Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: శతమానం భవతి

సినిమా రివ్యూ: శతమానం భవతి

రివ్యూ: శతమానం భవతి
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: ప్రకాష్‌రాజ్‌, జయసుధ, శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌, నరేష్‌, సిజ్జు, ఇంద్రజ, రాజా రవీంద్ర, ప్రవీణ్‌, తనికెళ్ల భరణి తదితరులు
కూర్పు: మధు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
నిర్మాత: దిల్‌ రాజు
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్‌
విడుదల తేదీ: జనవరి 14, 2017

మొదట్నుంచీ ఫీలింగ్స్‌ అన్నీ మనసులోనే బంధించేసి, చివర్లో ఎమోషనల్‌గా బర్స్‌ట్‌ అవ్వడం 'బొమ్మరిల్లు' సినిమాలో బ్రహ్మాండంగా వర్కవుట్‌ అయింది. ఆ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ని చేయడమే కాకుండా ఒక క్లాసిక్‌గా నిలబెట్టింది. అప్పట్నుంచీ క్లయిమాక్స్‌లో అలాంటి ఎమోషనల్‌ అవుట్‌బరస్ట్‌ ఉండే పాయింట్స్‌ ఎంచుకుని చాలా చిత్రాలు వచ్చాయి కానీ ఏదీ బొమ్మరిల్లులా యునీక్‌ అనిపించుకోలేకపోయింది. దిల్‌ రాజు బ్యానర్‌నుంచి తాజాగా వచ్చిన 'శతమానం భవతి' కూడా అలాంటి ఒక పతాక సన్నివేశపు ఎమోషనల్‌ అవుట్‌బరస్ట్‌పై డిపెండ్‌ అయి తెరకెక్కిన ఫ్యామిలీ కథే. 

చిన్నప్పట్నుంచీ తమ సర్వస్వం ఒడ్డి పిల్లల్ని పెద్ద చేస్తే, వాళ్లు విదేశాల్లో సెటిల్‌ అయిపోయి, కనీసం ఏడాదికి ఒకసారైనా వచ్చి తల్లిదండ్రుల కోసం ఒక పది రోజులు కేటాయించడం లేదనేది ఇందులో ఒక తండ్రి (ప్రకాష్‌రాజ్‌) ఆవేదన. తమ పనుల్లో బిజీ అయిపోయి తల్లిదండ్రులు పిలిచినా రాని పిల్లల్ని రప్పించడానికి ఆయనో 'బాంబు' పేలుస్తాడు. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నానంటూ ఆయన కబురు పెడితే వారంతా 'పండక్కి' వస్తారు!! పిల్లల్ని ఇంటికి రప్పించడానికి ఈ కాన్‌ఫ్లిక్ట్‌ పెట్టడం చిత్రంగా అనిపిస్తుంది. దీనిని సమర్ధిస్తూ ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కథని ఆసక్తికరంగా మలిచే 'సంఘర్షణ'ని ఈ పాయింట్‌ పుట్టించలేకపోయింది. కారణం... ఏం జరుగుతుందనేది ముందే ఊహించగలగడం, ఏ తరుణంలోను ఊహలకి అతీతంగా కథనం ముందుకెళ్లకపోవడం. 

'మిథునం' చిత్రంలో పిల్లలకి దూరమైన పెద్దలు అనే పాయింట్‌ని తనికెళ్ల భరణి వైవిధ్యంగా, హృద్యంగా తీర్చిదిద్దారు. 'సీతారామయ్యగారి మనవరాలు' నుంచీ ఈ కథని వివిధ రకాలుగా అనేకమార్లు తెలుగు తెరపై అలంకరించారు. ఇంతకుముందు సినిమాల్లో చర్చించని పాయింట్స్‌ని (నలుగురితో ఉన్నా ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లతో కాలక్షేపం చేయడం, కుటుంబంతో కలిసి సమయం గడపకపోవడం వగైరా) జత చేసి, ఫ్యామిలీ డ్రామా ఫార్ములాలో వేసి, అదే పాత సినిమాకి కొత్త బట్టలేసి మళ్లీ మార్కెట్లోకి వదిలారు. 

'శతమానం భవతి' ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ ఒక సగటు ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన అంశాలన్నిటితో 'సేఫ్‌ గేమ్‌' ఆడింది. రొటీన్‌ వ్యవహారం అయినప్పటికీ ప్రథమార్ధం వరకు సాఫీగా సాగిపోతుంది. లైకబుల్‌ లీడ్‌ పెయిర్‌, కలర్‌ఫుల్‌ విజువల్స్‌, అలరించే మ్యూజిక్‌తో 'శతమానం భవతి' ఫస్ట్‌ హాఫ్‌ డీసెంట్‌ అనిపిస్తుంది. విడాకుల పర్వం మొదలై, ప్రకాష్‌రాజ్‌-జయసుధల మధ్య మౌనం మొదలైన దగ్గర్నుంచీ ట్రాక్‌ తప్పుతుంది. 'మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలని' మౌనంగా, కన్వీనియంట్‌గా క్లయిమాక్స్‌ వరకు దాటేస్తారు. 'మాట్లాడ్డానికి' క్లయిమాక్స్‌ సీన్‌నే కీలకంగా పెట్టుకున్నారు కనుక అందాకా సమయం గడిపేందుకు సబ్‌ ట్రాక్స్‌ని ఇన్‌క్లూడ్‌ చేసారు.

సిజ్జు-సితారల సీన్‌ వల్ల అసలు కథకి వచ్చే ప్రయోజనం ఏంటనేది బోధ పడదు. కనీసం ఆ ఇద్దరి వల్ల శర్వానంద్‌-అనుపమల ప్రేమకథకి ఏదైనా పరిష్కారం దొరికినట్టయితే ఆ సబ్‌ ప్లాట్‌ వల్ల ఉపయోగం వుండేది.  ఒక రెండు మాటలతో పరిష్కరించిన ప్రేమకథ తాలూకు సమస్యని అసలు లేవనెత్తకుండా ఉన్నట్టయితే కనీసం ఆ రొటీన్‌ ఫీల్‌ని కాస్తయినా తగ్గించే అవకాశముండేది. సినిమా మొత్తం క్లయిమాక్స్‌లోని పే ఆఫ్‌ మీదే డిపెండ్‌ అయి నడుస్తోన్న ఫీలింగ్‌నిస్తుంది. ముఖ్యంగా ద్వితియార్ధంలో రొటీన్‌ సన్నివేశాల సమ్మేళనంతో చివర్లో ఎమోషనల్‌గా 'హై' ఇచ్చే సన్నివేశాన్నే ప్లాన్‌ చేసినట్టున్నారనిపిస్తుంది. తీరా అక్కడ ప్రకాష్‌రాజ్‌ రివీల్‌ చేసే కొత్త సంగతులేం ఉండవు. క్లయిమాక్స్‌లో శర్వానంద్‌ చేసిందేమీ లేదనుకుంటారేమో అన్నట్టు ఆ విడాకుల 'చిట్కా' తనదేనని చెప్పించారు. 

శర్వానంద్‌ 'రాముడు మంచి బాలుడు' పాత్రలో డీసెంట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. అనుపమ ప్రతి ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. వీరిద్దరి సన్నివేశాలే చిత్రానికి ఆకర్షణ తెచ్చిపెట్టాయి. ప్రకాష్‌రాజ్‌ ఇంతవరకు ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రనే మరొకసారి చేసారు. జయసుధకీ ఇలాంటి మూగ పాత్రలు కొత్తేమీ కాదు. వారిద్దరి అనుభవం మీదే ఫ్యామిలీ డ్రామా మొత్తం ఆధార పడింది. తమ ఎక్స్‌పీరియన్స్‌తో సగటు సన్నివేశాలకే సొబగులద్దారు. నరేష్‌ మతిమరపు కామెడీ బాగానే నవ్వించింది. హీరో స్నేహితుడిగా ప్రవీణ్‌ క్యారెక్టర్‌ కామెడీకి తోడ్పడింది. 

ఈ చిత్రానికి సిసలైన హీరో మిక్కీ జె. మేయర్‌. తన నేపథ్య సంగీతంతో ఫీల్‌ పుట్టించిన మిక్కీ, ఆకట్టుకునే బాణీలు అందించాడు. మంచి సాహిత్యం కూడా కుదరడంతో అన్ని పాటలు వినడానికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా కలర్‌ఫుల్‌గా ఉండడంతో సినిమాకి అవే ప్రధానాకర్షణ అయ్యాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చిత్రాన్ని రిచ్‌గా తీర్చిదిద్దాయి. ఎమోషనల్‌గా కదిలించే మూమెంట్స్‌ క్రియేట్‌ చేయడంలో దర్శకుడు మూస పోకడలకి పోయాడే తప్ప ఒరిజినాలిటీ లోపించింది. 

ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీ డ్రామాలు చూసిన ప్రేక్షకులకి కొత్త విషయాలేం చూపెట్టదీ సినిమా. ఆహ్లాదభరిత సంగీతం, ఫ్రెష్‌గా అనిపించే శర్వానంద్‌, అనుపమ జంట, కనువిందు చేసే పచ్చని పల్లె వాతావరణం మినహా 'శతమానం భవతి' ఏదీ ఆఫర్‌ చేయదు. ఎమోషనల్‌గా పండాల్సిన పతాక సన్నివేశం ప్రిడిక్టబులిటీ కారణంగా తేలిపోవడం, చివరి వరకు హోల్డ్‌ చేసే బలమైన కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోవడంతో ఫైనల్‌గా ఒక సగటు సినిమా చూసిన అనుభూతినిస్తుందే తప్ప గుర్తుండిపోయే లక్షణాలు లేవు. కుటుంబానికి దూరంగా ఉంటూ విదేశాల్లో సెటిలైన వారికీ, పిల్లలకి దూరంగా ఉంటూ లోటు ఫీలవుతోన్న పెద్దలకీ కనక్ట్‌ అయ్యే ఎమోషన్లివి. పండుగ వేళ ఫ్యామిలీ సినిమాలు చూడ్డానికి ఇష్టపడే వారికి ఇదే ఆప్షన్‌ కనుక కలెక్షన్లకి టైమింగ్‌ దోహదపడుతుంది. దిల్‌ రాజు నుంచి వచ్చిన ఎన్నో ఫ్యామిలీ డ్రామాల నడుమ ప్రత్యేకత చాటుకోవడంలో మాత్రం వెనకబడుతుంది. 

బాటమ్‌ లైన్‌: పరమ రొటీన్‌ సుమతీ!

గణేష్‌ రావూరి

 


  • Advertisement
    
  • Advertisement