మొతెరాలో తెలుగోడి ‘మోత’.!

మొతెరా మైదానంలో తెలుగోడు మోత మోగించాడు. అంబటి తిరుపతి రాయుడు శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు.. టీమిండియాని విజయపథాన నడిపించాడు. పిన్న వయసులోనే క్రికెట్‌లో ప్రతిభ కనబర్చినా.. జాతీయ జట్టులో…

మొతెరా మైదానంలో తెలుగోడు మోత మోగించాడు. అంబటి తిరుపతి రాయుడు శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు.. టీమిండియాని విజయపథాన నడిపించాడు. పిన్న వయసులోనే క్రికెట్‌లో ప్రతిభ కనబర్చినా.. జాతీయ జట్టులో స్థానం కోసం చాన్నాళ్ళు వేచి చూడాల్సి వచ్చింది అంబటి తిరుపతి రాయుడికి. ఎలాగైతేనేం.. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా అంబటి రాయుడు చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తుండడం గొప్ప విషయమే.

ఇక, వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటనను అర్ధాంతరంగా ముగించేయడంతో, బీసీసీఐ హుటాహుటిన శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ని ప్లాన్‌ చేసుకున్న విషయం విదితమే. తొలి మ్యాచ్‌లో లంకపై నెగ్గిన టీమిండియా, రెండో మ్యాచ్‌లోనూ లంకను మట్టికరిపించింది. రెండో మ్యాచ్‌లో అంబటి తిరుపతి రాయుడు చెలరేగిపోయాడు. మూడో బ్యాట్స్‌మన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన అంబటి రాయుడు.. సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు.

118 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు బాదడంతో మోతెరా మైదానం భారత క్రికెట్‌ అభిమానుల సంబరాలతో నిండిపోయింది. ఓపెనర్‌ అజింక్య రహానే ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ 79 పరుగులు సాధించి ఔట్‌ కాగా, కోహ్లీ (49) తృటిలో హాఫ్‌ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇదిలా వుంటే, సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అంబటి తిరుపతి రాయుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.