విమానం మాయమైంది.. ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వింటోన్న మాటలివి. అయితే, ఎక్కడా ఏ ప్రమాదంలోనూ ప్రయాణీకులు బతికి బయటపడ్డ దాఖలాలు కన్పించడంలేదు. అలాగని, ఆశలు వదిలేసుకోవడానికి వీల్లేదు. ఏమో, అద్భుతం జరగొచ్చేమో.. అని బాధిత కుటుంబాలు ఎదురుచూడడాన్ని ఎలా తప్పు పట్టగలం.? వారి ఆవేదన అలాంటిది. కానీ, విమాన ప్రమాదాల్లో ఆ అద్భుతం అనేది చాలా చాలా అరుదు.
చెన్నయ్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కి వెళుతూ నిన్న ఓ సైనిక విమానం గల్లంతయ్యింది. గల్లంతయ్యిందన్న విషయం తెలుసుకున్న వెంటనే యుద్ధ ప్రాతిపదికన 'సెర్చ్ ఆపరేషన్' ప్రారంభమయ్యింది. కనీ వినీ ఎరుగని రీతిలో యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. సబ్‌మెరైన్‌తో వెతుకులాట మొదలు పెట్టారు. సైనిక విమానాలు, హెలికాప్టర్లు.. ఇలా సెర్చ్ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా జరుగుతోంది.
ఈ మధ్యనే కోస్ట్‌గార్డ్ విమానమొకటి మాయమైంది. దురదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఈసారి మాత్రం మిస్సయిన సైనిక విమానంలో ఎక్కువమందే వున్నారు. మొత్తం 29 మంది ఆ విమానంలో పయనిస్తున్నారు.. సిబ్బందితో సహా. విమానం గాల్లోనే ప్రయాణిస్తుందిగానీ, అలాగని అది గాల్లో దీపం లాంటి వ్యవహారం కాదు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విమానాల్ని పైలట్లు నడుపుతుంటారు. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా హఠాత్తుగా తలెత్తే సాంకేతిక సమస్యలతోనే విమానాలు కూలిపోతుంటాయి.
ఇక్కడ ఏం జరిగిందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. కుప్పకూలిన హెలికాప్టర్ని కనుగొనడానికే చాలా సమయం పట్టింది. అప్పుడూ యుద్ధ విమానాల్ని రంగంలోకి దించారు. అది భూమ్మీదే కూలిపోయినా, సెర్చ్ ఆపరేషన్ అంత తేలిగ్గా ఏమీ పూర్తవలేదు. విమాన ప్రమాదాలకు సంబంధించి ఇదే అతి పెద్ద సమస్య.
పౌర విమానాలకీ, సైనిక విమానాలకీ చాలా తేడాలుంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణించేలా సైనిక విమానాల్ని రూపొందిస్తుంటారు. తుపాన్లను సైతం తట్టుకునే శక్తి ప్రస్తుతం మాయమైన సైనిక విమానానికి వుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, విమానం చాలా పాతది. ఆ మాటకొస్తే, రక్షణ రంగంలో ఉపయోగించే విమానాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు వంటివి పాతవే అయినా, ఎప్పటికప్పుడు వాటిని రీఫిట్ చేయడం, అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుంటుంది.
పేరుకే పాతది, కానీ టెక్నాలజీ పరంగా, ధృఢత్వం పరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయడమే రీఫిట్ ఉద్దేశ్యం. అలాంటప్పుడు, మిస్సయిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం అన్న ప్రస్తావనే లేదన్న వాదనా విన్పిస్తోంది. ఎలా చూసినా, సైనిక విమానం మిస్సవడం అనేది ప్రస్తుతానికి మిస్టరీనే.
ఓ పక్క అధికారులేమో, మిస్సయిన విమానంలోని వారి కుటుంబాలను ఓదార్చుతూ, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోపక్క, విమానం కూలిపోయిందన్న వదంతులతో మీడియా వారిలో టెన్షన్‌ని పెంచేస్తోంది. ఏదన్నా జరిగిపోయి వుంటే, ఆ విషయం బయటకు రావాల్సిందే. కానీ, ఈలోగా బిక్కుబిక్కుమంటున్న సైనిక కుటుంబాల్ని ఆవేదనకు గురిచేయడం ఎంతవరకు సబబు.?
ఇలాంటి సందర్భాల్లో అద్భుతమే జరగాలి.. దేశం కోసం పనిచేస్తున్న రక్షణ సిబ్బంది.. క్షేమంగా తిరిగి రావాలని.. వందకోట్ల మంది భారతీయులు చేస్తున్న ప్రార్థనలు ఫలించాలని ఆశిద్దాం.