‘శాతకర్ణి’ రాజకీయం

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర ఆడియో విడుదల వేడుక డిసెంబర్‌ 16న తిరుపతిలో జరగనుంది. బాలకృష్ణకు సంబంధించిన పలు సినిమాల ఫంక్షన్లలో టీడీపీ అధినేత చంద్రబాబు కన్పించారు. ఈ…

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర ఆడియో విడుదల వేడుక డిసెంబర్‌ 16న తిరుపతిలో జరగనుంది. బాలకృష్ణకు సంబంధించిన పలు సినిమాల ఫంక్షన్లలో టీడీపీ అధినేత చంద్రబాబు కన్పించారు. ఈ వేడుకకీ చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరోపక్క కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని సైతం ఈ వేడుకకి ఆహ్వానిస్తున్నారు. ఆయన రావడం కూడా దాదాపు ఖాయమే. 

రాజకీయ ప్రముఖులు సినీ ఫంక్షన్లలో పాల్గొనడం వింతేమీ కాదు. రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'ధృవ' ప్రీ రిలీజ్‌ వేడుకకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన విషయం విదితమే. అయితే, ఆయా వేడుకల్లో ఎక్కడా ఆయా పార్టీల హడావిడి కన్పించదు. కానీ, 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో విడుదల వేడుకకి మాత్రం, టీడీపీ హడావిడి చాలా ఎక్కువగా కన్పించనుంది. 

ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు, తిరుపతిలో మీటింగ్‌ కోసం భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారట. సినిమా ఫంక్షన్‌ని పొలిటికల్‌ సభగా మార్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, బాలయ్యతో కూడిన భారీ కటౌట్లకు ప్లాన్‌ చేస్తున్నారు. పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తల్ని ఈ వేడుకకు తరలించనున్నారు. ఎలాగూ బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే గనుక.. ఈ హంగామా తప్పదన్నది తెరవెనుక ఆఫ్‌ ది రికార్డ్‌గా విన్పిస్తోన్న ఊహాగానాల సారాంశం. 

ఇదిలా వుంటే, చంద్రబాబు – వెంకయ్య ఒకే వేదికపై కన్పిస్తే, ఆ తర్వాత సాగే పొలిటికల్‌ ప్రసంగాల గురించీ, ఒకర్ని ఒకరు పొగుడుకోవడం గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే. అదీ 'శాతకర్ణి' ఆడియో వేడుకలో కన్పించనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!