మీడియాతోడుగా బాహుబలి విజయం

బాహుబలి సినిమా ఓ పెద్ద హిట్…అందులో ముందు వెనుక చూడాల్సింది ఏమీ లేదు. రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు జనాల నుంచి రాబట్టింది అంటే హిట్ సినిమా కాక మరేం అంటారు.…

బాహుబలి సినిమా ఓ పెద్ద హిట్…అందులో ముందు వెనుక చూడాల్సింది ఏమీ లేదు. రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు జనాల నుంచి రాబట్టింది అంటే హిట్ సినిమా కాక మరేం అంటారు. అంతే అనాలి. సినిమా విడుదలయిన కొన్ని గంటలకు వచ్చిన సమీక్షలను పక్కన పెడితే, బాహుబలి విజయంలో మీడియా పాత్ర ఇంతా అంతా కాదు. సినిమా..మీడియా ఈ రెండు అవిభక్త కవలల లాంటివి. ఒకదాని తోడు మరొకదానికి అవసరం. కాదు, ప్రాణావసరం. మీడియా లేకుండా సినిమా జనాలకు చేరువ కాలేదు..సినిమా లేకుండా మీడియా పూర్తిగా మనలేదు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. ఏ సినిమా కైనా సరే మీడియా వ్యవహారలు తోడుగా వుండడం మామూలే. అయితే బాహుబలి విషయంలో చాలా భిన్నమైన వ్యవహారాలు నడిచాయి. 

బాహుబలి మేకింగ్ ప్రారంభమైన నాటి నుంచీ మీడియా ఆ సినిమాపై ఇంతా అంతా ఉత్సాహం కనబర్చలేదు. బా అన్నా వార్తే..హు..అన్నా వార్తే..బలి అన్నా వార్తే. వార్తను చెప్పినవారు లేరు..చూసిన వారు లేరు..రాజమౌళి ని మించి ఊహాగానాలు సాగాయి. ఎవరికీ ప్రవేశంలేని రామోజీ ఫిల్మ్ సిటీ లోకేషన్ లోకి తమ ఊహానేత్రాలను సారించిమరీ వార్తలు రాసింది మీడియా. ఇలా రాసిన వాటిలో సినిమా యూనిట్ ను కాస్త ఇబ్బంది పెట్టినవీ వున్నాయి..నవ్వుకునేలా చేసినవీ వున్నాయి.. ఏవార్తయినా సరే, నీటి బోట్టు నీటిబోట్టు కలిపి, బిందెను నింపేసినట్లు, అలా అలా సినిమాపై జనాలందరి బుర్రల్లో ఓ వికీపీడియా పేజీ తయారుచేసేసాయి. సగటు ప్రేక్షకుడు ఎవరిని కదిలించినా, వాడి బుర్రలో బాహుబలిపై బోలెడు సమాచారం. అది నిజమా..కాదా అన్నది పక్కన పెట్టండి. ఇలా జనాల్లో బాహుబలి అన్నది రిజిస్టర్ అయిపోయింది. 

కానీ చిత్రమేమిటంటే, అప్పటికి బాహుబలి యూనిట్ నుంచి అఫిషియల్ గా ఒక్క ప్రెస్ నోట్ వస్తే ఒట్టు.  సినిమా విడుదల ముందు సంగతి కదా, ఇప్పటి నుంచి ఎందుకు హడావుడి అని వారి పని వారు సిన్సియర్ గా చేసుకుంటూపోయారు. అప్పటికీ ఇంకా ఒక భాగమా, రెండు భాగాలా..ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఎవరి ఊహాగానం వారు చేసారు. ఇంకో చిత్రమేమిటంటే, మీడియా రేకెత్తించిన ఈ ఆసక్తి సోషల్ మీడియాకు పాకింది. వాళ్లలోనూ అద్భుతమైన క్రియేటర్లు వున్నారు. గ్రాఫిక్ చిత్రాలు, డైలాగులు, కథ ఎవరికి తోచింది వారు వండి వార్చారు. 

నెట్ తోడు..

ఇలాంటి నేపథ్యంలో టీజర్ అంటూ ప్రారంభమైంది. అప్పుడు కూడా బాహుబలి యూనిట్ మీడియాకు దగ్గరగా రాలేదు. సింపుల్ గా ఇంటర్ నెట్ లోకి వదిలారు. మీడియా దాన్నే మహా ప్రసాదంగా తీసుకుంది. తన వంతు ప్రచారం తానే సాగించింది. అక్కడ నుంచి ఏ వైనం అయితేనేం..యూనిట్ చడీ చప్పుడు లేకుండా ఇంటర్ నెట్ లోకి వదిలేది. దానికి ప్రచారం కలిగించే బాధ్యత తనదే అనకుంది మీడియా. వాళ్ల టీజర్ వదిలితే టీజర్, పోస్టర్ వదిలితే పోస్టర్, ఏదయితే అది, అన్ని మీడియాల్లో రీ ప్రొడ్యూస్ అయింది. ఎవరూ అడగలా..ఇలా చేయరా ప్లీజ్..అని, ఎవరూ అడగలా ఇది కావాలని..కానీ మీడియానే ఆసక్తి పెంచుకుంది. జనాల్లో ఆసక్తి పెంచింది. 

దాంతో వాళ్లు చూపిస్తున్నారని వీళ్లు, కాదు, వీళ్లు చూపిస్తున్నారని వాళ్లు, మొత్తానికి బాహబలి కంటెంట్ హాట్ కేక్ అయింది. మొత్తానికి సినిమా ప్రారంభమై, విడుదల, వారం దాటుతోంది..ఇప్పటికి బాహుబలి యూనిట్ పెట్టిన ప్రెస్ మీట్ ఒకటే ఒకటి. అది కూడా హైదరాబాద్ లో అడియో ఫంక్షన్ వాయిదా వేసినప్పుడు మాత్రమే. విడుదలకు ముందు పైరసీపై పెట్టిన ప్రెస్ మీట్ ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేసింది. అంటే వందకోట్లకు పైగా బడ్జెట్ సినిమాకు బాహుబలి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఒక్కటే ఒక్కటి.   

పైగా బాహుబలికి పీఆర్వోకు కూడా అంతగా పని పెట్టలేదు. రాజమౌళి స్వంత కార్యాలయంలో మీడియా వింగ్ చూసే వాళ్లే ఆ పనీ చూసారు. పేరుకు ఓ పీఆర్వో వున్నారంతే. జస్ట్ పోస్ట్ మాస్టర్ డ్యూటీ. కానీ ఇంత ప్రచారం ఎలా వచ్చిందీ అంటే మీడియా ఆ సినిమాను అంతలా ఓన్ చేసుకుంది.

ఈనాడు వుందిగా

ఇలాంటినేపథ్యంలో బాహుబలికి ఈనాడు తోడు దక్కింది. ఇంతవరకు ఏ సినిమాకైనా ఇంటర్వూలు వేయడం మామూలే కానీ, ఫుల్ పేజీ ఇంటర్వూలు వేసిన ఘనత బాహబలే దక్కించకుంది. ఈనాడు సినిమా పేజీని కొన్నాళ్ల పాటు బాహుబలికి అంకింతం ఇచ్చేసారు. తెలుగుదేశం పార్టీ, మధ్యనిషేధం, చంద్రబాబు, మోడీ తరువాత ఈనాడు పత్రిక ఇంతలా బాసటగా నిలిచింది బాహుబలి సినిమాకే అంటే అతిశయోక్తి మాత్రం కానే కాదు. ఒక సినిమా గురించి కథనాలు రాయడం కోసమే పాయింట్లు వెదికి మరీ కిందా మీదా పడ్డారు.

స్కైలాబ్ కింద పడుతుందట…గోదావరిపుష్కరాలకు వెళ్లకుంటే పాపం పోదట..అన్నరీతిలో బాహుబలి అనే సినిమా వస్తోంది..అది తప్పని సరిగా చూసి తీరాలి అన్న మైండ్ సెట్ ను తయారుచేసి పెట్టారు విడుదల నాటికి. 

అయినా కూడా రాజమౌళి అండ్ కో చాలా టెన్షన్ పడ్డారు. ఇన్ని కోట్లు పెట్టారు. సినిమా ఎలా వుంటుందో? జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో? అని మథనపడ్డారు. ఇది పైకి చెప్పకున్నా వారి చర్యల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా తెలుగులో సమస్య కాదు, బాలీవుడ్ లో అసలు సమస్య అనుకున్నారు. అక్కడ వీలయినంత ప్రచారం, పాజిటివ్ సమీక్షల కోసం కిందా మీదా పడ్డారు. మన తెలుగువాడు, మన తెలుగు సినిమా, మనం ఎంకరేజ్ చేయకుంటే ఎలా అంటున్నారు ఇప్పుడు. కానీ రాజమౌళి అండ్ కో, సినిమాను ఈ రేంజ్ కు చేర్చిన తెలుగు మీడియా వంక కన్నెత్తి అయినా చూడలేదు. బాలీవుడ్ సమీక్షకుల కోసం ముందురోజు మధ్యాహ్నమే ప్రత్యేకంగా షొ ఏర్పాటుచేసారు. పాజిటివ్ సమీక్షలను ముందే వచ్చేలా చేసారు. 

దానికి కొంచెం ముందుగా, ఇక బాగుండదని, తెలుగుమీడియాకు ఇంటర్వూలు ఇవ్వడం ప్రారంభించారు. రాజమౌళి, తమన్నా, ప్రభాస్ ..అది కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ గా ఇంటర్వూలు ఇచ్చారు. కేవలం నాలుగైదు పత్రికలను ఎంచుకుని మాత్రం పిలిచారు. చిరకాలంగా వుంటున్నా ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త, సూర్య, ఇలాంటి వాటిన్నింటిని పక్కన పెట్టారు. చాలా చానెళ్లకు దర్శనమే ఇవ్వలేదు. అయినా కూడా..పక్కదాంట్లో వచ్చిందో, పీఆర్వో పంపించిందో అటు ఇటు చేసి, మేము సైతం బాహుబలి వార్త ప్రచురించాం అనిపించుకున్నాయి ప్రతికలు, చానెళ్లు. 

సాక్షి సైతం..

ఈనాడు అంటే సినిమాకు ఎన్నో కొన్ని కోట్లు ఫైనాన్స్ చేసింది, ఈ సినిమా కారణంగా రామోజీ ఫిల్మ్ సిటీకి కోట్లలో బిల్లువచ్చింద..అందుకోసం తన వంతు సాయం తను చేసింది అనుకుందాం..మరి సాక్షికి ఏమయిది? సినిమా విడుదల ముందు, మర్నాడు, సాక్షి వెబ్ సైట్ లో నూటికి తొంభై వార్తలు బాహుబలి గురించే. బా..బాకు దీర్ఘం, హ …హ కు కొమ్ము..ల…ల కి గుడి..ఇలా ఎంతలా విడమరిచి చెప్పచ్చో, అన్ని రకాల వార్తలు వండి వార్చారు. ప్రభాస్ స్వయంగా సాక్షి పెద్దలు కొందరికి ఫోన్ చేసి సహకరించమని కోరారని, దాంతో వారు కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో ముందుకు ఉరికారని వినికిడి,. ఇంకేమిటి? రాష్ట్రంలో అత్యథిక సర్క్యులేషన్ కల రెండు పత్రికలు బాహబలి శివలింగాన్ని మోసినట్లు, ఈ సినిమాను మోసాయి. సినిమా విడుదలకు రంగం సిద్ధమయింది. 

ప్రభుత్వ చేయూత

అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడు రాఘవేంద్రరావు. ఆయన నిర్మాణం. పైగా రామోజీరావు ఫైనాన్స్, అది కాక, రాజమౌళి అండ్ కో అంటే బాలయ్యకు కుటుంబ సభ్యుల లెక్క. మరి ప్రభుత్వం ఎందుకు అండగా నిలవదు? టికెట్ రేట్లు పెంచమని థియేటర్లు గతంలో చాలా సార్లు అడిగాయి. కానీ పెంచలేదు. అప్పటి నుంచి పెద్ద సినిమాలు వచ్చినపుడల్లా, రెవెన్యూ, పోలీస్ లకు మామూళ్లు ఇచ్చుకుంటూ, నూరు, నూటా యాభై, రెండు వందలు ఫిక్స్ చేసకుని పని కానిచ్చేస్తున్నాయిు. కానీ ఇది ఒకటి రెండు రోజులుమాత్రమే. అయితే బాహబలి విషయంలో అలా కాదు. వారం పొడవునా రెండువందలే రేటు. అధికారులకు అనధికార ఆదేశాలు. ఒకే రాత్రి పదుల సంఖ్యలో స్పెషల్ షోలకు అధికారిక అనుమతులు. ఇలా ఒక్క వారంలో ఎంత తోడాలోఅంతా తోడేందుకు ప్రభుత్వం తన వంతు సాయం అందించింది..

ఓ విడియో పార్లర్ యజమాని ఇలా అన్నాడు. 'మాకు ముందే పోలీసులు చెప్పేసారు. బాహబలి సిడి రెండు వారాల వరకు అమ్మవద్దు..ఇన్నాళ్లు మీకేమీ అనలేదు…మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు. బాహుబలిని మాత్రం వదిలేయండి..' పైరసీని అరికట్టడం అత్యవసరం. పోలీసుల చర్య ముమ్మాటికీ సమర్థనీయం..కానీ ఒక్క బాహుబలి విషయంలో మాత్రమే ఎందుకిలా? ఇక్కడ వంద కోట్లు పోతే, మరో సినిమాకు పది కోట్లు పోతాయి. నష్టం నష్టమే. మరి ప్రభుత్వం మిగిలిన సినిమాలకు కూడా ఇలాగే స్పెషల్ షోలు, పైరసీపై కన్ను లాంటి వ్యవహారాలకు సహకరిస్తుందా? అనుమానమే?

కులాల ఈక్వేషన్లు

సినిమా రంగంలో, సినిమా అభిమానంలో కులాల ఈక్వేషన్లు మామూలే. కానీ ఎప్పుడు రెండు సామాజిక వర్గాలే ఇక్కడ పాలు పంచుకుంటాయి. కానీ ఈసారి కోస్తాలో కాస్తో కూస్తో బలమైన మరో సామాజిక వర్గం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ కట్ అవుట్ లు, హోర్డింగ్ లు అదిరిపోయేలా కష్టపడింది. ఇన్నాళ్లకు తమకు ఓ హీరో దొరికాడు, తమ సత్తా చాటాలి..ఇది మా సినిమా, దీన్ని నిలబెట్టాలి అన్నట్లు కష్టపడ్డారు. చిత్రంగా హీరో వైనం అలా వుంటే దర్శకుడిని ఆదిగా తీసుకుని, మరో సామాజికవర్గం ఇలాంటి అద్భతమైన సినిమా అందించింది మా వాడు అందుకని, తమ వంతు ప్రచారం తాము సాగించారు. చిరకాలంగా మరో సామాజికవర్గం ఇస్తున్న పోటీని తట్టుకోలేక, సరైన హీరోలు, హిట్ లు రాక కిందా మీదా అవతున్న ఆ వర్గం కూడా ఈసినిమాను ఓన్ చేసుకుంది. ఇది కూడాబాహబలి విజయానికి చేయాల్సిన సాయం చేసింది. 

కలెక్షన్ల సునామీ

ఏమయితే నేమి? జనాల్లో బాహుబలి ఫీవర్ అవథిగి మించడానికి ఇలా ఎవరి చేయూత వారు అందించారు. అందుకే తొలివారానికి నైజాంలో 22.72, సీడెడ్ లో 12.12, గుంటూరులో 5.47, నెల్లూరులో 2.25, ఈస్ట్ లో 5.23, కృష్ణాలో 3.64, వైజాగ్ లో 5.40, వెస్ట్ లో 4.51, కర్ణాటకలో 20.20,  యుఎస్ఎ లో, 21, నార్త్ ఇండియాలో 24, తమిళనాడులో 13, కేరళలో 2, మిగిలిన వన్నీ కలిపి మరో 6 కోట్లు వసూళ్లు వచ్చాయి. అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలిపి, దగ్గర దగ్గర 150 కోట్ల షేర్ సాధించింది. సినిమాను 130 కొట్లకు పైగా విక్రయించారని వినికిడి. అంటే బయర్లు అంతా గట్టెక్కిపోయారు. ఇంకా మరో వారం కలెక్షన్లు బాగానేవుంటాయి. అందువల్ల రెండు వందల కోట్ల మార్కును దాటుతారా అన్నది చూడాలి. అయితే అన్నిభాషల శాటిలైట్ లు కలిపి 30 కోట్ల వరకు వస్తాయని అంచనా. 

ఈ కలెక్షన్లు సునామీని ఎవరూ ఊహించేలేదు. అయితే ధైర్యం చేసి కొన్నారు..అమ్మారు. అమ్మినవాళ్లు టెన్షన్ పడ్డారు. కొన్నావాళ్లు థియేటర్లపై పడి అడ్వాన్స్ లు తెచ్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ హ్యాపీ. పిచ్చ హ్యాపీ. 

మీడియానే టార్గెట్

అయితే మళ్లీ మీడియానే ఇక్కడ టార్గెట్ అయింది. తెలుగు మీడియా దాదాపు నూరు శాతం ఒకే తరహా సమీక్షలు అందించింది. సినిమా బాహుబలి ది బిగినింగ్ అన్నందుకు..శాంపిల్ మాదిరిగానే వుంది కానీ, పరిపూర్ణంగా లేదన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ఎవ్వరూ కూడా నాలుగు స్టార్ లు ఇవ్వకపోవడం ఆశ్చర్యం. హిందూస్థాన్ టైమ్స్ లాంటి జాతీయపత్రిక కేవలం రెండు రేటింగ్ ఇచ్చింది. అయితే అందరూ ఒక అభిప్రాయం ఏకగ్రీవంగా వెలిబుచ్చారు. 

విజువల్ గ్రాండీ..ఊహాతీత కల్పనా చాతుర్యం..ఇవన్నీ సినిమాలో పుష్కలంగా వున్నాయని. ఇప్పుడు జనం కూడా దాన్నే ఆస్వాదిస్తున్నారు. నలుగురు మెచ్చుకున్నాక, మనం మెచ్చుకోకుంటే బాగుండదన్న రీతిలో సినిమా జనాలు వున్నారు. నిజానికి ఆఫ్ ది రికార్డుగా మాట్లాడే సినిమా జనాలు చాలా మందికి ఈ సినిమా నచ్చలేదన్నది వాస్తవం. అయితే ఏ తెలుగు మీడియానైతే బాహుబలికి దూరం పెట్టారో, ఏ తెలుగు మీడియా అయితే బాహబలికి ఈ రేంజ్ హైప్ తెచ్చిందో, అదే తెలుగుమీడియా బాహుబలికి మిక్స్ డ్ రివ్యూలు ఇవ్వడం చాలా మందికి కోపకారణమైంది. బాహుబలికి ఇంత సాయం అందించిన మీడియానే మళ్లీ టార్గెట్ అయింది. అయితే సమీక్షల తరువాత మళ్లీ అదే మీడియా బాహుబలిని నెత్తినేమోసింది. 

కానీ..వెలితి వెలితే..

రాజమౌళి పైకి అంగీకరించకపోవచ్చు..అభిమానులు ఒప్పుకోకపోవచ్చు..రెండవ భాగం వుంది కాబట్టి, ఈభాగం ఇలాగే వుంటుదని సరిపెట్టుకోవాలనుకోవచ్చు..కానీ నిజం..నిజమే.. బాహబలి..ఇప్పటివరకు రాజమౌళి వండివార్చిన అద్భతమైన విందుభోజనాల్లోకెల్లా, అరకొర విందు ఏదైనా వుందీ అంటే, అది బాహుబలి మాత్రమే. ఈ ఆకలి రెండో భాగంలో తీరుస్తారని ఆశిద్దాం.

'చిత్ర'గుప్త