జిఎస్‌టి.. అంటే వస్తు సేవల పన్ను. ఎప్పటినుంచో దీని చుట్టూ రాజకీయ 'ఆరాటం' కన్పిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొన్ని వస్తువులపై పన్నులు వుంటుండడం వల్ల, తీవ్ర గందరగోళం చెలరేగుతోందనీ, జిఎస్‌టి అమల్లోకి వస్తే.. కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశముందనీ, ఇది రాష్ట్రాలకీ, కేంద్రానికీ ప్రయోజనం చేకూర్చే బిల్లు అని గతంలో కాంగ్రెస్ చెప్పింది, ఇప్పుడు బీజేపీ చెబుతోంది. అప్పట్లో బీజేపీ వ్యతిరేకించింది, ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లుగా కన్పిస్తోంది. అంతిమంగా అందరూ ఒక్కటే. జీఎస్‌టీ బిల్లుని ఎలాగైనా ఆమోదింపజేసేందుకుగాను బీజేపీ, కాంగ్రెస్ ఒక్కతాటిపైకి వచ్చాయి. అంతేనా, దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు జీఎస్‌టీకి మద్దతిస్తున్నాయి.
సామాన్యుడికి అర్థం కాని విషయమేంటంటే, జీఎస్‌టీ బిల్లుతో అద్భుతాలు జరిగిపోతాయా.? అని. ఒక్కటి మాత్రం నిజం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, రాజకీయాలే పరమావధిగా పనిచేసే పాలకులు వున్నంతకాలం.. అద్భుతాలను ఆశించడం అత్యాశే అవుతుంది. దాన్ని మించి, జీఎస్‌టీ రాకతో, కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఓ వస్తువు ధర జీఎస్‌టీ తగ్గిందనుకుంటే, ఇంకో రూపంలో దాని ధర పెరిగిపోవడం ఖాయం. ఇది మన భారతదేశంలో పొలిటికల్ బిజినెస్ థీమ్.
విపక్షంలో వున్నప్పుడు ఏ పార్టీ అయినా ధరల పెరుగుదల గురించి పోరాటం చేస్తుంటుంది. అధికారంలోకి వచాచక, అదనంగా పన్నులు వడ్డించి, సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఇది అనాదిగా వస్తున్న విషయమే. సో, జీఎస్‌టీతో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించడం కన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు. మరెందుకు జీఎస్‌టీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ దాదాపుగా ఒక్కతాటిపైకి వచ్చాయి.? ఇదే ఇప్పుడు సామాన్యుడికి అర్థం కాని విషయం.
తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాత్రం జీఎస్‌టీని దొడ్డిదారి దోపిడీ.. అని అభివర్ణిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి మరీ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు జీఎస్‌టీ బిల్లుకి మద్దతిస్తుండడం గమనార్హం. ప్రస్తుతానికి కత్తికి తేనె పూస్తున్నారు.. అ కత్తిని కడుపులో దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జీఎస్‌టీ బిల్లుకి ఇంత మద్దతు లభిస్తున్న దరిమిలా, ఆమోదం పొందడం పెద్ద విషయమేమీ కాదు. గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అంతే.