మనది పేరుకే ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో వంద శాతం ప్రజాస్వామికంగా పరిపాలన సాగుతోందా? అనే ప్రశ్నకు కాదు అనే సమాధానమే చెప్పుకోవాలి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ ప్రభుత్వాలున్నా (కమ్యూనిస్టులు బెటర్) ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూనే ఉన్నాయి. గత పదేళ్లలోనే ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించకపోయినా, నిబంధనల ప్రకారం నడుచుకోకపోయినా ఎవ్వరేమీ చేయలేకపోతున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే రాష్ట్రపతి, గవర్నర్‌లు కూడా చోద్యం చూస్తున్నారని చెప్పక తప్పదు. ఇందుకు పార్టీ ఫిరాయింపులనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఏళ్లు గడిచిపోతున్నా చర్యలు నాస్తి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్లు ముఖ్యమంత్రుల కన్నుసన్నల్లో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రులు అరాచకంగా వ్యవహరిస్తున్నా గవర్నర్లు కూడా కళ్లప్పగించి చూస్తున్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించడంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ దిట్టలే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా కొద్దిగా ఎక్కువేనని చెప్పుకోవాలి. ఒక రాజ్యాంగ సంప్రదాయాన్ని, అనవాయితీని ఆయన తుంగలో తొక్కినా అడిగే దిక్కు లేదు.
దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉంటూ, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వాస్తవానికి నలుగురికీ ఆదర్శంగా ఉండేలా అచ్చమైన ప్రజాస్వామికవాదిగా ఎదిగి ఉండాల్సింది. కాని అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆయన అహంకారం కూడా పెరిగిపోయి ప్రజాస్వామ్యాన్ని బేఖాతరు చేసే అప్రజాస్వామికవాదిగా ఎదిగారు. తాను ఆడింది ఆటగా, పాడింది పాటగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనం అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మంగళం పాడటం. పొరుగున ఉన్న తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహిస్తుండగా బాబు సర్కారు ఎగనామం పెట్టింది. సమావేశాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఉంటే అది వేరే సంగతి. 'అయ్యో పాపం పోనీలే' అనుకోవచ్చు. కాని వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో శీతాకాల సమావేశాలకు మంగళం పాడింది. నిజానికి ఇది సరైన కారణమేనా? అని ప్రశ్నించుకుంటే కాదనే చెప్పాలి. ఎందుకు? వెలగపూడిలో అసెంబ్లీ భవనం పూర్తికాకపోతే హైదరాబాదులో అసెంబ్లీ భవనం ఉంది కదా. అదింకా ఏపీ సర్కారు కిందనే ఉంది. అందులోనూ హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అనే సంగతి బాబుకు తెలుసు కదా.
అసెంబ్లీ భవనం ఉండగా శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడమేమిటి? దీన్ని గురించి గవర్నర్ కూడా ప్రశ్నించిన దాఖలా కనబడలేదు. కొత్త అసెంబ్లీ భవనం పూర్తయ్యాక బడ్జెటు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రభుత్వం శీతాకాల సమావేశాలను వదిలేసిందని వైకాపా చెప్పుకుంటోంది. ఇదో కారణమైతే అయివుండొచ్చుగాని అసలు కారణం 'పరువు సమస్య' అయివుంటుంది.
వెలగపూడిలో అసెంబ్లీ భవనం పూర్తికాకపోవడంతో శీతాకాల సమావేశాలను డిసెంబరులో హైదరాబాదులోనే నిర్వహించాల్సిరావొచ్చేమోనని కొన్ని రోజుల క్రితం స్పీకర్ కోడెల చెప్పారు. వాస్తవానికి గత సమావేశాలే అమరావతిలో నిర్వహించాలని అనుకున్నారు. కాని అసెంబ్లీ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో మూడు రోజులపాటు హైదరాబాదులోనే నిర్వహించారు. అప్పుడే కోడెల ఓ నిర్ణయానికొచ్చారు. ఏమని? తరువాతి సమావేశాలను డిసెంబరులో అమరాతిలోనే నిర్వహించాలని. అప్పటికి అక్కడ అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తవడం ఖాయమనుకున్నారు. కాని అనుకున్నదొకటి…అయ్యింది మరొకటి అన్న సామెతలా అయింది. అమరావతిలో సాధ్యం కాకపోతే హైదరాబాద్‌లో హాయిగా నిర్వహించకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు.
కాని ఇక్కడ కోడెల పరువు పోయే పరిస్థితి ఎందుకొచ్చిందంటే…హైదరాబాదులో గత అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున 'ఇక హైదరాబాదుతో బంధం తెగిపోయింది. ఇక్కడ ఇవే చివరి సమావేశాలు. వచ్చే సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయి' అని కోడెల, బాబు వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా బాబు హైదరాబాదు అసెంబ్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సచివాలయం తరలిపోయింది. అసెంబ్లీ అధ్యాయం ముగిసిపోయింది. సో…హైదరాబాదుతో ఏపీ బంధం తెగిపోయిందనే భావనతో నాయకుల హృదయాలు బరువెక్కిపోయాయి. ఇంతా చేశాక ఇప్పుడు మళ్లీ హైదరాబాదుకు వచ్చే పరిస్థితి ఏర్పడటం ఇబ్బందికరమే కదా…! వీడ్కోలు పలికేశాక మళ్లీ వచ్చారేం? అని అడిగితే జవాబు చెప్పడం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ ఇబ్బంది కారణంగానే శీతాకాల సమావేశాలకు బంకు కొట్టారా? వైకాపాకు సర్కారు భయపడుతోందా? కారణమేదైనా బాబు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యమంటే పట్టడంలేదనే విషయం అర్థమైంది.