నితిష్ ప్రభుత్వం! బీజేపీ పాలన!!

పాపం! గెలిచాడు, అని గెలిచిన వాడినీ, భేష్! ఓడిపోయాడు, అని ఓడిన వాడినీ అని అనాల్సివస్తే..!? అనాల్సిరావటమేమిటి? అనేస్తేనూ…!? బీహార్ 2020 ఎన్నికలు చూశాక, ఎవరికయినా ఇలా అనాలని అనిపిస్తుంది. Advertisement దురదృష్ట విజేతగా…

పాపం! గెలిచాడు, అని గెలిచిన వాడినీ, భేష్! ఓడిపోయాడు, అని ఓడిన వాడినీ అని అనాల్సివస్తే..!? అనాల్సిరావటమేమిటి? అనేస్తేనూ…!? బీహార్ 2020 ఎన్నికలు చూశాక, ఎవరికయినా ఇలా అనాలని అనిపిస్తుంది.

దురదృష్ట విజేతగా నితిష్ కుమార్, అదృష్ట పరాజితుడిగా తేజస్వి లోకానికి కనిపిస్తున్నారు. అన్నీ సవ్వంగా జరిగి, బీజేపీ మాట మార్చకుండా వుంటే, నీరసంగా నితిష్ ముఖ్యమంత్రి కుర్చీలోనూ, హుషారుగా తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నేత స్థానంలోనూ కూర్చోబోతున్నారు.

వ్రతం చెడ్డాక ఫలితం, అంత రుచిగా వుండదని ఎప్పుడూ ఎవరో ఒకరు చెబుతునే వుంటారు. విరిగిపోయాక పాలు, వాసన చూడ్డానికి పనికి రావు. కాకుంటే చూడ్డానికి మాత్రం పాల రంగులోనే వుంటాయి. ఈ సారి వాస్తవాన్ని చెప్పటానికి నితిష్ కుమార్ సిధ్ధంగా వున్నారు. మరో మారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. 

గతంలో ముమ్మారు ఈ పని చేశారు. కానీ ఈ సారి తీసుకునేది విరిగిన ‘ముఖ్యమంత్రి’ పదవి. చూడ్డానికి మాత్రమే ముఖ్యమంత్రి. డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటారు. కానీ స్టీరింగ్ మీద తన చేతులు వుండవు. బీజేపీవి వుంటాయి. తాను తన మంత్రివర్గాన్ని నడపక పోవచ్చు. తన మంత్రి వర్గమే తనను నడవవచ్చు. ఎందుకిలా? లెక్క తప్పింది.

ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. బీహార్ అసెంబ్లీకి వున్నవి 243 సీట్లు. పోటీలో ప్రధానంగా తలపడ్డవి రెండు సమూహాలు. ఇంచుమించు ముఖాముఖి పోటీయే. ఎన్డీయే ఒక వైపూ, మహాగతబంధన్ ఒక వైపూ. ఎన్డీయే 125 వచ్చేశాయి.

మరీ బొటాబొటి అనలేం కానీ, దాదాపు అంతే. రెండే సీట్లు ఎక్కువ. మహాగతబంధన్ కు 110 సీట్లు వచ్చాయి. మిగిలిన ఎనిమదీ ఇతరుల ఖాతాలో వెయ్యవచ్చు. ఇలా చూస్తే, గెలిచిన ఎన్డీయే సౌకర్యవంతంగానే అనిపిస్తుంది. పొట్ట విచ్చి చూస్తేనే, అసౌకర్యం తెలుస్తుంది. 

ఎన్డీయే లో ప్రధాన పక్షాలు రెండు. ఒకటి బీజీపే, మరొకటి నితిష్ నేతృత్వంలోని జెడి(యు). రెండూ గెలిచిన పక్షాలే. కానీ అలా చూస్తే, సంకీర్ణ మంత్రజాలం అర్థం కాదు. గెలిచిన పక్షాల్లో ఒక్కటి ఎక్కువ గెలిచిన పక్షం, ఇంకొకటి తక్కువ గెలిచిన పక్షం. బీజేపీకి 74 సీట్లు వస్తే, జెడి(యు)కి 43 సీట్లే వచ్చాయి. అధికారం పంచుకోవాల్సి వస్తే, బీజేపీ సీనియర్ పార్టనర్; జెడి(యు) జూనియర్ పార్టనర్. ఈ స్థితి పార్టీ నేతగా నితిష్ కు ఎప్పుడూ రాలేదు. 

గతంలో ఎవరితో రాష్ర్టంలో జతకట్టి సర్కారు నడిపినే తనదే పై చెయ్యిగా వుండేది. అందుకే తాను గెలచి వోడినట్లయ్యింది. గత ఎన్నికల్లో ఈ రెండు పక్షాలు వైరి పక్షాలు. అయినా అప్పటి సీట్లను పరిగణించాల్సి వస్తే, బీజేపీకి 52 వస్తే, ఒక్క జెడి(యు)కే 71 సీట్లు వచ్చాయి. ఇప్పుడు రెండు మిత్రపక్షాలయ్యాక, వీరి స్థితి వారికొచ్చింది,

ఇది వ్యూహరచనే. ఖచ్చితంగా బీజేపీ వ్యూహరచనే. అవును. వ్యూహం ఇలా కూడా వుంటుంది. పొత్తుల రాజకీయాల్లో గెలుపు కోసం మాత్రమే కాదు, ‘గెలుపులోగెలుపు’ కోసం ప్రయత్నించాలి. ఆ పనిని బీజేపీ చేసింది. అయితే ఇది మిత్ర ధర్మానికి విరుధ్ధం కదా! కావచ్చు. అది వేరే విషయం. మొత్తం గా ఎన్డీయే గెలవాలి; బీజేపీ సీనియర్ పార్టనర్ గా వుండాలి. 

ఇది బీజేపీ వ్యూహకర్తల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎక్కడా విస్మరించాలి. సీట్ల సర్దుబాటులో ఏ సీట్లు తీసుకోవాలి? ఎన్నికల ప్రచారంలో ఎవరిని ముందు పెట్టాలి? ఎన్డీయే వెలుపల పరోక్షంగా ఎవరికి ఊతమివ్వాలి? ఇలా అన్ని చోట్లా బీజేపీ జాగ్రత్త వహించింది. 

ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. రెండు సభల్లో నితిష్‌తో వేదికను పంచుకున్నారు. కానీ మోడీ నితిష్ ను బలపరచినట్లుగా లేదు, నితిషే మోడీని అవధులకు మించి కీర్తించారు. ‘యుగపురుషుడు’ మోడీని చూసి ఎన్డీయేకు వోటెయ్యండని చిరతలు పట్టుకున్నారు. కేంద్ర మంత్రులు ప్రచారానికి వచ్చారు కానీ, ఎవ్వరూ నితిష్ తో వేదికను పంచుకోలేదు. 

అలాగే ప్రచారం తొలిదశలో,  బీజేపీ విడుదల చేసిన పోస్టర్లలో మోడీ, నితిష్ ల ఫోటోలు కనిపించాయి కానీ, తర్వాత, తర్వాత నితిష్ బొమ్మ మాయమయ్యింది. నితిష్ జెడి(యు)కి పారంపర్యంగా వస్తున్న వోటు బ్యాంకులో తన సొంత కులస్తులయిన కురుమలూ,  అలాగే యాదవేతర ఓబీసీలూ, ముస్లిం మైనారిటీలూ వుంటారు. 

మోడీ మొదలు, బీజేపీ జాతీయ నేతలందరూ ‘హిందూత్వ ఎజెండా’నే ప్రధానంగా మాట్లాడారు. జమ్ము కాశ్మీరులో స్వయంప్రతిపత్తిని తొలగించటాన్నీ, ట్రిపుల్ తలాక్ రద్దునూ, నూతన పౌరసత్వ చట్టాన్నీ,  ప్రస్తావించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అయితే, ఇంకో అడుగు ముందుకు వెళ్ళి, ఎవరిదగ్గరయితే తగిన పత్రాలుండవో, వారిని దేశం నుంచి తరిమేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు. 

అందుకు నితిష్ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, సీట్ల పంపిణీలో బీజేపీ పోటీ చేసిన వోట్లు పెంచుకోగలిగింది, కానీ జెడి(యు) పోటీ చేసిన ముస్లింల మద్దతు కోల్పోవాల్సి వచ్చింది.

ఇదంతా ఒక యెత్తు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్.జె.పి) ప్రమేయం ఒక యెత్తు. రామ్ విలాస్ విశ్వాన్ తర్వాత ఈ పార్టీ నాయకత్వ బాధ్యతను ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ తలెకత్తుకున్నారు. స్వతంత్రంగా వ్యవహరించే పేరు మీద, బీజేపీ తలపెట్టిన ‘గెలుపులో గెలుపు’ నకు పరోక్షంగా సహాయ పడ్డారు. మొత్తం 110 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టారు. కానీ గెలుచుకున్నది ఒక్క సీటే. కాకుంటే 5.7శాతం వోట్లను సాధించారు.  

ఈ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ స్థానాల్లో అత్యధిక భాగం, జెడి(యూ) పోటీ చేస్తున్న స్థానాలే. నితిష్ కడిగేసినట్లే, చిరాగ్ కూడా తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీని కూడా కడిగేశాడు. దాంతో, నితిష్ కు పడే వోట్లు చీలాయి. ఇది జెడి(యు) కి శావమూ, బీజేపీకి వరమూ అయ్యాయి. బీజేపీ ‘గెలుపులో గెలుపు’ వ్యూహానికి చిరాగ్ ఆలా తోడ్పడ్డారు.

ఇది ఇలావుంటే, తేజస్వి యాదవ్ కు కూడా ‘మిత్రనష్టం’  కొంత జరిగింది. అది కాంగ్రెస్ వల్ల. కాంగ్రెస్ అత్యాశలకు పోయి. ఏకంగా 70 సీట్లుకావాలని పట్టుబట్టి పోటీ చేసింది. 19 సీట్లే గెలిచింది. తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీకి మరికొన్ని సీట్లు మిగిల్చి వుంటే, క్రీడ వేరే లాగుండేది. ఇప్పటికే ఆర్జేడీ వున్నవాటిలో అతిపెద్ద ఏకైక పక్షం. 75 సీట్లు గెలుచుకున్నది.

ఇవన్నీ కాక నితిష్ గత ఎన్నికలలో ‘బీజేపీ లేని భారతాన్ని’ నిర్మిద్దామని, తర్వాత బీజేపీతో కలసి పోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా అది మూణ్ణాళ్ళ ముచ్చటే కావచ్చు. బీజేపీ ఆయన పక్షాన్ని మరింత చిన్న బుచ్చ వచ్చు. లేదా, ముందుగానే బీజేపీకి తాను ‘రాం రాం’ చెప్పవచ్చు. అతిబలమైన ప్రతిపక్షంగా వున్న తేజస్వి యాదవ్ లోని మహాగత బంధన్ అవకాశం కోసం చూడనూ వచ్చు.

సతీష్ చందర్