పరీక్షలంటే పాలకులకి మరీ ఎటకారం అయిపోయింది. విద్యార్థులే కదా, ఒకసారి రాస్తారు.. రెండోసారి రాస్తారు.. మూడోసారీ రాస్తారు.. తప్పదు, అవసరమైతే నాలుగోసారి కూడా రాయాల్సి వస్తుంది. 'పెద్ద మనసుతో అర్థం చేసుకోండి..' అన్న మాట అనేస్తే సరిపోతుందా.? ఎంసెట్ లీకేజీ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎంసెట్ పరీక్షను నిర్వహించాల్సి వుంటుంది. కానీ, అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించింది తెలంగాణ సర్కార్.
పరీక్ష రాయడానికి ఒక్క నిమిషం ఆలస్యమైనాసరే, పరీక్షా కేంద్రంలోకి అనుమతిచేది లేదంటూ.. కఠినమైన నిబంధనల్ని రూపొందించి, అమలు చేయడం వరకూ ఓకే. కానీ, లీకేజీ కారకులైనవారి మాటేమిటి.? 'ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు..' అనేసి, ఢిల్లీ కేంద్రంగా, అదేదో రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ ఒకటి ఈ కుట్రకు పాల్పడిందంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతులు దులిపేసుకున్నారు.
నేటి విద్యార్థులే రేపటి అందమైన సమాజానికి దిశా నిర్దేశకులు. ఇది కేవలం మాటలకే పరిమితం. ఆ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటడటమే పాలకుల పని అన్నట్లుంది వ్యవహారం. 'నీట్ తప్పనిసరి' అన్న వాదన ఎప్పటినుంచో విన్పిస్తోంది. అయినా, ఎంసెట్‌ని నిర్వహించేశారు. ఒకసారి, రెండోసారి.. విద్యార్థులకి ఎంసెట్ అంటేనే విరక్తి వచ్చేలా చేసేశారన్నది నిర్వివాదాంశం. నీట్ తప్పనిసరి అని తేలిన వెంటనే, ఎంసెట్ లేదని తేల్చేస్తే అసలు ఈ సమస్యే వుండేది కాదు.! ఇది మెడిసిన్‌కి సంబంధించిన సమస్య. అదృష్టవశాత్తూ ఇంజనీరింగ్ విషయంలో పెద్దగా వివాదాల్లేవు.
తాజాగా ప్రభుత్వం ప్రకటించినదాన్నిబట్టి సెప్టెంబర్ 11న ఎంసెట్-3 నిర్వహిస్తారు. బాగానే వుంది, ఈసారి కూడా పేపర్ లీక్ అవదన్న గ్యారంటీ ఏమన్నా వుందా.? నో ఛాన్స్. పేపర్ ఎలాగైనా లీకైపోవచ్చు. లీకేజీపై విద్యార్థులు పోరాటం చేయబట్టి ఎంసెట్-2ని ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. లేదంటే, వ్యవహారం కామప్ అయిపోయేదే. అలా తయారయ్యింది మొత్తం విద్యా వ్యవస్థ. ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్యపై అవినీతి ఆరోపణలొచ్చాయంటూ ఆయన్ని పదవిలోంచి తప్పించిన ముఖ్యమంత్రి, వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడిన ఎంసెట్ లీకేజీ విషయంలో సంబంధిత శాఖల మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదట.?
ఏదిఏమైనా ఎంసెట్-1, నీట్-1, ఎంసెట్-2, నీట్-2', ఎంసెట్-3.. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో.! వైద్యవిద్యనభ్యసించాలనే తపనకు ఇదేం పరీక్ష.?