మంట పుట్టించిన నరేంద్రమోడీ.!

'భారత ప్రధాని నరేంద్రమోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు.. మా దేశాన్ని తీవ్రవాద దేశంగా అభివర్ణిస్తారా.? ప్రపంచానికి తీవ్రవాదాన్ని ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న పాకిస్తాన్‌.. అని ఆరోపిస్తారా.? ఎంత ధైర్యం.? మేం అభివృద్ధి కాముకులం..…

'భారత ప్రధాని నరేంద్రమోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు.. మా దేశాన్ని తీవ్రవాద దేశంగా అభివర్ణిస్తారా.? ప్రపంచానికి తీవ్రవాదాన్ని ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న పాకిస్తాన్‌.. అని ఆరోపిస్తారా.? ఎంత ధైర్యం.? మేం అభివృద్ధి కాముకులం.. మేం కూడా తీవ్రవాద బాధితులమే..' అంటూ పాకిస్తాన్‌ గుస్సా అయ్యింది. 

కేరళలో నరేంద్రమోడీ పర్యటిస్తుండడం, ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో పాకిస్తాన్‌పై దుమ్మెత్తిపోయడం తెల్సిన విషయాలే. 'పాకిస్తాన్‌ ప్రజలతో మాట్లాడుతున్నా.. పాకిస్తాన్‌లోని నా అన్నదమ్ములతో మాట్లాడుతున్నా.. మీ పాలకుల తల్లిదండ్రులు, ఒకప్పుడు భారతదేశంలోనే పుట్టారు.. వారంతా ఈ నేలతల్లిని ముద్దాడారు.. మీ పాలకుల్ని అడగండి, పేదరికంతో యుద్ధం చేద్ధామని.. అలాంటి యుద్ధానికి మేం కూడా సై..' అంటూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

స్వాతంత్య్రం కోరుకుంటున్న పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోనే కాదు, ఇస్లామాబాద్‌, కరాచీ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్‌ పాలకుల్ని అక్కడి ప్రజలు సూటిగా నరేంద్రమోడీ వ్యాఖ్యలపైనే ప్రశ్నించడం మొదలు పెట్టారు. దాంతో, పాకిస్తాన్‌ పాలకుల వెన్నులో వణుకు మొదలైంది. దాంతో, 'శ్రీనగర్‌లో రక్తం ఏరులై పారుతుంది జాగ్రత్త..' అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు పాకిస్తాన్‌కి చెందిన పలువురు పెద్దలు. వీరిలో మంత్రులు కూడా వున్నారు. 

మొత్తమ్మీద, నరేంద్రమోడీ మాటల తూటాలు బాగానే పనిచేశాయి. ప్రపంచ దేశాలు సైతం, భారత్‌ వ్యవహరిస్తున్న సంయమనం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో, పాకిస్తాన్‌ చేస్తోన్న 'మారణహోమం.. రక్తం ఏరులై పారుతుంది..' లాంటి ప్రకటనల్నీ ప్రపంచ దేశాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేశాలు భారత్‌కి అండగా, పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నిలిచాయి. యుద్ధం అంటే పాకిస్తాన్‌పైకి తుపాకీలతో, యుద్ధ విమానాలతో, యుద్ధ ట్యాంకులతో, మిస్సైళ్ళతో దండెత్తడం కాదు.. వ్యూహాలతో కూడా దండెచ్చవచ్చనే విషయం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. సహనం ఎప్పుడూ చేతకానితనం కాబోదు.