మూడో ప్రపంచ యుద్ధమిది.!

ఓ వైరస్‌ ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ వైరస్‌, మనిషి ఆరోగ్యానికి డైరెక్ట్‌గా తెచ్చే ముప్పు ఏమీ లేదు. కానీ, మనిషిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అంతకన్నా ముందు, వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తుంది. మొన్నీమధ్యనే, 'మూడో ప్రపంచ…

ఓ వైరస్‌ ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ వైరస్‌, మనిషి ఆరోగ్యానికి డైరెక్ట్‌గా తెచ్చే ముప్పు ఏమీ లేదు. కానీ, మనిషిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అంతకన్నా ముందు, వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తుంది. మొన్నీమధ్యనే, 'మూడో ప్రపంచ యుద్ధం రేపే మొదలవుతోంది..' అంటూ ఓ వార్త వెలుగు చూసింది. అది జోస్యమే కావొచ్చుగాక. కానీ, యుద్ధమైతే ప్రకటితమయ్యింది. జరుగుతోంది కూడా. అయితే, ఇక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు.. దండయాత్ర. 

ఒకప్పుడు యుద్ధాలంటే కత్తులతో తలపడేవారు. ఆ తర్వాత తుపాకీల మోత మోగింది. అణు బాంబుల్ని ప్రపంచంలో చాలా దేశాలు కలిగి వున్నాయిప్పుడు. మూడో ప్రపంచ యుద్ధమంటూ మొదలైతే, ముగింపు చాలా తేలిక. ఆ ముగింపే వినాశనం. క్షణాల్లో జరిగిపోతుందంతా. అయితే, ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వేరు. ఇది సైబర్‌ యుద్ధం. ఎక్కడ తయారైందో తెలియదు, 'వాన్నా క్రై' అనే బూచి దెబ్బకు ప్రపంచం భయభ్రాంతులకు గురవుతోంది. 

అందరికీ తెల్సిన విషయమే.. మనం కంప్యూటర్‌ యుగంలో వున్నాం. పొద్దున్న లేస్తే కంప్యూటర్‌తోనే పని. కంప్యూటర్‌ అంటే, ఒకప్పటి అర్థం వేరు. ఇప్పటి అర్థం వేరు. స్మార్ట్‌ ఫోనే ఇప్పుడు కంప్యూటర్‌. అదొక్కటేనా, అన్ని విషయాలకూ మనం కంప్యూటర్‌ మీదే ఆధారపడ్తున్నాం. ఇప్పుడు దాడి జరిగింది కూడా ఈ కంప్యూటర్‌ మీదనే. మొన్నటి దెబ్బకి ప్రపంచం షాక్‌కి గురయ్యింది. ఏమో, ఏ క్షణాన మరో దాడి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. 

వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్ళి దాడి జరిపే అణ్వస్త్రాలకంటే చాలా ప్రమాదకరమైనది ఈ కంప్యూటర్‌ వైరస్‌. ఎందుకంటే, అణుబాంబు అయినా, ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళడానికి కొన్ని నిమిషాలు లేదా గంటల సమయం తీసుకోవచ్చు. కంప్యూటర్‌ వైరస్‌ అలా కాదు, క్షణాల్లో వినాశనానికి కారణమవుతుంది. బ్యాంకింగ్‌, టెలికమ్యూనికేషన్‌.. ఇలా ఒకటేమిటి.? ఏ వ్యవస్థా వైరస్‌ దాడి నుంచి తప్పించుకోలేదు. 

ఇప్పుడు పుట్టుకొచ్చిన వైరస్‌కి విరుగుడు కనుగొంటాం సరే.. క్షణాల్లో ఇంకో కొత్త వైరస్‌ వస్తుంది. అప్పుడేం చేయగలం.? సమాధానం లేని ప్రశ్న ఇది. డిజిటల్‌ యుగంలోకి వెళుతున్నామని సంబరపడుతున్నాం బాగానే వుంది.. ఆ డిజిటల్‌ యుగంలో డిజిటల్‌ వైరస్‌ దాడిని తట్టుకోగలిగే శక్తి మనకుందా.? పెరుగుట విరుగుట కొరకేనని పెద్దలు ఊరకే చెప్పలేదు మరి.