‘నిర్భయ’ రేపిస్టులకు త్వరలోనే ఉరి…!

హైదరాబాద్‌ వెటర్నరీ డాక్టర్‌ దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులకు తప్పనిసరిగా మరణ శిక్షే పడుతుందని జనమంతా అంచనా వేస్తున్న దశలోనే, ఢిల్లీ నిర్భయ కేసులో రేపిస్టులకు త్వరలోనే మరణశిక్ష విధించవచ్చనే వార్తలు వస్తున్నాయి.…

హైదరాబాద్‌ వెటర్నరీ డాక్టర్‌ దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులకు తప్పనిసరిగా మరణ శిక్షే పడుతుందని జనమంతా అంచనా వేస్తున్న దశలోనే, ఢిల్లీ నిర్భయ కేసులో రేపిస్టులకు త్వరలోనే మరణశిక్ష విధించవచ్చనే వార్తలు వస్తున్నాయి.

2012 నాటి ఈ కేసులో ఇప్పటిరకు దోషులకు శిక్ష అమలు చేయని సంగతి తెలిసిందే. నడుస్తున్న బస్సులో పారామెడికల్‌ విద్యార్థిని అయిన నిర్భయపై ఐదుగురు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను బస్సులోనుంచి రోడ్డుపైకి నెట్టేయడంతో తీవ్రంగా గాయపడిన నిర్భయ చాలా రోజులు మృత్యువుతో పోరాడి సింగపూర్‌ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

ఈ  కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారించి దోషులకు మరణశిక్ష వేసింది. దీన్ని ఢిల్లీ హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు సమర్థించాయి. కాని ఇప్పటివరకు శిక్ష అమలు కాలేదు. దోషుల్లో ఒకడు మైనర్‌ కావడంతో అతన్ని జువైనల్‌ హోంకు తరలించారు. ఒకడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు పవన్‌గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌, ముఖేష్‌ సింగ్‌కు మరణశిక్ష అమలు చేయాల్సివుంది. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతోంది.

వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తిరస్కరించారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతిని కూడా కోరారు. అలాగే కేంద్ర హోం శాఖ కూడా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సు చేయనుంది. 

సాధారణంగా ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి ప్రభుత్వ సిఫార్సును తిరస్కరించడానికి అవకాశం లేదు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే మరణశిక్ష అమలుకు చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ ఏడాది అక్టోబరు 29న తీహార్‌ జైలు అధికారులు దోషులకు 'మీకు న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోయాయి. మిగిలింది రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడం ఒక్కటే. అది మీరు ఇంతవరకు పెట్టుకోలేదు' అని చెప్పారు. దీంతో దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ పంపాడు. రాష్ట్రపతి దాన్ని తిరస్కరించే అవకాశం ఉంది.  క్షమాభిక్ష పిటిషన్‌ మొదట ఢిల్లీ ప్రభుత్వానికి చేరింది. దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. 

దారుణమైన అకృత్యానికి పాల్పడిన దోషికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. ఆ తరువాత పిటిషన్‌ను కేంద్ర హోం శాఖకు పంపారు. హోం శాఖ దాన్ని రాష్ట్రపతికి పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. హైదరాబాదులో దిశ ఘటన తరువాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పార్లమెంటు దద్దరిల్లిపోయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్షమాభిక్షతో కేసులు సాగదీయొద్దన్నారు.

అత్యాచారం కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దిశ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెలరేగడంతో నిర్భయ దోషులకు త్వరగా శిక్ష  అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

దిశ కేసులో తీర్పు వచ్చేలోగానే నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలు చేసే అవకాశముందని అనుకుంటున్నారు. దిశ ఘటన తరువాత నిర్భయ తల్లి  ఆశాదేవి దిశ తల్లికి పంపిన సందేశంలో  'నా కూతురుకు న్యాయం జరగలేదు. మీ కూతురుకైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంది'…అని పేర్కొన్నారు.

'నా కూతురుకు న్యాయం జరగాలని మేం ఏళ్లతరబడి పోరాడుతూనే ఉన్నాం. అయినా న్యాయం జరగలేదు.అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. దిశ విషయంలో వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ఉంది'…అని ఆశాదేవి పేర్కొన్నారు. త్వరలోనే ఆమె కూతురుకు, కుటుంబానికి న్యాయం జరగబోతోంది.