మరో సంక్రాంతి… అభిమానులు మాత్రం మారలా…!

మరో సంక్రాంతి వచ్చింది.. సంక్రాంతి సినీ సందడి పీక్స్ కు వెళ్లింది. పదేళ్ల తర్వాత చిరంజీవి సినిమా వచ్చింది. బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా కూడా వచ్చింది. విడుదలకు ముందు నుంచే ఎంతో సందడి! అంతకు…

మరో సంక్రాంతి వచ్చింది.. సంక్రాంతి సినీ సందడి పీక్స్ కు వెళ్లింది. పదేళ్ల తర్వాత చిరంజీవి సినిమా వచ్చింది. బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా కూడా వచ్చింది. విడుదలకు ముందు నుంచే ఎంతో సందడి! అంతకు ముందు నుంచినే ఇరు హీరోల అభిమానుల నడుమ ఎంతో పోటీ! తమ హీరోల సినిమాలు వస్తున్నాయనే ఉత్సాహం సంగతి ఎలా ఉన్నా, వీరి మధ్య వైషమ్యాలు మాత్రం పేట్రేగిపోయాయి. తమ హీరో సినిమా గొప్ప అంటే.. తమ హీరోనే గొప్ప అంటూ.. మొదలుపెట్టి, వ్యక్తిగత దూషణలు, పరస్పరం కించపరుచుకోవడం.. సోషల్ మీడియాలో ఇదే పని!

ఇదేమీ కొత్త కాదు.. గతం నుంచి కొనసాగుతున్నదే! అయితే సోషల్ మీడియా యుగంలో.. సినీ అభిమానానికి కులం కోణం కూడా తోడయ్యింది. ఇటీవలే హత్యలు చేసుకునే వరకూ వెళ్లింది ఈ సినీ మూఢాభిమానం. ఇంత వరకూ వెళ్లిన అభిమానులకు హీరోల ఓదార్పులు కూడా తోడవ్వడం ఒకరకంగా విస్మయాన్నే కలిగించింది. ఈ తరహా అభిమానాన్ని వీరు తమ రాజకీయ ఎదుగుదలలకు పునాదులుగా మార్చుకునే విష క్రీడను ఆడుతున్నారా? అనే అనుమానాలు కలిగాయి! పరిస్థితి అలా విషమిస్తుందేమో.. అనే అనుమానాలు కలుగుతున్న దశలో సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి సినిమాలు వచ్చాయి.

అయితే.. వాతావరణాన్ని తేలిక పరిచే యత్నం చేశారు స్టార్ హీరోలు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ హీరో బాలకృష్ణ కావొచ్చు ‘ఖైదీ-150’ తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కావొచ్చు… తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో పోటాపోటీగా విడుదల చేసినా, తమ సినిమాల మధ్య ఉన్న పోటీ ఆరోగ్యకరమైనది అని ముందు నుంచే చెప్పుకొంటూ వచ్చారు. ఖైదీ-150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ కి శుభాకాంక్షలు తెలిపాడు. బాలయ్య సినిమా కూడా బాగా ఆడాలని ఆకాంక్షించాడు. తద్వారా అభిమానులకు కూడా చిరంజీవి స్పష్టమైన సంకేతాలను ఇవ్వడానికే ప్రయత్నించాడు.

ఇక ‘గౌతమి పుత్రశాతకర్ణి’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమాను ప్రస్తావించాడు ఈ సినిమా హీరో బాలకృష్ణ. పోటీ వాతావరణం మంచిదే అని ఆయన వ్యాఖ్యానించాడు. పోటీ లేకపోతే మజా ఉండదని, సినిమా వచ్చింది హిట్టైంది, వెళ్లింది అన్నట్టుగా ఉంటుందని, పోటీ ఉండాలని, చిరంజీవి సినిమాతో తమ సినిమా పోటీ ఆరోగ్యయకరమైనదని.. బాలకృష్ణ అన్నారు. ఈ విధంగా ఇరువురు స్టార్ హీరోలూ సంక్రాంతి పోటీలో తమ పెద్ద మనసును కూడా ప్రదర్శించారు.

మరి ఈ హీరోలను అమితంగా అభిమానించే వాళ్లు, ఈ హీరోలను ఆరాధించే వాళ్లు, ఈ హీరోల కోసమే తమ గుండె ఆడుతోందని, ఈ హీరోల కోసమే తమ గుండె ఆగుతుందని చెప్పుకునే అభిమానులు మాత్రం మారలా! వీళ్లు యథావిధిగా, తమ యథాశక్తి కొద్ది అమితుమి తలపడ్డారు. సోషల్ మీడియాలు వేదికగా, థియేటర్ల ఆవరణలే హద్దుగా వీళ్ల రచ్చ కొనసాగింది. చిరంజీవి సినిమా ఫ్లాఫ్ అని బాలయ్య అభిమానులు, బాలకృష్ణ సినిమా పోయిందని.. చిరు అభిమానులు రెచ్చిపోయారు. ఫేస్ బుక్ అకౌంట్లను ఇతర వెబ్ మీడియా వేదికలను ఈ విధంగా వాడుకుని.. వీరు తమ మనసులు విషతుల్యమేనని చాటుకున్నారు.

ముందుగా మెగాస్టార్ సినిమా విడుదల అయ్యింది. దానికి పాజిటివ్ బజ్ వచ్చింది. సినిమా, కథకథానాల సంగతెలా ఉన్నా..  ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే రీతిలో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడని విమర్శకులు కూడా ఆయన కష్టాన్ని మెచ్చుకున్నారు. ఈ సినిమాను కేవలం చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా చూస్తూ వారు ఆయనను ప్రశంసించారు. అయితే.. వెంటనే బాలయ్య అభిమానులుగా చెప్పుకునే వాళ్లు రెచ్చిపోయారు. చిరంజీవి రీమేక్ సినిమా చేశాడనేది వీరి ఫిర్యాదు! తమిళ సినిమా ‘కత్తి’ కి రీమేక్ గా వచ్చింది.. అంటూ వీరు చిరు సినిమాను గేలి చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా నిండా ఇలాంటి పోస్టులతో వీరు ఆనందించారు! మరి రీమేక్ సినిమాలు చేయడం తప్పేం కాదు.. తనకు ఎలాంటి కథ సూటవుతుందనే విషయంలో నిర్ణయం చిరంజీవిది. ఆయన ఎంచుకున్నారు చేశారు.. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఆయన కష్టానికి ప్రశంసలు దక్కాయి. ఇలాంటి నేపథ్యంలో.. అది రీమేక్ సినిమా అనే ఫిర్యాదు చేయడం ఒకింత విడ్డూరమే!

చిరు అభిమానులు ఎదురుదాడి!
తమను ఏమైనా అన్నా ఓర్చుకుంటారేమో కానీ, తమ అభిమాన హీరోను ఏమైనా అంటే మాత్రం ఓర్చుకోవడం లేదు ఈ జనాలు. అందుకే.. చిరంజీవి అభిమానులు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. రీమేక్ చేయడం నేరం కాదు.. అలా అంటే, బాలకృష్ణ ఎన్ని సినిమాలు రీమేక్ చేశాడు? సీనియర్ ఎన్టీఆర్ మరెన్ని రీమేక్ సినిమా చేశాడు? అంటూ వీళ్లు మొదలుపెట్టారు. పాత వివరాలు.. గణాంకాలు తీశారు. సీనియర్ ఎన్టీఆర్ ఎన్ని సినిమాలను రీమేక్ చేశాడో, బాలకృష్ణ ఏయే సినిమాలను రీమేక్ చేశాడో.. వివరిస్తూ వీళ్లు దాన్ని ఎదురుదాడిగా భావించారు. 

శాతకర్ణిపై చిరు అభిమానుల అటాక్!
గేలి చేయడం కేవలం బాలకృష్ణ అభిమానులు చేసిన పనే కాదు.. మరుసటి రోజున ఈ బాధ్యతను తీసుకున్నారు చిరు అభిమానులు. ‘గౌతమి పుత్రశాతకర్ణి’ విడుదల రోజున మెగాభిమానులు రెచ్చిపోయారు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు కేవలం బాలకృష్ణ ను చూసి కాదు అని వీళ్లు మొదలుపెట్టారు. ‘గౌతమి పుత్రశాతకర్ణి’కి తెగుతున్న ప్రతి పది టికెట్లలో రెండు టికెట్లు దర్శకుడు క్రిష్ పేరు తో అమ్ముడవుతున్నాయని, మరో రెండు టికెట్లు చరిత్రాత్మక సినిమ కాబట్టి అమ్ముడవుతున్నాయని, మిగిలినవి మాత్రమే బాలయ్య ఖాతాలో పడతాయని వీరు కొత్త థియరీని చెప్పుకొచ్చారు! అదే ‘ఖైదీ-150’ విషయంలో మాత్రం అన్ని టికెట్లూ చిరంజీవి వల్లనే అమ్ముడయినట్టే అని వీరు చెప్పుకురావడం మొదలైంది! 

ఇదీ పరిస్థితి. చిరంజీవి ది రీమేక్ సినిమా అని వీళ్లంటే, బాలకృష్ణది దర్శకుడిని సినిమా అని వాళ్లు విరుచుకపడ్డారు.. పరస్పరం విమర్శలు చేసుకోవడానికి, దాడికి, ప్రతిదాడికి ఎవరి వాదనలు వారికున్నాయి. ఎవరికి తోచినట్టుగా వాళ్లు విరుచుకుపడ్డారు!  హీరోలేమో.. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది.. మేమంతా ఒక్కటే, అని అంటే.. అభిమానులు మాత్రం ఏమీ మారలేదు. ఎవరి ధోరణిని వారు కొనసాగించారు. ‘గౌతమి పుత్రశాతకర్ణి’ సినిమా ఆరంభం ఫంక్షన్ కి కూడా చిరంజీవి హాజరయ్యాడు. అయినా.. ఇరువురి హీరోల మూఢాభిమానులు ఇంకా చల్లారడం లేదు. వీళ్లు మాత్రం ధ్వేషిస్తూనే గడుపుతున్నారు!

తన తనయుడు చరణ్ ఇతర హీరోలతో చాలా సఖ్యతతో ఉంటాడని, మహేశ్ బాబుతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లాడని, జూనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా క్లోజ్ ఉంటాడని స్వయంగా చిరంజీవి చెప్పారు. వారితో మాత్రమే కాకుండా ఇతర హీరోలతో కూడా చరణ్ కు సాన్నిహిత్యం ఉందని ఆయన వివరించారు. హీరోలు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి స్పర్థలు రాకుండా చూసుకుంటే.. అభిమానులు మాత్రం ఇంకా మధ్యయుగంలోని మనుషుల్లాగానే ఉన్నారు. ‘చిరంజీవి పార్టీ’ ‘బాలకృష్ణ పార్టీ’ అని వీరు కొట్టుకు చస్తున్నారు.

మెగా ఫ్యామిలీ కి చెందిన హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ కూడా బాలకృష్ణను ప్రశంసించాడు. తమలాంటి వాళ్లకు బాలయ్య స్ఫూర్తి అని అన్నాడు. ఇక దర్శకుడు క్రిష్ మొదట్లో ఏదో నోరు తూలినట్టుగా అగుపించినా, ఆ తర్వాత మాత్రం ఇద్దరు లెజెండ్ల సినిమాలూ హిట్ కావాలని ఆకాంక్షించాడు. వీళ్లు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ అంతా ఏకమై చిరు, బాలయ్య లిద్దరూ తమకు ఒకటే అనే సంకేతాలను ఇచ్చింది. ఇద్దరి సినిమాలకూ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. హుందాతనాన్ని ప్రదర్శించింది. అయితే.. మూర్ఖ అభిమానుల్లో మాత్రం అది శూన్యం!

మిగతా ప్రేక్షకులు విస్తుపోతున్నారు!
తెలుగు జనాలను కేవలం చిరంజీవి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు అంటూ.. రెండు వర్గాలుగానే విభజించేయలేం. ఈ అభిమానాలకు, దురాభిమాన దుర్వాసనకు దూరంగా ఉండే ప్రేక్షకుల సంఖ్య కూడా ఎంతో ఉంది, ఉంటుంది. వీళ్లు హీరోల కోసం కాకుండా.. సినిమాలు చూడటంపై ఆసక్తి ఉన్న వాళ్లు. హీరోల కోసం కాకుండా.. సినిమా కోసం తొలి రోజు సినిమాను చూసే అలవాటు ఉన్న వాళ్లు. ఇలాంటి వాళ్లు మాత్రం వీరాభిమానుల తీరుతో విస్తుపోతున్నారు. తొలి రోజు ఫలానా హీరో సినిమాకు వెళ్లామని చెబితే.. ఎక్కడ ఆ హీరో అభిమానులనే ముద్రపడిపోతుందో.. తమను కూడా ఆ మూఢమందలో కలిపేస్తారో అని భయపడాల్సి వస్తోంది.

ఒకవైపు తెలుగు వాళ్లు చాలా పురోగమనిస్తున్నారు అని చెప్పుకుంటున్నాం కానీ.. అంత లేదు, మన విభజన మూలాలు మరిచిపోవడం లేదు, రాజకీయం, కులం అనే అంశాలతో ముడిపడిన ప్రతి అభిమానంలోనూ తెలుగు వాళ్ల మధ్య స్పష్టమైన విభజన ఉంది. అని ఈ సంక్రాంతితో మరోసారి రుజువు అయ్యింది! ముందు ముందు కూడా ఈ విభజన స్పష్టంగానే అగుపించేలా ఉంది. సమసిపోయేలా లేదు! అభిమానులే దాన్ని సమసినివ్వరు! అది సమసిపోతే వీళ్లకు వేరే పని లేకుండా పోతుంది కదా! కొట్టుకోవడానికి కాజ్ లేకుండా పోతుంది కదా! 

వాళ్లలో వాళ్లకూ తేడాలున్నాయి గురూ!
ఈ మూఢ మందను చాలా రకాలుగానే విభజించవచ్చు. మెగా ఫ్యామిలీ అభిమానులు, నందమూరి ఫ్యాన్సు, మహేశ్ ఫ్యాన్సు, ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా. ఆ హీరోలను అభిమానించడం తప్పు కాదు. మూర్ఖంగా వ్యవహరించడమే ఇక్కడ తప్పు. అయితే.. ఈ విభజన ఇంతటితో ఆగిపోవడం లేదు. మెగా ఫ్యామిలీలో ఒక ముసలమూ ప్రస్ఫుటం అవుతోంది. నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ లోనూ విభజనలు ఉన్నాయి. అవి కూడా ఇదే సంక్రాంతికి ఆవిష్కృతం అయ్యాయి. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో చీలిక వర్గం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంట! ఇక గత సంక్రాంతి నుంచి నందమూరి బాలకృష్ణ అభిమానగణం వేరు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు అనే అంశం స్పష్టం అయ్యింది!

ఖైదీ-150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హడావుడి ప్రత్యేకంగా నిలిచింది. ఆ సినిమా ఫంక్షన్ లో హడావుడి చేసిన వీళ్లు, ఫంక్షన్ లో ఎక్కడా పవన్ కల్యాణ్ ప్రస్తావన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిలో కొందరు మరో అడుగు ముందుకేసి.. మెగాస్టార్ డౌన్, డౌన్ నినాదాలు కూడా చేసుకొచ్చారు! చిరంజీవి డౌన్.. డౌన్.. అనే నినాదాలు చేశారు! చిరు కుటుంబంలో విబేధాలు ఉన్నాయో లేవో దేవుడికి ఎరుక కానీ, అభిమానుల్లో మాత్రం ఈ విబేధాలు రోడ్డు వరకూ ఎక్కినట్టే. మరి ఈ మూర్ఖులు.. దీన్ని తమ ఇంటి సమస్య గా తీసుకున్నట్టుగా ఉన్నారు! చిరంజీవి, పవన్ లు వాళ్లలో వేర్వేరు కాకపోయినా.. వీళ్లు మాత్రం విభజించి చూస్తున్నారు. పవన్ పై అభిమానంతో చిరంజీవిని నిందించే దగ్గరకు, చిరంజీవిపై వీరాభిమానంతో పవన్ ను తప్పుపట్టే దశకు వచ్చారు.

ఇక నందమూరి అభిమానుల గడబిడ చాలానే ఉంది. నందమూరి ఫ్యామిలీని ఓన్ చేసుకున్న సామాజికవర్గంలో కూడా ఈ తేడాలు స్పష్టం అవుతున్నాయి. గత ఏడాది థియేటర్ల కేటాయింపు దగ్గర జరిగిన గొడవ దగ్గర నుంచి ఈ వ్యవహారం రచ్చకు ఎక్కింది. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు.. తోడబుట్టిన వాళ్లు.. నందమూరి ఫ్యామిలీని ఓన్ చేసుకున్న కులానికి చెందిన వాళ్లు.. అన్నేమో బాలకృష్ణ అభిమాని అంట, తమ్ముడేమో ఎన్టీఆర్ అభిమాని అంట. అంత వరకే అయితే పర్వాలేదు.. వీళ్ల అభిమానం శృతి మించింది, ఒకరి ముందు మరొకరు వారి హీరోలను పొగడటం,  పరస్పరం కించపరుచుకోవడం.. వరకూ వచ్చారు. ఆఖరికి ఒక రాత్రి తాగింది ఎక్కువై బీరు బాటిళ్లతో కొట్టుకోవడం వరకూ జరిగింది. చివరకు కుటుంబ సభ్యులంతా కూర్చుని వీరికి సర్ది చెప్పాల్సి వచ్చింది! ఇది బాలకృష్ణ- ఎన్టీఆర్ అభిమానులైన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటన. తరచి చూస్తే ఇలాంటి రచ్చలెన్నో ఉన్నాయి.

కలుపుగోలుగా ఉండటానికి అయినా, వేరు పడటానికి రీజన్లు వెదుక్కొంటే ఎన్నో దొరుకుతాయి. అయితే కలివిడిగా ఉండటాని కన్నా.. కొట్టుకోవడానికే వీళ్లు ప్రాధాన్యతలు వెదుక్కొంటున్నారు. ఒక హీరోని ధ్వేషించడానికి కులాన్ని ఆసరాగా చేసుకున్నారని అనుకుంటే, అందులో కూడా మళ్లీ తేడాలా! వీళ్ల విభజనలకు ఒక హద్దంటూ లేకుండా పోతోంది.