దాదాపు మూడు సంవత్సరాల క్రితం సంచలన రీతిలో హసన్ అలీ పేరు బయటకు వచ్చింది. గుర్రాల వ్యాపారి అయిన హసన్ కు భారత్ లోని అనేక మంది రాజకీయనేతలతో సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. హవాలా రూపంలో విదేశాలకు నల్లధనాన్ని తరలించడంలో ఎక్స్ పర్ట్ అయిన హసన్ అలీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరితో కూడా సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. మరి ఏపీ కి మాజీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అంటే ఒక్కోరు ఒక్కో పేరు చెప్పారు.
ఏపీకి చెప్పుకోదగ్గ మాజీ ముఖ్యమంత్రుల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే ముఖ్యులు. హసన్ అలీ పేరు వెలుగులోకి వచ్చినప్పటికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. రోశయ్య మాజీ ముఖ్యమంత్రే అయినప్పటికీ హసన్ అలీ వ్యవహారాలు నడిపినప్పటికి రోశయ్య ముఖ్యమంత్రి పదవిలో లేడు. ఇక వైఎస్సార్ మాజీ ముఖ్యమంత్రి కాదు. ఆయన దివంగత ముఖ్యమంత్రి అంతే. పదవిలో ఉన్నప్పుడే చనిపోయినందును వైఎస్ పేరును మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించేందుకు లేదు. ఒకవేళ వైఎస్ కు హసన్ అలీతో సంబంధాలే ఉంటే… సూటిగా దివంగత ముఖ్యమంత్రికే హసన్ అలీతో సంబంధాలున్నాయని కథనాలు వచ్చేవి. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రికే హసన్ అలీతో సత్సంబంధాలున్నాయని.. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఆ పేరు అయితే అప్పుడు బయటకు రాలేదు!
మరి ఇప్పుడైనా ఆ పేరు బయటకు వస్తుందా?! హసన్ అలీతో సంబంధాలున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎవరో బీజేపీ సర్కారు చెప్పగలదా?! విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని బయటకు తెస్తామని పదేళ్లుగా గొప్పలకు పోతున్న కమలనాథులు అసలు దొంగలను వెలుగులోకి తీసుకురాగలరా?! అనేవి సందేహాలు. అంతే కాదు.. హసన్ అలీకి కొంతమంది కాంగ్రెస్ ఎంపీలతో కూడా సత్సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. అవిభక్త ఏపీకి చెందిన ఒక అందమైన మహిళా ఎంపీకీ హసన్ అలీకి సత్సంబంధాలున్నాయని.. ఆమెకు హసన్ అలీ ఒక వజ్రపుటుంగరాన్ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని జాతీయ మీడియాలో భారీ కథనాలే వచ్చాయి. ఆమె కాంగ్రెస్ లోనే ఉండటంతో ఆ వ్యవహారాన్ని అంతటితో కప్పిపుచ్చారు. మరి ఇప్పుడైనా ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయా?! లేక మోడీ సర్కార్ కూడా ఈ వ్యవహారాలను సమాధి చేస్తుందా?!