్తున్నారా? ఏ వివాహ బంధం విషయంలో అయితే.. మనం గొప్ప అనుకున్నామో, ఆ బంధమే.. తెంచుకుంటే తెగిపోయే దశకు వచ్చిందా? సహజీవనం అని అందంగా పేరు పెట్టుకోవచ్చు.. అసహజమైన ఈ వ్యవహారం ఇప్పుడు సెలబ్రిటీల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. సామాన్యుల్లోనూ నూటికో కోటికో అన్నట్టుగా ఈ జీవన శైలిని ఆచరిస్తున్న వాళ్లు అగుపిస్తున్నారు.
దశాబ్దం కిందటి వరకూ.. ప్రేమ పెళ్లి అనేది గ్రామీణ భారతంలో చాలా పెద్ద చర్చనీయాంశం. ఒకే కులానికి చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారనే మాట వినిపించినా.. ఆర్థిక అంతరాలో, కుటుంబ పరువూ ప్రతిష్టలో ఆ ప్రేమ పెళ్లిళ్లకు అడ్డంకులయ్యేవి. మరి ఇప్పుడు? కులాంతర ప్రేమలకు కూడా చాలా మంది తల్లిదండ్రుల ఆమోదం లభిస్తోంది. దశాబ్దం, దశాబ్దంన్నర కిందట ప్రేమ పెళ్లిళ్ల పరిస్థితి ఏమిటో.. ఇప్పుడు అక్కడక్కడ అనిపిస్తున్న సహజీవనాలు ఇప్పటికిప్పుడే కాకపోయినా.. ఇంకో దశాబ్దానికో, ఆ పై కాలానికో కామన్ కావొచ్చు. ఇప్పుడు ప్రేమ వివాహాలకు లభిస్తున్న మద్దతే.. వీటికి లభించనూవచ్చు!
కొంతమంది సెలబ్రిటీలు సహజీవనంలో ఉన్నారు. వివాహమేదీ చేసుకోకుండా.. కలిసి జీవిస్తున్నారు. భార్యభర్తల్లా గడిపిస్తున్నారు. సినిమా వాళ్లను, క్రికెటర్లను క్రేజీగా చూసే సమాజం, వారేం చేసినా దానికి బోలెడంత ప్రచారం. మరి వారినే ఆదర్శంగా తీసుకుంటున్నారో లేక ఈ సహజీవన శైలిలో ఏమైనా సౌలభ్యం ఉందని అనుకుంటున్నారో కానీ.. మెట్రో యువతరం కూడా ఈ పోకడ కొంత కనిపిస్తూ ఉంది. ఇంత శాతం, ఇంతమంది.. అనే లెక్కలు చెప్పలేం కానీ, మెట్రో సిటీస్ లో ఇలాంటి పరిస్థితి అంతో ఇంతో ఉంది.
ఐదంకెల శాలరీలు .. పేరెంట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం.. ప్రేమ.. ఇష్టం.. కామం..పాశ్చాత్య ధోరణిని ఇష్టపడటం.. కారణం ఏదైనా కావొచ్చు.. కొన్ని జంటలు ఈ ప్రక్రియను పరిష్కార మార్గంగా చేసుకుంటున్నాయనేది కాదనలేని వాస్తవం. మెట్రో నగరాల్లో జీవిస్తున్న వాళ్లందరికీ దీన్ని ఆపాదించడం లేదు.. కానీ రూరల్, సెమీ అర్బన్ నేపథ్యం నుంచి వచ్చిన వారిలో కూడా ఇలాంటి వారున్నారు.
రహస్యంగా కాపురాలు చేసుకొంటున్న వాళ్లు కావొచ్చు, తమ బంధాన్ని ధైర్యంగా వెల్లడించుకుంటున్న వాళ్లు కావొచ్చు.. ఇలాంటి వారూ కొందరున్నారు! హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నివసిస్తున్న ఉత్తరాది యువతరంలో ఈ ధోరణి కనిపిస్తోంది. ఉద్యోగాలు చేసుకోవడానికే ఇక్కడికి వచ్చినా.. కలిసి కాపురం పెట్టేస్తున్న వాళ్లు బొచ్చెడు మంది కనిపిస్తారు తరచి చూస్తే!
సహజీవనంలో మజానే వేరు!
నిజమే.. సహజీవనంలో గొప్ప మజానే ఉంటుంది. పార్ట్ నర్ ప్రతి దాంట్లోనూ మిమ్మల్ని ప్లీజ్ చేయడానికే ప్రయత్నిస్తాడు. బోర్ కొట్టనివ్వడు/ బోర్ కొట్టనివ్వదు. ఏ రోజుకు ఆ రోజు చాలా ప్రత్యేకం. పార్టనర్ ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడమే పరమావధి. యాంత్రికతకు తావే లేదు! ప్రేమలో ఉండే మజానే సంసారంలో కూడా ఉంటుంది! శృంగారం బోనస్! అంత మజా ఉంటుందిలే.
అదే పెళ్లి చేసుకుంటే.. యాంత్రికత. పెళ్లి అయిపోయింది కదా.. ఆమె ఎక్కడికీ పోలేదు. అతడూ పోలేడు. పడి ఉండాల్సిందే. గానుగెద్దుల్లాంటి జీవితం. అతడిని ఆమె గౌరవించదు, ఆమెను అతడూ గౌరవించడు. ప్రత్యేకంగా ప్లీజ్ చేసుకోవడం ఉండదు. కొన్ని రోజుల్లో ఒకరికొకరు బోర్ కొట్టవచ్చు. ఆ తర్వాత అంతా యాంత్రికతే. ఒకరికొకరు నచ్చలేదని విడిపోవడం అనేది కుదిరే పని కాదు! అదే సహజీవనంలో అయితే.. ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు చెరో దరి.. చెరో దారి!
కలిసి ఉంటే అన్నీ సుఖాలేనా!
కత్రినా – రణ్ భీర్ లు కొంత కాలం కలిసి జీవించారు. వాళ్లిద్దరూ తమ లవ్ నెస్ట్ లో మకాం పెట్టారు. కలిసి తిరిగారు.. ప్రేమలో ఉన్నామని చెప్పారు. పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. ఆ మజాను కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. లవ్ నెస్ట్ నుంచి ఈ లవ్ బర్డ్స్ ఎగిరిపోయాయి. జనాలు కూడా వీళ్ల గురించి చర్చించుకున్నారు. విడిపోవడం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వీళ్ల గతం గురించి జనాలకు ఆసక్తి లేదు.. ఇప్పుడు కత్రినా ఎవరితో ఉంటోంది, రణ్ భీర్ ఎవరితో సహజీవనం చేస్తున్నాడు? అనేదే జనాలకు ఇంట్రస్టింగ్.
ఒకవేళ కత్రినా-రణ్ భీర్ లు పెళ్లి చేసుకుని ఉండుంటే.. నాలుగైదు నెలలకు ఒకరంటే ఒకరు బోర్ కొట్టి, ఏవో గొడవలొచ్చి విడిపోయింటే? విడాకులు తీసుకోవాల్సి వచ్చేది! వీళ్ల పై ఒక ముద్ర పడేది. డైవోర్స్ తీసుకున్నారనే శాశ్వత అపకీర్తిని మోయాల్సి వచ్చేది. ఉదాహరణకు.. అమలాపాల్ ఇప్పుడు పడుతున్న ఇబ్బందినే వీరు పడాల్సి వచ్చేది. అమల పెళ్లి చేసుకుంది.. కొన్ని నెలలకే గొడవలొచ్చాయి.. విడిపోయింది. ఆమెను సెకెండ్ హ్యాండ్ గానే చూస్తుంది సమాజం. అదే కత్రినాకు ఆ సమస్య లేదు కదా!
నిజమే.. హై క్లాస్ సర్కిల్, తుడుచుకుని వెళ్లిపోయే వాళ్లకు సహజీవనంలో ఉన్నంత సౌలభ్యం మరో తీరులో దొరకదు. వాళ్ల వరకూ చూస్తే కలిసి ఉండటంలోనే అసలు సుఖం ఉంది. పెళ్లి అనే ప్రయోగాన్ని చేయడం కన్నా, లెక్కకు మించిన ఆప్షన్లు ఉండే తమ సర్కిల్ ఒక్కోరితో కొంత కాలం గడిపేసినా… జీవితం చాలదు!
కానీ సామాన్యుల విషయంలో ఈ సహజీవనం ఒక విఫల ప్రయోగం. ఎలాగంటే.. సినిమా వాళ్లు అన్నీ విప్పి అయినా కనిపించగలరు. కానీ సామాన్యుడు నలుగురి ముందు పొరపాటున టవల్ జారితేనే చాలా అవమానంగా ఫీలవుతాడు. ఈ తేడానే.. ప్రతి వ్యవహారంలోనూ ఇరువురికీ అప్లై అవుతుంది. సినిమా వాళ్లకు ఉన్న ఆప్షన్లు అధికం. నలుగురితో కొన్ని కొన్ని రోజుల పాటు సహజీవనం చేసిన వారికి కూడా, అన్నే సహజీవనాల్లో భాగస్వామి అయిన మరో పార్టనర్ దొరుకుతుంది/దొరుకుతాడు. ఒక్కసారి సహజీవనం మొదలుపెట్టి.. జీవితమంతా కొనసాగించగల శక్తి వాళ్లకు ఉంటుంది. కానీ మిగతా సమాజానికి ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు!
పాశ్చాత్యులకూ రైటే.. వారిని అనుసరించడం పొరపాటే!
గ్లోబలైజేషన్.. ప్రపంచం అంతా ఏకం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతి అనేక రకాలుగా మన సంస్కృతిలోకి చొరబడుతోంది. అలా మనపై ప్రభావం చూపిస్తున్న పాశ్చ దేశాల సంస్కృతిలో సహజీవనం చాలా సహజమైన అంశం. దాన్ని చూసి, గమనించి మనమూ వాతలు పెట్టుకుంటున్నాం. ఒకవైపు భారతీయ సంస్కృతిలో బతుకుతూ.. ఈ అనుకరణకు పాల్పడటం విషతుల్యమే. సహజీవన సంస్కృతి వాళ్లకు రైటు .. మనకు కాదంతే!
వయసొచ్చిన పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడటాన్ని బాధ్యతగా భావించే సంస్కృతి లేదు పాశ్చా దేశాల్లో. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి, వారి ఉద్యోగాలకు రావాలని పూజలు చేసి, అలా సెటిల్ కాగానే.. ఇలా బంధువుల్లో అమ్మాయిలను చూద్దామా, మేనరికం పెళ్లిళ్లు చేద్దామా.. లేక పేరయ్యలు, మ్యాట్రిమోనీలను సంప్రదించి కొత్త సంబంధాలు చూసుకుందామా.. అనేది ఇండియన్ పేరెంట్స్ బాధ్యత. ఇలాంటి ముచ్చట్లేవీ పాశ్చాత్య సంస్కృతిలో లేవు.
టీనేజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు.. సొంత కాళ్లపై నిలబడటం ఎంత ముఖ్యమో, తగిన పార్ట్ నర్ ను చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పార్ట్ నర్ ను చూసుకోవడం వాళ్ల పని మాత్రమే! అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. అపోజిట్ జెండర్ లో తగిన వారిని చూసుకుని వాళ్లను అట్రాక్ట్ చేయాలి. వాళ్లకు దగ్గర కావాలి. ఇదంతా వాళ్ల పనే! దీంట్లో తల్లిదండ్రలకు పెద్దగా సంబంధం లేదు కూడా.
కాబట్టి పదహారేళ్ల నుంచి డేటింగ్ కు వెళ్లాలి. డేటింగ్ అంటే ఇక్కడ పడుకోవడం కాదు. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఒక అబ్బాయితో ఎలా నడుచుకోవాలి.. ఒకరికొకరు పరిచయం కావడం. ఇక్కడ నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత కథ ఎంతో ఉంటుందక్కడ. కానీ మన దగ్గర? ముప్పై ఏళ్ల వయసు వచ్చే వరకూ తన ఈడు అమ్మాయిలెవరితోనూ మాట్లాడకుండానే చాలామంది అబ్బాయిల జీవితాలు గడిచిపోతున్నాయి!
ఇక్కడ సమస్య ఇదొక్కటే కాదు.. పిల్లలు. పాశ్చాత్య ప్రపంచానికే ఇలా పుట్టిన పిల్లలు పెద్ద సమస్యగా తయారవుతున్నారు. అదే ఇండియాలో అయితే ఇంకేమైనా ఉందా? సహజీవనాల్లోని జంటలకు పుట్టిన పిల్లలు ఆ తర్వాతి కాలంలో సింగిల్ పేరెంట్ చైల్డ్ అవుతున్నారు లేకపోతే.. ఎవరికీ పట్టకుండా పోతున్నారు. సింగిల్ పేరెంట్ చైల్డ్ మనస్తత్వం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇక ఎవరికీ పట్టకుండాపోయిన పిల్లలు క్రిమినల్స్ గా తయారవుతున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో ఇలాంటి ప్రమాదకరమైన ధోరణి పెరిగిపోయింది. భార్యభర్తలు విడిపోవచ్చు కానీ.. తల్లిదండ్రులు అయ్యాకా విడిపోతే చాలా ఇబ్బందులే ఉంటాయి.
ఇక ఇండియాలో ‘రెండో భార్య’ సంతానానికే గుర్తింపు ఉండదు. వాళ్లు సామాజికంగా ఎంత ఎదిగినా.. సొంత వాళ్లు కూడా వాళ్లను గుర్తించడానికి ఇష్టపడరు. కులం, గోత్రాలు ఎంతో ముఖ్యంగానే భావించే మన సమాజంలో.. చిన్నింటి సంతానాలు స్టార్లుగా ఎదిగినా చిన్నచూపునే చూడబడుతున్నారు. ఇలాంటి సమాజంలో.. సహజీవనంలో పుట్టిన సంతానం పరిస్థితి ఊహించడం కూడా కష్టమే! సహజీవనం చేస్తున్న జంట దేన్నీ లెక్క చేయకపోవచ్చు గాక.. కానీ పొరపాటున వాళ్లకు పిల్లలు పుడితే, ఆ పుట్టిన వారి జీవితాలు నరకప్రాయమే!
మేధావులు.. పరిష్కారం చూపలేరు!
ఆడమగ.. ప్రేమ, కలయిక.. దేని అంతిమ గమ్యం ‘పెళ్లి’ అన్నట్టుగానే సాగుతోంది భారతీయ సమాజం. ఎంతటి మేధావులు కూడా మన దగ్గర సహజీవనాలకు అంత తేలికైన పరిష్కారం చూపలేకపోతున్నారు. కొందరి వ్యక్తిగత జీవితాలను చూసినా ఈ విషయం అర్థం అవుతుంది. కొంతమంది పెళ్లి చేసుకోలేదు.. వాళ్లు సహజీవనాల్లో ఉన్నారంటే నమ్మడం కష్టం. కమ్యూనిస్టు పార్టీల్లోని కొంతమంది నేతలు.. ఈ తరహా బంధాన్ని కొనసాగిస్తున్నారు.
పార్టీలో పని చేస్తూ చేస్తూ వాళ్లు దగ్గర కావడం.. కలిసి కాపురం చేయడం.. దశాబ్దాలుగా కలిసి ఉన్న ఉదంతాలున్నాయి. కానీ వాళ్లకు ‘పెళ్లి’ కాలేదు. పెళ్లి కాలేదనే మటే కానీ..వాళ్లు సమాజం దృష్టిలో భార్యభర్తలే. ‘పెళ్లి’ అనే తంతును వారు అనుసరించలేదంతే. వాళ్ల దాంపత్యం మాత్రం కొనసాగుతోంది. తాము సహజీవనంలో ఉన్నామని కూడా వాళ్లెప్పుడూ చెప్పుకోలేదు. మగడి ఇంటి పేరును మహిళ తన పేరు వెనుక చేర్చుకుని.. వాళ్లు మన సంప్రదాయంలో భాగమైపోయారు!
ఇక మణిరత్నం ఆ మధ్య ఒక సినిమా తీశాడు. ‘ఓకే బంగారం’ అని. నయా జనరేషన్ యువతను హీరోహీరోయిన్లుగా చూపుతూ, వారి ఆలోచనలనే కథనంగా మలిచి.. సినిమాను రూపొందించాడు. ఆ సినిమాలో హీరోహీరోయిన్లు సహజీవనాన్ని మొదలు పెడతారు.. కొందరి ఆమోదాన్ని సంపాదిస్తారు. కానీ అంతిమ గమ్యం ప్రశ్నార్థకమే అవుతుంది. పెళ్లి, సంసారం.. బోర్ గా ఫీలయిన ఆ జంట, తమను తాము మ్యారేజ్ మెటేరియల్ కాదని అనుకున్న ఆ జంట చివరకు పెళ్లితో ఏకం కావడంతో సినిమా ముగుస్తుంది!
మణిరత్నం సినిమా అలా తీశాడని కాదు.. అంతకు మించిన పరిష్కారం కూడా లేదు! ఒకరికొకరు నిజంగానే నచ్చితే సహజీవనం అక్కర్లేదు.. ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు. నచ్చరు అనుకుంటే.. దాన్ని తెలుసుకోవడానికి సహజీవనం అక్కర్లేదు. అలా కాకుండా.. ఏదో టెస్టింగ్ డోస్ లా కలిసి ఉండి, కాపురం చేస్తే.. దాన్ని అందంగా ‘సహ జీవనం’ అనుకున్నా.. అదీ ఒకరకంగా వ్యభిచారమే అవుతుంది. తీవ్రంగానే అనిపించినా.. మన సమాజంలో అక్రమసంబంధాలు, వ్యభిచారం కూడా భాగమే.. ఆ కేటగిరిలోనే కొంత మార్పు ‘సహజీవనం’చేయడం అనాల్సి వస్తుంది!
ఓపెనప్ అభినందనీయమే.. ఓవరాల్ గా అభినందించేయలేం!
సినిమా వాళ్లు సహజీవనాలు చేస్తున్నారు, పెళ్లి చేసుకుండా కాపురాలు పెట్టేస్తున్నారు.. అనే విషయాలను మన సమాజానికి దర్పణం అనేయలేం. 24 క్రాఫ్ట్స్ సినిమా రంగంలో హీరో-హీరోయిన్లు చాలా తక్కువ శాతం. అలాంటి ఇంత పెద్దసమాజంలో వారెంత? వారి ఆదర్శం, వారే దర్పణం .. అనలేం కానీ, వాళ్లు ఓపెనప్ అవుతున్న విషయాన్ని గమనించవచ్చు.
మొన్నటి వరకూ ఉత్తరాదినే సినీ స్టార్లు, బాలీవుడ్ వాళ్లు లివింగ్ రిలేషన్ షిప్ వార్తల్లో నిలిచే వాళ్లు. ఇప్పుడు దక్షిణాది వాళ్లు కూడా అలాంటి పోకడలకు పోతున్నారు. కమల్ హాసన్ లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే.. మిగతా వాళ్ల వ్యవహారాలు లోగుట్టుగానే నడిచాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నయనతార- విఘ్నేష్, నాగచైతన్య – సమంత వంటి వాళ్లు చాలా ఓపెన్ గానే కనిపిస్తున్నారు. తమ రిలేషన్ షిప్ స్టేటస్ ను సహజీవనంగా చెప్పుకోవడంలో ఇలాంటి వాళ్లు మొహమాట పడటం లేదు. దక్షిణాది వారు కాకపోవచ్చు కానీ విరాట్- అనుష్క శర్మల జంట కూడా చాలా ఓపెన్ గానే బంధాన్ని కొనసాగిస్తోంది.
కానీ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇలాంటి వాళ్లు కూడా.. పెళ్లి చేసుకుంటాం అనే మాట చెబుతున్నారు… కాబట్టే వీళ్లకు విలువ. ఆ మాట చెప్పకుండా.. ‘అవును.. సహజీవనంలో ఉన్నాం, ఇలానే జీవితాన్ని లీడ్ చేస్తాం..’ అని ప్రకటించే జంటలు మన దగ్గర ఉండవు, పెళ్లి చేసుకుంటాం అని ఇప్పటికి ప్రకటించి, ఆ తర్వాత విడిపోయినా ఎవరూ గుచ్చిగుచ్చి ప్రశ్నించరు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, మేం మ్యారేజ్ మెటీరియల్ కాదు, ‘సహ జీవనం’ తోనే పండంటి కాపురాన్ని సాగిస్తాం అనే జంట మాత్రం ఇంక మన దగ్గర జత కలవలేదు! వారెవరో జత కలిస్తే మన దగ్గర కూడా దాంపత్య కొత్త గమనం పట్టినట్టే!
ఒకవైపు కాప్ పంచాయితీలు, మరోవైపు ఇలాంటి తల్లిదండ్రులు!
‘ ఏం చేస్తున్నామనే అంశం పై వాళ్లిద్దరికీ అవగాహన ఉంది. వాళ్ల జీవితం గురించి ఆందోళన అక్కర్లేదు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తాను… ’ తన కూతురి గురించి వస్తున్న రకాల వార్తలు, వ్యాఖ్యానాలపై స్పందిస్తూ బ్యాడ్మింటన్ లెజెండరీ ప్రకాష్ పదుకునే చేసిన వ్యాఖ్య ఇది. అంతకు మించి చూస్తే.. ఇది ఒక తండ్రి మాట. కూతురి మనోభావాలను, ఆమె ఎంపికను, ఆమె తీరును సమర్థిస్తున్న నయా జనరేషన్ ఫాదర్.
సాహిత్యంలో భాగమైంది, సినిమాల రూపంలో పలకరించింది.. ఇప్పుడు హై క్లాస్ సొసైటీకి ఆమోదయోగ్యం అవుతోంది ‘సహజీవనం’. మిగిలిన సభ్య సమాజం ఇలాంటి బంధాల విషయంలో ఇంకా ఆశ్చర్యపోతున్నట్టుగానే ఉన్నా.. ఇప్పటికే ఆ సమాజంలో కూడా ఈ పోకడ మొదలైందనేది కాదనలేని సత్యం. యువతీయువకులు సహజీవనాలను ఆచరిస్తున్న విషయం తరచి చూస్తే ఫ్రెండ్స్ సర్కిల్ లోనూ అగుపిస్తుంది. కొంచెం ఆలోచిస్తే కొంతకాలం అయినా.. సహజీవనంలో ఉన్న పరిచయస్తులో, స్నేహితులో, స్నేహితురాల్లో గుర్తు రాక మానరు.
అయితే ఇదే సమాజం ఇంకా ‘కాప్ పంచాయితీ’ల దగ్గరే ఉందని కూడా గుర్తు చేయాలి. కులాంతార వివాహాలను చేసుకుంటామని అంటుంటే, కొట్టి చంపుతున్నారు కొన్ని చోట్ల. కన్నబిడ్డలనే చంపుకోవడానికి కూడా వాళ్లు వెనుకాడటం లేదు.
ఈ దేశంలో అర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో.. సామాజిక అసమానతలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. సహజీవనాలను సమర్థించే తల్లిదండ్రులూ ఉన్నారు, ప్రేమ అంటేనే పాపమన్నట్టుగా భావించే వాళ్లూ ఉన్నారు.