జీఎస్‌ఎల్‌వీ – జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించినంతవరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆయుధం'. అంతరిక్షంలోకి అత్యంత సులువుగా అతి బరువైన ఉపగ్రహాల్ని తరలించడానికోసం 'జీఎస్‌ఎల్‌వీ'పై ఎన్నో ఆశలు పెట్టుకుని శాస్త్రవేత్తలు అనుక్షణం పరితపించారు.. కష్టపడ్డారు.. కొన్ని వైఫల్యాలు, కొన్ని పాక్షిక విజయాలు, మరికొన్ని విజయాలు.. అయినా, ఏదో వెలితి. ఆ వెలితి నుంచి గట్టెక్కించడానికొచ్చేశాడు 'నాటీబాయ్'.
జీఎస్‌ఎల్‌వీని ఇస్రో శాస్త్రవేత్తలు 'నాటీ బాయ్'గానే అభివర్ణిస్తారు. ఆ వెహికిల్ మీద వారికున్న అనురాగం, ఆప్యాయత, నమ్మకం అలాంటివి మరి. ఈసారి 'నాటీబాయ్' ఎలాంటి అనుమానాలకు తావివ్వలేదు. 'ఇస్రో బాహుబలి'గా అంతా 'జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 డి1' రాకెట్‌ని అభివర్ణించారు. 'ఇస్రో బాహుబలి' సగటు భారతీయుడి ఛాతీ ఓ పదంగుళాలు పెరిగేంతలా అద్భుత విజయాన్ని అందుకుంది.. ప్రతి భారతీయుడూ గర్వంతో ఉప్పొంగిపోతున్నాడిప్పుడు.
3 వేల కిలోల బరువైన జీశాట్-19 శాటిలైట్‌ని జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 డి1 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. 18 ఏళ్ళ కష్టం.. ఈ రోజు సత్ఫలితాన్నిచ్చిందంటూ ఇస్రో బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోందిప్పుడు. ఈ రాకెట్ విజయంతో ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో అరుదైన ఘనతను సాధించినట్లయ్యింది. ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ఘనతని కీర్తిస్తున్నాయిప్పుడు. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ ద్వారా కమర్షియల్ ప్రయోగాలు చేపడ్తోన్న ఇస్రో, ఇకపై మరింతగా ఆ ప్రయోగాల్ని 'లాభదాయకం'గా చేసేందుకు వీలుంది. వన్స్ ఎగైన్.. సాహోరే ఇస్రో.!
చివరగా: ఇస్రో ఒకప్పుడు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంది. అవమానాలే కాదు, ఆంక్షలూ ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆ ఆంక్షలు విజయాన్ని ఆలస్యం చేశాయేమోగానీ, విజయాన్ని దూరం చెయ్యలేకపోయాయి. మరీ ముఖ్యంగా జీఎస్‌ఎల్‌వీ విషయంలో ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఈ విజయం మనకి అత్యంత అపురూపం. అదే సమయంలో, అవమానించినవారందరికీ ఈ గెలుపు ఓ చెంపదెబ్బ.