రెండు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో మళ్లీ అలజడి మొదలైనట్లు అగుపిస్తున్నది. అన్నల (నక్సలైట్లు) కదలికలు ప్రారంభమవ్వడమే ఇందుకు కారణం. అన్నల ప్రభావం పూర్తిగా తగ్గిందనుకుంటున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో అన్నల కదలికలు రెండు రాష్ట్రాల సర్కార్‌కు, పోలీస్ యంత్రాంగానికి సవాలు విసురుతున్నట్లుగా ఉంది. అయితే, అన్నల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఖాకీలు అన్నల ఏరివేతకు అడవుల్ని ల్లెడపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విడిపోతే నక్సలైట్ల సమస్య మళ్లీ మొదటికి వస్తుందన్న వాదన నిజం కానున్నదా? సద్దుమణిగారుకున్న అన్నలు మళ్లీ విజృంభించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారా? పాలకులపై దాడులు చేసేందుకు యాక్షన్ టీంలకు శిక్షణ ఇస్తున్నారా? కొత్త దళ సభ్యుల్ని తయారీ చేస్తున్నారా? గత వైభవం కోసం అన్నలు మరోమారు ప్రజా ఉద్యమాలకు ప్రాణం పోస్తున్నారా? దీని కోసమే ఆదివాసుల హక్కుల కోసం సభల్ని నిర్వహించారా? అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలు చూస్తుంటే నిజమేననీ అనిపిస్తున్నది. కొన్ని ఏళ్ల విరామం తరువాత అడవుల్లో బూట్ల చప్పుడు, తుపాకుల మోతలు వినిపిస్తున్నాయి.
పోలీస్‌లు అన్నల ఎదురు కాల్పులతో అడవులు మళ్లీ దద్దరిల్లుతున్నాయి. గిరిజనం ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా అమాయక ప్రజలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, అవినీతిపరులు భయపడుతున్నారు. కాదు, కాదు ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనబడుతున్నాయనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గడిచిన దశాబ్దం కాలంగా అన్నలు దండకారణ్యానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే, తాజాగా తమ ఉనికి కోసం అటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో, ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతంలో అన్నలు తమ ఉనికి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారనీ తెలుస్తున్నది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులను తమవైపు తిప్పుకోవడం కోసం ఆదివాసుల హక్కుల కోసం పేరిట ఓ భారీ సభను అన్నలు ఏర్పాటు చేసినట్లు అగుపిస్తున్నది.
మరోవైపు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్నలు తమ కార్యకలాపాలను విస్తరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. తమ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో యాక్షన్ టీం సభ్యులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అడవీపై దాడి చేశారనీ, పోలీసులు, అన్నల మధ్య ఎదురు కాల్పులు జరిగాయనీ, ఈ కాల్పుల్లో ఇద్దరు అన్నలు గాయపడ్డట్లు కూడా సమాచారం. నాలుగేళ్ల కిందట జరిగిన ఆజాద్ ఎన్కౌంటర్ తరువాత ఇప్పుడు పోలీసులు నక్సలైట్ల మధ్య వరుసగా రెండు పర్యాయాలు ఎదురు కాల్పులు జరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీసే పరిస్థితి మళ్లీ ఏర్పడింది.
సుదీర్ఘ కాలం తరువాత అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో అన్నలు సభలూ, సమావేశాలు పెడుతున్న తీరు చూస్తుంటే మరలా అన్నలు తమ పూర్వ వైభవాన్ని చాటుకోవాలనుకుంటున్నారా? లేక, కేవలం ఉనికి కోసమే అన్నలు సభలూ, సమావేశాలు నిర్వమిస్తున్నారా? అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నల కదలికలు చూస్తుంటే పోలీస్ యంత్రాంగానికి సవాళ్లు విసురుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు దండకారాణ్యానికి పరిమితమైన అన్నలు తమ ఉనికి కోసం తమ కార్యకలాపాలను మొదలుపెడుతుండటంతో ‘వారి’ని అణచివేసేందుకు పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. అన్నలను ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వకుండా పోలీస్ యంత్రాంగం అడవీలో అనువనువు గాలిస్తున్నది. అన్నల అణచివేతకు ఏర్పాటు చేసిన మెరైన్ పోలీస్ వ్యవస్థను మరింతగా పటిష్టం చేసే పనిలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. తాజా పరిణామాలు ప్రజల్ని టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. అడవిలో అన్నలు ఆట మొదలు పెడితే, పోలీసులు వారి కోసం వేటను ముమ్మరం చేశారు. సద్దుమణిగారనుకున్న అన్నలు అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణ రాష్ర్టంలో ఒక్కసారిగా లేస్తుండటం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు అన్నల సభలతో, ఇటు పోలీసుల జల్లెడ కార్యక్రమాలతో ఎప్పుడేమీ జరుగుతుందోననీ తెలుగు ప్రజలు భయాందోళనలోపడ్డారు.
ముఖ్యంగా ఆంధ్రలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు, తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గడిచిన దశాబ్దం కాలంగా నక్సలైట్ల కార్యకలాపాలు చాలా వరకు సద్దుమణిగాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నక్సలిజాన్ని చాలా వరకు అణచివేయగలిగారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం రెండు రాష్ట్రాలుగా చీలిపోయిన నేపథ్యంలో అన్నలు మరలా విస్తరించడానికి మెల్లమెల్లగా తమ కార్యకలాపాలపై దృష్టిని మళ్లించినట్లు అగుపిస్తున్నది. తొలుత గిరిజనులు అధికంగా ఉండే అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలపై నక్సలైట్లు తమ ఫోకస్‌ను కేంద్రీకరించినట్లు కనబడుతున్నది. గతంలో ప్రజా మద్దతుతో అన్నలు అనేక ఉద్యమాలు నడిపారు. ప్రజా మద్దతుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సమాంతర సర్కార్‌ను నడిపారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే, మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అన్నలు విస్తరించడం అంత తేలికైన విషయమేమీ కాదనీ చెప్పొచ్చు. కానీ, నక్సలైట్లు మాత్రం తమ ఉనికి కోసమో, పూర్వ వైభవం కోసమో మొత్తానికి తెలియదు కానీ ఇప్పటి వరకు దండకారణ్యానికిి పరిమితంగా ఉన్న అన్నలు ఇప్పుడు ఏకంగా ప్రజల మధ్యకు వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అగుపిస్తున్నది. దీనిలో భాగంగానే ఆంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో వందలాది మంది ఆదివాసులతో సభను ఏర్పాటు చేసి తొలి అడుగులో సెక్సస్ అయ్యారనీ చెప్పాలి. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గిరిజనులు అధికంగా ఉండే అటవీ ప్రాంతంలో యాక్షన్ టీం సభ్యులకు శిక్షణ ఇస్తున్న క్రమంలో పోలీసులకు అన్నల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ కాల్పుల్లో ఇద్దరు అన్నలు కూడా గాయపడ్డారనీ సమాచారం. ఇటీవలి కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా రెండు పర్యాయాలు ఎదురు కాల్పులు జరగడంతో ఇప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న గిరిజనులు ఉలిక్కిపడుతున్నారు.
మరోవైపు ఆంధ్రలో ఆదివాసుల హక్కుల కోసం నిర్వహించిన సభలో తెలంగాణ ప్రాంతంలో రెండు ప్రయివేట్ టెలివిజన్ ఛానెళ్ల నిషేధంపై అన్నలు స్పందించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తెలుగు ఛానెళ్ల ప్రసారాల పునరుద్దరణపై తమ అగ్రనేతలతో సంప్రదించి ఈ నెల 21తరువాత తెలంగాణ సర్కార్‌పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామనీ అన్నలు చెప్పినట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీసింది. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలైట్లు తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా మద్దతును ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. దీనితో టీఆర్ఎస్ సర్కార్ పట్ల అన్నల వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై అందరిలో టెన్షన్‌కు గురిచేస్తున్నది. ప్రస్తుతానికి నక్సలైట్లు వారి అనుబంధ సంస్థలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిషేధం కొనసాగుతున్నది. ఈ తరుణంలో టి.సర్కార్‌పై అన్నలు ప్రకటించబోయే నిర్ణయం ఏంటన్నది… దానిపై టి.సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారడటమే కాకుండా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి చాలా ఏళ్ల తరువాత అన్నల హల్చల్తో రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. చూడాలి మరి!
(ఎ.సత్యనారాయణ రెడ్డి)