ఓ చిన్నారి కన్నీటి గాధ

విజయవాడ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంతర్భాగం. ఆ విజయవాడ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అద్భుతమైన ప్రగతితో మాత్రం కాదు.. అవమానకర రీతిలో తెరపైకొస్తున్న వరుస దారుణాలతో.! చాలావరకు వీటిల్లో అధికార పార్టీకి చెందిన…

విజయవాడ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంతర్భాగం. ఆ విజయవాడ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అద్భుతమైన ప్రగతితో మాత్రం కాదు.. అవమానకర రీతిలో తెరపైకొస్తున్న వరుస దారుణాలతో.! చాలావరకు వీటిల్లో అధికార పార్టీకి చెందిన నేతల అరాచకాలే ఎక్కువ కావడం గమనార్హం. 

మొన్నామధ్య కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూసింది ఇదే విజయవాడలో. ఆ వ్యవహారంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సాక్షిగా 'కాల్‌ మనీ సీఎం..' అంటూ ప్రతిపక్షం ఆందోళనలు చేయడం, ఈ క్రమంలోనే ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే రోజాపై 'వేటు' వేయడం తెల్సిన విషయాలే. మహిళల జీవితాల్ని ఛిద్రం చేసిన ఘటన అది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలే ఈ 'రాకెట్‌'లో వున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అనూహ్యంగా, ఈ కేసు మూలన పడింది.

ఇక, తాజాగా ఓ చిన్నారి మరణ వేదన విజయవాడ పేరుని, దేశవ్యాప్తంగా మార్మోగేలా చేస్తోంది. ఆమె పేరు సాయిశ్రీ. 'నాన్నా నన్ను బతికించు.. నా పేరు మీద వున్న ఇంటిని అమ్మి, నాకు వైద్యం చేయించు..' అంటూ తండ్రికి మొరపెట్టుకుందా బాలిక. దురదృష్టవశాత్తూ చిన్నారి సాయిశ్రీ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె, తన తండ్రికి చేసిన వాట్సాప్‌ కాల్‌ ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసింది.

సాయిశ్రీ పేరు మీద వున్న ఇంటిని అమ్మాలని ఆమె తల్లి భావించినా, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు అడ్డుకున్నారనీ, పోలీసుల్ని ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ కేసుతో తనకేమీ సంబంధం లేదన్నది బొండా ఉమ వాదన. అయితే, సాయిశ్రీ అంతిమ యాత్ర సందర్భంగానూ, బొండా ఉమ ఇంటి వద్ద కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఈ వ్యవహారమిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో, అధికార పార్టీలో గుబులు బయల్దేరింది. అధికార పార్టీ మీద సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తేనే, అరెస్టుల పర్వం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓ చిన్నారి మరణ వాంగ్మూలానికి విలువ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి, ఈ తరహా వివాదాలు అధికార పార్టీకీ, అందునా ఎమ్మెల్యే బొండా ఉమకీ కొత్తేమీ కాదు. మొన్నీమధ్యనే, రవాణాశాఖ కమిషనర్‌పై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుని ముఖ్యమంత్రి మందలించి, ఆ వివాదాన్ని సెటిల్‌ చేసేసిన విషయం విదితమే. 'మనోడు నేరం చేసినా అది తప్పు కాదు.. పగోడు తప్పు చేయకపోయినా నేరం చేసినట్లే లెక్క..' ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ అమలు చేస్తోన్న సరికొత్త రాజ్యాంగం అనుకోవాలేమో.!