జనాలను ఇళ్లలోనే ఉంచడానికి సూపర్ ప్లాన్

జనాలను ఇళ్లలోనే ఎందుకు ఉంచాలనేది అందరికీ తెలిసిందే కదా. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ పీచమణచడానికి. వైరస్ దానంతట అది వ్యాప్తి చెందదు కదా. మనుషులు కదిలితే అది కదులుతుంది. అందుకే జనాలను…

జనాలను ఇళ్లలోనే ఎందుకు ఉంచాలనేది అందరికీ తెలిసిందే కదా. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ పీచమణచడానికి. వైరస్ దానంతట అది వ్యాప్తి చెందదు కదా. మనుషులు కదిలితే అది కదులుతుంది. అందుకే జనాలను ఇళ్లలోనే ఉండండిరా అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. రోడ్లమీదికి వచ్చినవారిని ఇళ్లలోనే ఉండాలంటూ పోలీసులు వేడుకుంటున్నారు. దండాలు దస్కాలు పెడుతున్నారు. అయినా జనం మాట వినడంలేదు. 

అమెరికాలో చూశారుగా లాక్ డౌన్ ఎత్తేయాలని జనం రోడ్లమీదికి వచ్చి గొడవ చేస్తున్నారు. నగరాల్లో లాక్ డౌన్ అమలు కత్తి మీద సాములా మారింది. సహనం నశించిన పోలీసులు ఒక్కోసారి బలప్రయోగం చేస్తున్నారు. అలా చేస్తే వారిపై విమర్శలు వస్తున్నాయి. అందుకే దండాలు పెడుతున్నారు. యువకులను రోడ్డు మీద గుంజిళ్ళు తీయిస్తున్నారు. ప్రజలకు నచ్చచెప్పడం తప్ప మరో పరిస్థితి లేదు. 

మరి 10 వేల కుటుంబాలు ఉన్న గ్రామంలోనూ లాక్ డౌన్ కష్టంగా ఉందా ? అక్కడా జనం పట్టించుకోరా? ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండలేరా ? అవును …ఉండలేరు అనే అభిప్రాయానికి వచ్చారు ఆ గ్రామ పంచాయతీ పెద్దలు. మరి అప్పుడు వారేం చేశారు ? అసలు ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది ? తెలంగాణలోనా? ఆంధ్రాలోనా? ఈ రెండు రాష్ట్రాల్లో కాదండి. కేరళలో ఉంది. మలప్పురం జిల్లాలోని తజిక్కోడ్ గ్రామ పంచాయతీ అది. చిన్న ఊరే. 

అయినప్పటికీ ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని పంచాయతీ పెద్దలు ఆలోచించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం డబ్బు, ఇతర తాయిలాలు ఇస్తారు కదా. అదే సూత్రం ఇప్పుడూ అమలు చేయాలనుకున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు అంటే మే 3 వరకు ఒక్కరు కూడా ఇళ్లనుంచి బయటకు రాకపోతే అలాంటి వారికి బహుమతులు ఇస్తామని పంచాయతీ ప్రకటించింది. బహుమతులంటే యేవో నామమాత్రపు బహుమతులు కావండి. విలువైనవే. మొదటి బహుమతి … అర సావరిన్ బంగారం, రెండో బహుమతి … రిఫ్రిజిరేటర్, మూడో బహుమతి … వాషింగ్ మెషిన్. ఇవి కాకుండా 50 కాంప్లిమెంటరీ బహుమతులు కూడా ఉన్నాయి. 

లాక్ డౌన్ అధికారికంగా ముగిసిన వెంటనే ఈ బహుమతులు ఇస్తామని పంచాయతీ పెద్దలు వాగ్దానం చేశారు. అయితే లాక్ డౌన్లో  తాము అసలు బయటకే రాలేదని ప్రజలు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఊళ్ళో ఉన్న పది వేల మందికీ బహుమతులు ఇవ్వలేరు కదా. అందుకనే ప్రజలందరికీ కూపన్లు ఇచ్చారు. లాక్ డౌన్ తరువాత లక్కీ డ్రా తీస్తారు. దాంట్లో అదృష్టవంతులకు బహుమతులు వస్తాయి. కాబట్టి అదృష్టం దక్కాలంటే ఇళ్లలోనే ఉండాలి. 

హెరిటేజ్ లో ఎంతమందికి కరోనా వచ్చింది?