నిత్యానంద లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అతడి చెర నుంచి బయటకొచ్చిన బాలికలు ఇద్దరు నిత్యానంద అకృత్యాల్ని బయటపెట్టారు. తమ అక్కని అర్థరాత్రి నిద్ర లేపేవారని, ప్రచారం కోసం ఫుల్ గా మేకప్ వేసి అర్థరాత్రిళ్లు వీడియోలు తీసేవారని వాళ్లు ఆరోపించారు.
2013లో గురుకులంలో చేరిన తమకు ప్రారంభంలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించిందని, 2017 నుంచి మాత్రం నిత్యానంద అసలు రూపం కనిపించిందని ఆ చిన్నారులు చెప్పుకొచ్చారు. తమను శారీరకంగా మానసికంగా వేధించారని.. విరాళాల కోసం తమపై రకరకాల వీడియోలు చిత్రీకరించారని వెల్లడించారు. నిత్యానందకు 3 లక్షల నుంచి 8 కోట్ల వరకు విరాళాలు వచ్చేవని, కొంతమంది ఎకరాల కొద్దీ భూములు కూడా విరాళాలు ఇచ్చేవారని వాళ్లు బయటపెట్టారు.
మరోవైపు పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు పారిపోయిన నిత్యానంద, చాలా దేశాలు దాటి చివరికి ఈక్వెడార్ చేరుకున్నట్టు చెబుతున్నారు. ఈక్వెడార్ లో ఆశ్రమం ఏర్పాటుకోసం నిత్యానంద చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారని, ఆయన అక్కడికే వెళ్లారని.. నిత్యానంద మాజీ అనుచరురాలు స్టెఫానీ చెబుతున్నారు.
మరోవైపు నిత్యానంద విషయంలో పోలీసుల వ్యవహారశైలిపై కూడా అనుమానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. 40కి పైగా కేసులున్న వ్యక్తిని దేశం వదిలి వెళ్లేలా చేశారని విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా 2018 సెప్టెంబర్ లోనే నిత్యానంద పాస్ పోర్టు గడువు తీరిపోగా, ఇప్పుడాయన ఎలా దేశం విడిచి వెళ్లారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిత్యానందను తిరిగి ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఇటు పోలీసులు, అటు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించుకున్నారు.