చేరువైన ఉరి…ఇక ఆఖరి పోరాటం..!

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. వివిధ కారణాల వల్ల ఉరి శిక్ష ఇప్పటివరకు…

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. వివిధ కారణాల వల్ల ఉరి శిక్ష ఇప్పటివరకు ఆగిపోతూ వచ్చింది. కాని ఇప్పుడు కోర్టు డెత్‌ వారెంట్‌ ఇష్యూ చేయడంతో ఇక తప్పదు. మృత్యు దేవత దోషులు వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, ముఖేష్‌ సింగ్‌ ముందుకు వచ్చి నిలుచుంది. మరి కొన్ని రోజుల్లో వారిని కబళించడమే మిగిలింది. ఎంతటి కిరాతకులైనా, క్రూరులకైనా ప్రాణాల మీద తీపి ఉంటుంది కదా. చనిపోతామని ఈ నలుగురికీ తెలుసు. 

చావును తప్పించుకోవడానికి ఇప్పటివరకూ చేయాల్సిన సకల ప్రయత్నాలూ చేశారు. మృత్యువు సమీపంలో ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు వీరికి మరొక్క అవకాశం కల్పించింది. అదే 'క్యూరేటివ్‌ పిటిషన్‌'. దోషులు వేసిన రివ్యూ పిటిషన్లును కోర్టు తోసిపుచ్చింది. ఈరోజు అది జరిగాకే పటియాల హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇది జారీ చేయడంతోపాటు క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు 14 రోజుల సమయం ఇచ్చింది. ఇక ఈ ఎపిసోడ్‌లో ఇదే చివరి అంకం. క్యూరేటివ్‌ పిటిషన్లను కూడా తోసిపుచ్చితే నిర్దేశించిన తేదీన ఉరిశిక్ష అమలు చేస్తారు. 

క్యూరేటివ్‌ పిటిషన్‌ కూడా దాదాపు రివ్యూ పిటిషన్‌వంటిదే.  క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దోషుల తరపు లాయర్‌ చెప్పాడు. డెత్‌ వారెంట్‌ జారీ చేయగానే నిర్భయ తల్లి పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలు చేయడంలేదని ఇంతకాలం ఆవేదన చెందిన ఆమె ఈరోజు మీడియా వద్ద సంతోషాన్ని పంచుకొని న్యాయ వ్యవస్థ మీద తనకు విశ్వాసం పెరిగిందన్నారు. నిర్భయ కేసులో దోషులకు అసలు ఉరిశిక్ష అమలు జరుగుతుందా?  అనే ప్రశ్న చాలామంది వేసుకున్నారు. దోషుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది కదా. ఉరి శిక్ష ఖాయమని కూడా చెప్పింది కదా. ఇంకేంటి అడ్డంకి అనుకున్నారు చాలామంది. 

ఇక ఉరి తీయడమే తరువాయి అనుకున్నారు అనేకమంది. కాని కథ మలుపు తిరిగింది. నలుగురి ఉరితీతకు డెత్‌ వారెంటు జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పటియాల కోర్టును అడిగింది. కాని దీనిపై విచారణ చేయాలంటూ కోర్టు జనవరి 7వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అక్షయ్‌ సింగ్‌కు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందేమో కనుక్కోండని పటియాల కోర్టు జడ్జి తీహార్‌ జైలు అధికారులకు సూచించారు. దీంతో విచారణ జనవరి  7వ తేదీకి వాయిదా పడింది. వినయ్‌ శర్మ  క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోగా రాష్ట్రపతి తిరస్కరించారు. అదైపోగానే ఇక దోషులను ఉరి తీయడమేననుకున్నారు. ఉరితాళ్లు సిద్ధం చేయండని ఆదేశాలిచ్చారు. తలారీ కోసం వెదుకులాడారు.  డిసెంబరు 16నే ఉరితీస్తామన్నారు. 

కాని అక్షయ్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌ వేయడంతో 17న దానిపై విచారణ జరుగుతుందన్నారు. చీఫ్‌ జస్టిస్‌కు ఓ ఇబ్బంది వచ్చి మరో ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఆ ధర్మాసనం డిసెంబరు 18న పిటిషన్‌ తిరస్కరించింది. దాన్ని తిరస్కరించారు కాబట్టి ఉరి తీస్తారనుకుంటే క్షమాభిక్ష  కోరుకుంటాడేమో అడగమంది కోర్టు. అందుకోసం ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. వచ్చే విచారణలోనైనా అంతిమ తీర్పు వస్తుందనే నమ్మకం లేదని నిర్భయ తల్లి రోదించింది. ఈ కేసులో ఉరిశిక్ష తప్పించుకోవడానికి, అదీ కుదరకపోతే దీర్ఘకాలం వాయిదా వేయించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. 

వినయ్‌ శర్మ అయిపోయాడు. అక్షయ్‌సింగ్‌ అయిపోయాడు. పవన్‌ గుప్తా తెర మీదికి వచ్చాడు. 'నేరం జరిగిన 2012 డిసెంబరు 16 నాటికి నేను మైనర్‌ను' అని ఇతని వాదించాడు. అప్పుడు తాను మైనర్‌ని కాబట్టి తనను జువైనల్‌ చట్టం ప్రకారం విచారించాలంటున్నాడు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పిస్తామని ఇతని తరపు లాయరు ఏపీ సింగ్‌ చెప్పాడు. అది కూడా అయిపోయినట్లుంది. దీంతో 22న   ముహూర్తం పెట్టారు.