మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే…

ఢిల్లీలో కదులుతున్న బస్సులో యువతిపై గ్యాంగ్ రేప్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలి అదే ఢిల్లీలో ఓ క్యాబ్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ ఆన్‌లైన్ క్యాబ్‌లని బ్యాన్ చేసెయ్యాలి Advertisement దేశ రాజధాని…

ఢిల్లీలో కదులుతున్న బస్సులో యువతిపై గ్యాంగ్ రేప్
బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలి
అదే ఢిల్లీలో ఓ క్యాబ్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
ఆన్‌లైన్ క్యాబ్‌లని బ్యాన్ చేసెయ్యాలి

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగుతున్నాయి.. భవిష్యత్తలోనూ జరుగుతాయి. పాలకులు మారినా, మహిళలపై అకృత్యాలు తగ్గడంలేదు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోనో, ఆన్‌లైన్ క్యాబ్‌లను బ్యాన్ చేస్తేనో మహిళలపై అఘాయిత్యాల అగిపోతాయనుకోవడం హాస్యాస్పదం. మొత్తంగా సమాజంలోనే మార్పు రావాల్సి వుంది. ఆ మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. దానికి తగ్గ చర్యలు అధికారంలో వున్నవారు తమ స్థాయిలో చేపడితే, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, విచిత్రంగా అలాంటి చర్యల్ని తీసుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు.

చట్టాలు.. నిఘా టీమ్‌లు.. విచిత్రాలు.!

ఢిల్లీ నుంచి హైద్రాబాద్ దాకా.. ఆ మాటకొస్తే ఆర్థిక రాజధాని ముంబై నుంచి గల్లీ దాకా.. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. చట్టాలు లేకనేం, నిందితుల్ని శిక్షించడానికి చాలానే వున్నాయి. కానీ, ఆ చట్టాలే బూజుపట్టిపోయాయి. అనేకానేక కారణాలతో దోషులు తప్పించుకుంటున్నారు. దాంతో చట్టాలంటే భయపడే పరిస్థితి లేదు తప్పు చేసేవారికి. అందుకే తప్పు మీద తప్పు.. తప్పు మీద తప్పు జరిగిపోతూనే వుంది. కొన్ని చట్టాలు విచిత్రంగా తెరపైకొస్తుంటాయి. వరకట్న వేధింపుల వ్యవహారమే వుంది.. ఓ మహిళ కేసు పెడితే చాలు, అత్తింటోవారి పనైపోయినట్టే. దీన్నిప్పుడు రివ్యూ చేస్తోంది కేంద్రం. కొన్ని చట్టాల్ని అమలు చేయక, మరికొన్ని చట్టాల్ని అతి తీవ్రంగా అమలు చేసేసి.. అన్నిటినీ రాజకీయ కోణంలో చూడటం వల్లే ఇప్పుడీ దుస్థితి దాపురించింది. రోడ్లపై ఆకతాయిల ఆటకట్టించేందుకు హడావిడిగా కొన్ని టీమ్‌లు ఏర్పాటవుతుంటాయి. అది ఘటన వెలుగు చూసిన కొన్నాళ్ళవరేక. ఆ తర్వాత ఆ టీమ్‌ల జాడే వుండదు.

ఆన్ లైన్ క్యాబ్‌లను నిషేధిస్తే సరిపోతుందా.?

చాన్నాళ్ళ నుంచి ఆన్‌లైన్ క్యాబ్‌ల వ్యవహారం చాపకింద నీరులా పాకేసింది. ఢిల్లీలో ఓ క్యాబ్‌లో యువతిపై అత్యాచారం జరిగే సరికి ఆన్‌లైన్ క్యాబ్‌లపై కేంద్రం, వివిధ రాష్ట్రాలూ కొరడా ఝుళిపించేశాయి. మెట్రో రైల్ వంటి ఆధునిక ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా, ప్రధాన నగరాల్లో సామాన్యుల ప్రయాణ కష్టాలు తీరడంలేదు. ఆన్‌లైన్ క్యాబ్స్ పుణ్యమా అని ఆ కొరత కొంత తీరుతుందనే చెప్పాలి. అసలంటూ అవి రోడ్లమీదేక రాకుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. యధేచ్ఛగా ఆన్‌లైన్ క్యాబ్‌లు రోడ్లపై తిరిగేస్తోంటూ ‘నిబంధనలకు విరుద్ధం’ అన్న సంగతి కేంద్రంలోని పాలకులకుగానీ, రాష్ట్రాల్లోని పాలకులకుగానీ బోధపడలేదు. ఘటన జరిగాక, క్యాబ్‌లను నిషేధించేసరికి, ఒక్కసారిగా పరిస్థితి తల్లకిందులైపోయింది. క్యాబ్‌లకు అలవాటుపడ్డవారేమో కార్యాలయాలకు ఎలా వెళ్ళాలో అర్థం కాక డైలమాలో పడిపోయారు. గతంలో ఢిల్లీలో కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్ (నిర్భయ ఘటన) జరిగితే, రాత్రి వేళ బస్సుల్లో లైట్లు వుండాలి, సీసీ కెమెరాలు వుండాలి.. అని అధికారంలో వున్నవారు ఆదేశాలు జారీ చేసేశారు. అప్పట్లో అది పెద్ద కామెడీ అయిపోయింది. క్యాబ్‌లను నిషేధించడం కూడా అలాగే మారిందిప్పుడు.

క్యాబ్‌లు సరే, విద్యాలయాలు సైతం సురక్షితం కాదే.!

ఓ మోస్తరు పట్టణాల్లోనూ అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థినిని లోబర్చుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు ఉపాధ్యాయుల ఉదంతం ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అంతకు ముందు హైద్రాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో యువతిని, ఆమె పెళ్ళాడబోయే వ్యక్తిని పాములతో బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ముంబైలో ఏకంగా ఓ జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిగింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అంటే, ఇక్కడ క్యాబ్‌లుగానీ, బస్సులుగానీ, విద్యాలయాలుగానీ.. ఏదీ మహిళలకు సురక్షితం కాదన్నమాట. అలాగని అన్నిటినీ బ్యాన్ చేసేయలేం కదా.!

రాజకీయ నాయకుల నోటి దురద తగ్గాలి

రాజకీయ నాయకులంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి జన్మ హక్కు.. అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. మహిళలు పొట్టి స్కర్టులు వేయడంతోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒక పెద్దాయన అంటాడు. సభ్య సమాజం గౌరవించేలా మహిళల వస్త్రధారణ వుండాలంటూ ఒకాయన అంటే, దాన్నో వివాదం చేసి పారేశారు. మంచీ చెడూ అన్న తేడా లేదిక్కడ. వివాదాస్పద అంశాలెలాగూ వివాదాస్పదవుతూనే వుంటాయి. సాధారణ సత్యాలు కూడా వివాదాలుగా మారిపోతుండడమే దురదృష్టకరం. వస్త్ర ధారణ అనేది అత్యాచారాలకు కారణమా.? కాదా.? అన్న విషయం పక్కన పెడితే, ఏడాది వయసున్న చిన్నారి నుంచి అరవయ్యేళ్ళ ముసలి అవ్వ కూడా అత్యాచారాలనుంచి తప్పించుకోలేని దురదృష్టకర పరిస్థితులున్నాయి మన దేశంలో. దీనంతటికీ కారణం.. మారుతున్న ఆలోచనలు, వెర్రితలలు వేస్తోన్న పాశ్చాత్య సంస్కృతి.

ఈ సినిమాలూ ఆ సినిమాలూ..

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినిమాల్లో పెడధోరణలు ఎక్కువైపోయాయి. బూతు కంటెంట్ వున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం మాటెలా వున్నా, సమాజంపై ఎంతోకొంత స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే నీలి చిత్రాల తారల్ని తీసుకొచ్చి మరీ, మసాలా సినిమాల్ని తెరెకక్కిస్తున్నారు. ఏమన్నా అంటే, ‘సినిమాల్లో మంచీ చూపిస్తున్నాం.. దాన్నెవరూ ఎందుకు ఫాలో అవరు..?’ అని సినీ జనం అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. దీనికి సమాధానం చెప్పడం కష్టమేగానీ, మంచికన్నా చెడు వేగంగా యువత మెదళ్ళలోకి వెళ్తుందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఇక, ఇంటర్నెట్‌లో నీలి చిత్రాల హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అత్యాచారాల గురించి చట్ట సభల్లో దుమ్ముదులిపే ప్రసంగాలు చేసేస్తుంటారు రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా. మరి, ఇంటర్నెట్‌కి సెన్సార్ పెట్టొచ్చు కదా.? అనడిగితే మాత్రం, ఎవరికీ నోరు పెగలదు. 

దేశానికి దిశా నిర్దేశనం చేయాల్సినవాళ్ళే…

చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశనం చేస్తాయి. అందులోని ప్రజా ప్రతినిథులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, అందరూ అలా వుంటున్నారా.? కొందరు చట్టసభల్లోనే అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య ఓ రాష్ర్ట అసెంబ్లీలో అధికార పార్టీ నేతలే (ఇందులో అమాత్యులూ వున్నారు) మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలు తిలకించారు. అలాంటి ఘటనే మరోటి ఇటీవలే వెలుగు చూసింది. ఇవన్నీ రాజకీయ వివాదాలుగా మారుతున్నాయి తప్ప, ఇంకోసారి ఇలాంటి ఘటనలు వెలుగు చూడకుండా, దోషులకు చట్ట సభలనుంచి సాగనంపడం లాంటి చర్యలేమీ తీసుకుంటున్న దాఖలాలు కన్పించడంలేదు. చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులే ఇలా వ్యవహరిస్తోంటే, వారిని రోల్ మోడల్స్‌గా తీసుకునే వారి అనుచరులు ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చట్ట సభల్లో ఇలాంటి ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వుంటున్నాయి. దురదృష్టవశాత్తూ అలాంటివారిని పక్కన పెట్టుకుని మరీ వివిధ పార్టీలకు చెందిన నేతలు అత్యాచార ఘటనలపై ఊకదంపుడు ప్రసంగాలు దంచేస్తున్నారు.

విలువల వలువలూడిపోయాయ్

సమాజంలో విలువలు నశించిపోతున్నాయి. కారణమేదైనా మనిషి వావి వరసలు మర్చిపోతున్నాడు. అందరూ అని కాదుగానీ, ఇదో వైరస్‌లా మారి సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఎక్కడో ఢిల్లీలో జరిగింది కదా.. ఇంకెక్కడో ముంబైలో జరిగింది కదా.. అనుకోడానికి వీల్లేదు. మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో మనం ఊహించుకోలేని అఘాయిత్యాలు మహిళలపై జరుగుతున్నాయి. తప్పెవరిది.? అని ఒకర్ని ఒకరు నిందించుకోవడం కాకుండా.. వ్యవస్థ మొత్తంగా ఆలోచించి, ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. చట్టాల్లోనూ మార్పులు రావాలి… చట్ట సభల్లోకి వెళ్తున్నవారి ఆలోచనలూ మారాలి.. సాధారణ ప్రజానీకంలోనూ మార్పులు రావాలి. సమాజంలో విలువల్ని నాశనం చేస్తోన్న కొన్ని పాశ్చాత్య పోకడలకు అడ్డుకట్ట వేయాలి. ఇదంతా జరిగే పనేనా.? అంటే, జరిగితే తప్ప మహిళలపై అఘాయిత్యాలు ఆగే పరిస్థితి లేదు.

 సింధు