మన ప్రభుత్వ అధికారులు రోడ్లు వేయాలంటే… బోలెడు వర్షాలు కురిసి, అవి సర్వనాశనమై నానా కంగాళీగా తయారై, జనం గగ్గోలు పెడితే అప్పుడు తాపీగా నిద్రమత్తు నుంచి లేచి పనులు మొదలెడతారు. అవి కూడా అవినీతి మకిలి అంటుకుని ఎంత నాణ్యంగా ఉంటాయో మనకు తెలియంది కాదు.
సరే… ఇవన్నీ మనకు అలవాటైపోయాయి కాబట్టి సర్ధుకుపోతున్నాం. సిటీల్లో ఉండేవాళ్లే సర్ధుకుపోతుంటే ఇక గ్రామాల్లో అయితే రోడ్డు వేయడమే మహాభాగ్యం అనుకుంటారు కదా… అయితే ఈ సారి ఏకంగా బతికున్న మనిషి మీద నుంచే రోడ్డు వేసేశారు. ఈ పని చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో.
మధ్యప్రదేశ్‌లోని కాట్ని అనే ప్రాంతంలో తాజాగా కొత్త రోడ్లు వేశారు. అయితే మరుసటి రోజే ఆ రోడ్డు కింద ఒక మనిషి ఉన్నట్టు తమకు అనుమానంగా ఉందని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తవ్వి తీస్తే చితికిపోయిన 45ఏళ్ల వయసు వ్యక్తి మృతదేహం బయటపడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు నగరంలో పెద్ద యెత్తున ధర్నా, నిరసనలు చేపట్టారు. ట్రాఫిక్‌ను స్థంభింపజేశారు. దీంతో అధికారులు సదరు రోడ్డు పనుల్లో పాల్గొన్న సిబ్బందిలో ఒకరిని, ఒక డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించి, కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
ఇంతకీ సదరు దురదృష్టవంతుడు ఎవరంటే… స్థానికంగా నివసించే లటోరీలాల్ అని తేలింది. అతను భార్యతో ఘర్షణ పడి రాత్రి 8గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. గ్రామస్థులతో కలిసి ఆ రాత్రి పూట టార్చిలైట్లు సహా పాపం వెతికిందా ఇల్లాలు. అయినా భర్త ఆచూకీ దొరకలేదు. తనమీద అలిగి ఎటో వెళ్లిపోయి ఉంటాడనుకుంది గాని, ఇలా ప్రభుత్వాధికారుల నిర్వాకం తన భర్తను తిరిగిరాని లోకాలకు చేరుస్తుందనుకోలేదు.
భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిన లటోరి…మద్యం సేవించి, ఇంటికి తిరిగి వస్తూ పొరపాటున కాలు జారి రోడ్డు మీది గోతిలో పడిపోయాడు. తలకు ఏదో బలంగా తగలడంకు తోడైన మద్యం మత్తుతో ఆ రాత్రి పూట అక్కడే అలాగే పడి ఉన్నాడు. పొద్దున్నే రోడ్డు పనులు మొదలయ్యాయి. లటోరిని చూసుకోని వర్కర్స్ ఆ గోతిని తారుతో నింపేశారు. రోడ్డు రోలర్‌తో లెవల్ చేసేశారు. లటోరి కధ అలా ముగిసిపోయింది.
ఒకరిద్దరు సిబ్బందిని తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? తెగ తాగమంటూ బార్లను తెరుస్తున్న ప్రభుత్వాల కారణంగా తాగి రోడ్ల మీద పడిపోతున్న వాళ్లు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు. అలాంటివాళ్లను ఇలాంటి నిర్లక్ష్యం పొట్టన పెట్టుకోదని గ్యారంటీ ఈ సస్పెన్షన్‌లు ఇవ్వగలవా? అసలు ఇప్పటికే అలాంటివి జరగలేదని కూడా అనుకోలేం.. ఎందుకంటే… లటోరి చొక్కా ముక్క రోడ్డు నుంచి పైకి తేలి కనపడడంతో కనీసం అతను రోడ్డు కింద పూడుకుపోయాడని తెలిసింది. లేకపోతే జల్సా సినిమా క్లయిమాక్స్‌లో విలన్ కత్తిలాగా… లటోరి ఆచూకీ కూడా ఇక ఎప్పటికీ కనపడకుండా అయిపోయేది. హతవిధీ…