ఎటిఎమ్‌ల రక్షణకు ఆయుధాల చట్టం అడ్డువస్తోంది

బ్యాంకులు తమ బ్రాంచ్‌లపై పని ఒత్తిడి తగ్గించుకోవడానికి విపరీతంగా ఎటిఎమ్‌లు తెరుస్తున్నాయి. వాటి ద్వారా క్యాష్‌ తీసుకోమని కస్టమర్లను ప్రోత్సహిస్తున్నాయి. ఆ కారణంగా దేశంలో 1.70 లక్షల ఎటిఎమ్‌లున్నాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో వాటి…

బ్యాంకులు తమ బ్రాంచ్‌లపై పని ఒత్తిడి తగ్గించుకోవడానికి విపరీతంగా ఎటిఎమ్‌లు తెరుస్తున్నాయి. వాటి ద్వారా క్యాష్‌ తీసుకోమని కస్టమర్లను ప్రోత్సహిస్తున్నాయి. ఆ కారణంగా దేశంలో 1.70 లక్షల ఎటిఎమ్‌లున్నాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో వాటి సంఖ్య 4 లక్షలు కావచ్చు. అయితే ఈ ఎటిఎమ్‌లలో క్యాష్‌ నింపే భారాన్ని బ్యాంకులు క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ఏజన్సీలకు అప్పగిస్తున్నాయి. అవే తమ వ్యాన్‌లలో క్యాష్‌ తీసుకుని వెళ్లి ఎటిఎమ్‌లలో నింపుతున్నాయి. రోజుకి రూ. 15 వేల కోట్ల రూపాయల నగదు మన దేశపు రోడ్లపై బ్యాంకుల నుండి ఎటిఎమ్‌ల మధ్య వ్యాన్‌లలో తిరుగుతోంది. 30 వేల కోట్ల రూ.ల విలువ చేసే ఈ రంగం యిప్పుడు విపరీతంగా వృద్ధి చెందుతోంది. 2020 నాటికి లక్షకోట్ల విలువకు చేరుతుందట. ప్రస్తుతానికి 50 లక్షలమంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు. అంటే పోలీసులు, హోంగార్డుల సంఖ్య కంటె మూడు రెట్లు ఎక్కువన్నమాట. అయితే చిక్కేమిటంటే యీ సెక్యూరిటీ గార్డులకు తగిన ఆయుధాలు లేవు. ఇటీవల కాలంలో ఎటిఎమ్‌లపై, వాటిలో నగదు నింపే వ్యాన్‌లపై దాడులు జరుగుతున్నాయి. గత నెలలో ఢిల్లీలోని కమలా నగర్‌లో క్యాష్‌ వ్యాన్‌ సెక్యూరిటీగార్డుని చంపి రూ.1.50 కోట్ల నగదు ఎత్తుకుపోయారు. గత ఏడాదిలో యిలాటి సంఘటనలు జరిగాయి. ముగ్గురు చనిపోయారు. 

1959 ఆయుధాల చట్టం ప్రకారం ప్రయివేటు సెక్టార్‌ ఉద్యోగులకు, వాణిజ్య అవసరాలకై ఆయుధాలు యివ్వరాదు. ఈ చట్టాన్ని ఉపయోగించి రెండు సంవత్సరాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం జ్యూయలరీ షాపుల వద్ద, షాపింగ్‌ మాల్స్‌ వద్ద, ఎటిఎమ్‌ల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డుల దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసుకోసాగింది. ఈ వ్యాపారస్తులందరూ గగ్గోలు పెట్టి లాబీయింగ్‌ చేసి ఆ పని ఆపించారు. ''తక్కినవారి మాట ఎలా వున్నా యీ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ వారి సెక్యూరిటీ గార్డులకు మాత్రం ఆయుధాల లైసెన్సు యివ్వండి. వాళ్లు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల తరఫున పబ్లిక్‌ మనీ బదిలీ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ కార్యంగానే పరిగణించండి'' అని ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ 2013లో హోం శాఖకు విన్నవించుకుంది. వాళ్లు యిప్పటిదాకా కదలలేదు. చూదాం చూదాం అంటున్నారు. ఆయుధాలు లేని సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని భారీ క్యాష్‌ తరలించడం ఎలా? అందుకని  ఆయుధాల లైసెన్సు వున్న ప్రయివేటు వ్యక్తులను యీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. మన దేశంలో వున్న తమాషాయే యిది. అక్రమ ఆయుధాలు పుష్కలంగా దొరుకుతాయి. వాటిని విచ్చలవిడిగా వాడుతూంటారు. కానీ యిలాటి అవసరమైన పనులకు ప్రభుత్వం రూల్సు పేరుతో అడ్డుపడుతూ వుంటుంది. ఇదేం పద్ధతి అని హోం శాఖ జాయింట్‌ సెక్రటరీని అడిగితే ''ఆయుధాల చట్టాన్ని మార్చడమనేది రాత్రికి రాత్రి జరిగేది కాదు. కాలక్రమంలో జరుగుతుంది.'' అని తాపీగా జవాబిచ్చాడాయన. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]