12న జరగలేదు…18న జరుగుతుందా?

సంక్రాంతి సమయానికి శశికళ నటరాజన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతుందని అనేకమంది అన్నాడీఎంకే మంత్రులు, నాయకులు చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యే యోగం ఎప్పుడు ఉందంటూ శశికళ కూడా ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించారు. Advertisement 'మీరు…

సంక్రాంతి సమయానికి శశికళ నటరాజన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతుందని అనేకమంది అన్నాడీఎంకే మంత్రులు, నాయకులు చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యే యోగం ఎప్పుడు ఉందంటూ శశికళ కూడా ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించారు.

'మీరు జనవరి 12న ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది. ఒకవేళ అది తప్పితే జనవరి 18 పీఠం ఎక్కుతారు' అని జ్యోతిష్యులు నమ్మకంగా చెప్పారు. 12వ తేదీ గడిచిపోయింది. ఏమీ కాలేదు. ఇక మిగిలింది 18వ తేదీ. ఆరోజు ఏం జరుగుతుందో చూడాలి.

తమిళులకు అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. వారు దీన్ని పొంగల్‌ అంటారనే సంగతి తెలిసిందే కదా. ఈ పండుగ సమయానికి శశికళ ముఖ్యమంత్రి అవుతుందని నాయకులు ఘంటాపథంగా చెప్పారు. ఇలా చెప్పిన నాయకులంతా మరో నాలుగైదు రోజులు ఎదురు చూడాల్సిందే. శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడు అలంకరిస్తుందో తెలియదుగాని ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి మాదిరిగానే వ్యవహరిస్తోంది. వివిధ సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తోంది. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై కేంద్రానికి తెలియచేసింది. సంక్రాంతికి ముందు జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తేయాలని కోరింది. 

చెన్నయ్‌లో ఇండియా టుడే నిర్వహించిన సౌత్‌ కాన్‌క్లేవ్‌ను శశికళే ప్రారంభించారు. ఈమె పార్టీ సారథ్యం స్వీకరించాక ఒక ప్రయివేటు కార్యక్రమానికి హాజరవడం ఇదే మొదటిసారి. శశికళ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మొత్తం మంది మంత్రులు తరలివచ్చారు. పన్నీరుశెల్వంతో ఆమె ముభావంగా ఉందని, ఇద్దరూ ఒక్క మాటా మాట్లాడుకోలేదని సమాచారం. పన్నీరుశెల్వం ప్రసంగాన్ని వినకుండానే ఆమె నిష్క్రమించింది. దీంతో ఆమె పన్నీరుశెల్వాన్ని పట్టించుకోవడంలేదని అర్థమవుతోంది కదా. ఇక జయలలిత కన్నుమూశాక మొదటి అసెంబ్లీ సమావేశాలు జనవరి 23 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జ్యోతిష్యులు చెప్పింది నిజమైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా శశికళ ఉంటుంది. లేకుంటే పన్నీరుశెల్వమే నేతృత్వం వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలనాటికి పన్నీరు శెల్వానికి కన్నీరే మిగలుతుందని ఓ అన్నాడీఎంకే నాయకుడు వ్యాఖ్యానించాడట…! 

జయలలిత లేని అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను ఎదుర్కోవడం పాలక అన్నాడీఎంకేకు సవాలేనని చెప్పొచ్చు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఇప్పుడు డీఎంకే పూర్తిగా ఆయన కుమారుడు స్టాలిన్‌ చేతుల్లోకి వచ్చేసింది. జయ లేకుండా జరగబోతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షానికి అనేక అంశాలున్నాయి.

జయలలిత మరణం వెనక కనబడని కారణాలున్నాయని నమ్ముతున్న డీఎంకే ఈ అంశాన్ని సభలో ప్రస్తావించకుండా వదలదు. రాష్ట్రంలో కరువు పరిస్థితి మరో ప్రధానాంశం. ప్రస్తుతం పన్నీరు శెల్వం సర్కారు  ఐకమత్యంతో లేదు. పన్నీరు శెల్వంది ఓ దారైతే, మంత్రులది మరో దారి. పన్నీరును మంత్రులు ముఖ్యమంత్రిగా గుర్తించడంలేదు. వారు ఆయన ఎదురుగానే శశికళ భజన చేస్తున్నారు. ఆమె త్వరగా పగ్గాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గట్టిగా ఢీకొనగలదా అనే అనుమానం కలుగుతోంది. 

ఇదిలా ఉండగా, ప్రముఖ జర్నలిస్టు (ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కూడా) ఎస్‌. గురుమూర్తి ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'శశికళను అన్నాడీఎంకే కేడర్‌ అంగీకరించదు' అని చెప్పారు. నాయకులు, మంత్రులు శశికళను కోరుకుంటున్నారుగాని కేడర్‌ ఒప్పుకోవడంలేదన్నారు. శశికళ బలవంతంగా ముఖ్యమంత్రి అయినట్లయితే కొంతకాలం తరువాత పార్టీ చీలిపోవచ్చని గురుమూర్తి అంచనా వేస్తున్నారు. పార్టీ చీలిపోవడం ఇప్పటికిప్పుడు జరగదని, కాని కాలక్రమంలో బీటలు వారుతుందన్నారు. తన దృష్టిలో ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేనట్లేనన్నారు. ఎందుకంటే పన్నీరు శెల్వంను ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గ సహచరులే గుర్తించడంలేదు. పన్నీరుకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నట్లుయితే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అభిప్రాయపడ్డారు.  

ఈ నెల 18న ఆమె ముఖ్యమంత్రి కాలేకపోతే రిపబ్లిక్‌ డే (జనవరి 26) నాటికి ముఖ్యమంత్రి  అవుతుందని ఆశాజీవులైన నాయకులు చెబుతున్నారు. పన్నీరు శెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగడమో, శశికళ సీఎం పీఠం ఎక్కడమో త్వరలోనే తేలిపోతుండొచ్చు.