మిత్రులంటే ఎవరు? టీడీపీ-బీజేపీ. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో. అక్కడ 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గెలవాలంటే, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే పెద్ద అడ్డంకి వెస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. వచ్చే ఎన్నికలనాటికి కూడా ఆయన బయటనే ఉంటే అంటే బెయిల్ మీదనే ఉంటే గెలుపు అసాధ్యం కావొచ్చు లేదా ఏటికి ఎదురీదాల్సిరావొచ్చు. జగన్ బయటనే ఉంటే టీడీపీకే కాదు, బీజేపీకి కూడా వచ్చే ఎన్నికల్లో గడ్డు కాలమే. కాబట్టి ఎన్నికల్లోగా ఆయన్ని జైల్లో కూర్చోబెట్టాలి. ఆయన్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలి. ఆయన్ని పెద్ద పాపాత్ముడిగా చిత్రిస్తే తప్ప టీడీపీ, బీజేపీ కూటమి గెలుపు సాధ్యం కాదు. ఇదంతా మనం చెబుతున్నది కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇంకా స్పష్టంగా చెప్పాంటే ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పుకున్న గోడు. జగన్ అక్రమాస్తుల కేసు గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు.
కేసు విచారణ సమయంలోనే పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీకీ, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకు గట్టి పోటీ ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం కలిగించినా ఆ అదృష్టం కొద్దిలో తప్పిపోయింది. అయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా పక్కలో బల్లెంలా మారడంతో చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే నిద్రపట్టడంలేదు. పోలిక సరైందో కాదో తెలియదుగాని హిరణ్యకశ్యపుడు శత్రుభావంతోనైనా నిరంతరం విష్ణువు నామస్మరణ చేసినట్లుగా చంద్రబాబు నిరంతరం జగన్ స్మరణే చేస్తున్నారు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఎన్ని బాధలు పెట్టినా తట్టుకొని విష్ణువునే కొలిచినట్లుగా జగన్‌ను బాబు ఎన్ని బాధలు పెట్టిన అడుగడుగునా ఢీకొంటూనే ఉన్నారు. ఆయన చేస్తున్న తప్పిదాలను ఎండగడుతూనే ఉన్నారు. జనంలోకి చొచ్చుకుపోతూనే ఉన్నారు.
గెలిచిన 67 మంది వైకాపా ఎమ్మెల్యేల్లో 21 మందిని లాగేశారు. పలువురు ఎంపీలను గుంజుకున్నారు. జగన్ మీడియాను కనబడకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు జగన్ నిర్వహించే సదస్సులకు, సభలకు వెళ్లే విద్యార్థులపై కేసులు పెడతామని కూడా బాబు బెదిరించారు. బాబు ఇంతగా దిగజారినా జగన్ ఆగకపోయేసరికి ఏం చేయాలో అర్థంకాని చంద్రబాబు అతన్ని జైలుకు పంపే చర్యలు తీసుకోవాలని నేరుగా కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఆ పని చేయకపోతే ఓటమి ఖాయమని కూడా భయపెట్టారట…! దాని ఫలితంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈ నెల (జనవరి) 20 నుంచి 23 వరకు జగన్‌ని మనీలాండరింగ్ విషయమై ప్రశ్నించేందుకు సిద్ధమైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఇక జైలుకు పోవడం ఖాయమని టీడీపీ నాయకులు భావించారు. కాని అందుకు విరుద్ధంగా ఆయన కేసు విచారణ పలు కారణాలతో మందగించింది. దీన్ని జగన్ బాగా ఉపయోగించుకున్నారు. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నా నీరసపడకుండా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల మైండ్‌సెట్ మార్చే ప్రయత్నాలు చేశారు.
ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో అవినీతిని, అవకతవకలను జనం దృష్టికి తేవడంలో తమ మీడియా ద్వారా జగన్ చేసిన కృషి తక్కువది కాదు. దీంతో చంద్రబాబు అసహనం పెరిగిపోతోంది. వైకాపా అభివృద్ధికి అడ్డుగా ఉందని, దానికి రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదని ప్రచారం చేస్తున్నారు. చివరకు సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేను కూడా మట్లాడనివ్వకుండా తన ద్వేషాన్ని బహిరంగంగానే చాటుకున్నారు బాబు. జగన్ కథను త్వరగా ముగించాలంటూ కేంద్రంలోని టీడీపీ మంత్రుల ద్వారా బాబు ఒత్తిడి పెంచారు.
వైకాపా డీమానిటైజేషన్‌ను వ్యతిరేకించడం, ప్రత్యేక హోదాపై పట్టుబట్టడం, ప్రత్యేక ఆర్థిక సాయాన్ని నిరసించడం…ఇదంతా కేంద్రానికి చిరాకుగానే ఉంది. జగన్ సంగతేంటో చూస్తే మంచిదని బీజేపీ నాయకులు కూడా కేంద్ర నాయకత్వానికి చెప్పారట. ఇడి విచారణ తరువాత జగన్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. కేంద్రం ఏపీకి అన్యాయం చేసినా తాను సర్దుకుపోయాడు కాబట్టి జగన్ విషయంలో తన లాబీయింగ్ పనిచేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారేమో…! జగన్ జైలుకు వెళితే మాత్రమే టీడీపీ గెలుస్తుందని భావిస్తున్నారంటే ఆయన బలమైన నాయకుడని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లే కదా….!