ఏపీలో రాజ్యాంగం విఫలం అయిందా! ఎలా?

ఏపీలో హైకోర్టుకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. గౌరవ న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం వైపు కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. వాటిని…

ఏపీలో హైకోర్టుకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. గౌరవ న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం వైపు కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. వాటిని గౌరవ న్యాయమూర్తులు సరి చేయడానికి ప్రయత్నించడం తప్పుకాదు. 

ఎక్కడైనా పోలీసులు అతిగా వ్యవహరించినట్లు అనిపిస్తే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే, అడ్డుకునే హక్కు కూడా హైకోర్టుకు ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఒక కేసుకు, ఇంకో కేసుకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యలు చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

తాజాగా మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఒక హెబియస్ కార్పస్ పిటిషన్‌కు సంబంధించిన విచారణలో గౌరవ జడ్జీలు శాసనమండలి రద్దు, ఎన్నికల కమిషనర్  వివాదం, హైకోర్టు టార్గెట్ అయిందా? అంటూ మాట్లాడడమే కాకుండా, ఏపీలో రాజ్యాంగం విఫలం అయిందా? అని ప్రశ్నించి, అలా విఫలం అయిందనడానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని పిటిషనర్‌లను హైకోర్టు వారు కోరడం ఆసక్తి కలిగిస్తుంది. కాని అదే సమయంలో అసలు కేసు ఏమిటి? హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమిటి అన్న ప్రశ్నలు సామాన్యుడికి వస్తాయి.

బహుశా రాష్ర్ట ప్రభుత్వం కొందరు న్యాయమూర్తులపై సుప్రీింకోర్టు ఛీప్ జస్టిస్‌కు పిర్యాదు చేసిన విషయాన్ని దష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేశారేమో అన్న భావన కలుగుతుంది. మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని శాసనమండలిని రద్దు చేశారు అని న్యాయస్థానం వ్యాఖ్యానించవచ్చా? అసెంబ్లీ స్పష్టంగా కౌన్సిల్‌ను రద్దు చేయాలని తీర్మానం చేయడం ప్రభుత్వ హక్కు. 

గతంలో కూడా అలా తీర్మానాలు చేయడం, తదనుగుణంగా రద్దు చేయడం వంటి ఘట్టాలు జరిగాయి. కాని అప్పుడు జరగని రాజ్యంగ విచ్ఛిన్నం ప్రస్తుత ప్రభుత్వం  తీర్మానం చేస్తే మాత్రం అవుతుందా? ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిని అంతిమంగా ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఇందులో తనకు ఉన్న హక్కులను ప్రభుత్వం వాడుకుంది. 

అదే సమయంలో ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్నది, కొరదరు రాజకీయ నేతలతో ఆయన సంబంధాలు కలిగి ఉన్నారన్న విషయాలు వీడియో పుటేజితో సహా బయటకు వచ్చాయి. అసలు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇష్టారీతిన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని న్యాయస్థానం వారు భావిస్తే ఎవరు ఏమి చేయగలరు?

మూడో టార్గెట్ హైకోర్టు అని న్యాయమూర్తులు అన్నారు. నిజానికి ఆయా కేసులలో ప్రభుత్వంపై ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు వారా, లేక హైకోర్టుపై ప్రభుత్వ నేతలు ఏవైనా వ్యాఖ్యలు చేశారా? ఒకసారి యుద్ధం అని, హైకోర్టును మూసివేయాలా? అని, మరో సారి ఫోన్ టాపింగ్ అని, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది హైకోర్టు వారే అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది.

న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం లేదు. వారు తమకు అందుబాటులో ఉన్న కారణాలతో వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. దానికి ప్రభుత్వం తరపున సలహాదారు సజ్జల రమాకష్ణారెడ్డి చాలా స్పష్టంగా హైకోర్టు వారు ఏ వ్యాఖ్యలు చేసినా తీర్పులలో చేస్తే బాగుంటుందని, విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేస్తే కొన్ని పత్రికలు వాటినే ప్రచారం చేసి ప్రతిపక్షపార్టీకి ఉపయోగపడేలా, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా చేస్తున్నాయని ఆయన అన్నారు.

పలుకేసుల తీర్పులలో వైరుద్యాలు ఏర్పడుతున్న సందర్భాలు కూడా అనేకసార్లు చర్చించుకోవడం జరిగింది. ఒక లాయర్‌ను అక్రమంగా నిర్భందించారన్న అభియోగం కేసుకు, శాసనమండలి రద్దుకు ఏమి సంబంధం? పోలీసులు తప్పుగా వ్యవహరిస్తే వారిపై చర్య తీసుకోవచ్చు. కాని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చిన వివరణ సంతప్తికరంగా లేకపోతే తదనుగుణంగా తీర్పు ఇవ్వవచ్చు. 

సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై ప్రభుత్వం పెట్టిన కేసులపై సంతప్తి చెందకపోతే ఏ విధంగా కేసులుపెట్టాలో హైకోర్టు ప్రభుత్వానికి సూచించవచ్చు. తప్పలేదు. కాని ఏకంగా రాజ్యాంగం విఫలం అయిందని అనడం ధర్మమేనా అన్న ప్రశ్న వస్తుంది.

గతంలో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో ఇరవైమంది తమిళకూలీలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై ఎన్‌కౌంటర్ అయినప్పుడు అప్పటి న్యాయ వ్యవస్థ మానవ హక్కుల గురించి ఆలోచించలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది ఆనాటి ప్రభుత్వ నేతల ప్రచార యావకు తొక్కిసలాటకు గురై మరణించితే, ఒక్కరిపై కూడా కేసుకాని, చర్య కాని లేకపోతే రాజ్యాంగ విఫలం అయిందని ఏ న్యాయ వ్యవస్థ తప్పు పట్టలేదు. 

ఇసుక మాఫియా విజంభించినా, బెల్టు షాపులు విచ్చలవిడిగా నడిచినా, లక్ష కోట్ల రూపాయల రైతు రుణాలను, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.

నంద్యాల ఉప ఎన్నికలో కోట్లాది రూపాయలను ఆనాటి అధికార పక్షం ఖర్చు చేసినా రాజ్యాంగం విఫలం అయిందని ఎవరూ ఎందుకు అనలేదో తెలియదు. అది చంద్రబాబు గొప్పతనం అనుకోవాలా? లేక ఆనాటి న్యాయ వ్యవస్థ వైఫల్యం  అనుకోవాలా? అప్పుడు అంత పెద్ద ఘటనలు జరిగినా రాజ్యాంగం విఫలం అయిందని ఎవరూ అనలేదు. కాని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమి చేసిందని రాజ్యాంగం విఫలం అయిందన అంటున్నారో అర్థం కాదు.

రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు ఏమైనా పెద్దఎత్తున జరుగుతున్నాయా? లేక ప్రభుత్వంపై  అవినీతి ఆరోపణలు వచ్చాయా? లేక ప్రభుత్వం తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా? అమ్మ ఒడి మొదలు, వాహన మిత్ర, కాపు నేస్త, చేయూత వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసిందని ఎలా భావిస్తారో తెలియదు.

కరోనా సందర్భంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగలేదా? నిజమే.. ఎక్కడో చోట పోలీసులు ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉండవచ్చు. అంత మాత్రాన దానిని మొత్తం ప్రభుత్వానికి అంటగట్టి రాజ్యాంగం విచ్ఛినం అంతటి పెద్ద పదాలను గౌరవ న్యాయస్థానం వారు వాడడం సమంజసమేనా? ప్రభుత్వం తన తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పడం మంచిదే. 

కాని అదే సమయంలో హైకోర్టు వారు కూడా ధర్మబద్ద్ధ కాని  వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందన్న సంగతిని కూడా గుర్తించడం అవసరం కాదా? న్యాయమూర్తులను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూనే ఈ విశ్లేషణ చేస్తున్న సంగతిని గమనించాలని కోరుకుందాం.

కొమ్మినేని శ్రీనివాసరావు