'ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ నుంచే సాగాలి.. అవసరమైతే చెట్టు కింద కూర్చుని పని చేయడానికైనా సరే సిద్ధం..'
– ఈ మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే ముందే చెప్పారు.
'ఎట్టి పరిస్థితుల్లోనూ హైద్రాబాద్‌పై హక్కుని వదులుకోం.. సెక్షన్-8 అమలు చేయాల్సిందే.. మమ్మల్ని వెళ్ళిపోమనే హక్కు ఎవరికీ లేదు..'
– ఈ మాట ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా మంత్రులు 'ఓటుకు నోటు' కేసుకు కొద్ది రోజుల ముందే చెప్పారు.
'తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం.. అప్పటిదాకా హైద్రాబాద్‌లోనే వుంటాను.. నేనెక్కడికీ వెళ్ళిపోలేదు..'
– తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పిన మాట ఇది.
'ఎన్ని ఇబ్బందులున్నాసరే, ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోవాల్సిందే..'
– ఉద్యోగుల్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి.
దేనికీ ఒకదానితో ఒకటి సంబంధం లేని స్టేట్‌మెంట్లు.. అన్నీ అధికార పార్టీ నుంచి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నుంచీ వచ్చాయి. అయ్యిందేదో అయిపోయింది. ఎట్టకేలకు.. దాదాపు 28 నెలల తర్వాత, ఆంధ్రప్రదేశ్ పరిపాలన పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమయ్యింది. ఈ విషయంలో13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనాసరే సంతోషించి తీరాల్సిందే. రాజకీయాలకతీతంగా ఈ ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.
కానీ, 'చెట్టుకింద పాలనతో పోల్చితే ఇది నయమే కదా..' అంటూ తాత్కాలిక సచివాలయంలో అధికారికంగా అన్ని శాఖలూ పని ప్రారంభించిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి, 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, అప్పటి రాజధాని కర్నూలులో సరైన ఏర్పాట్లు లేవు. దాంతో టెంట్లు వేసుకుని కొన్నాళ్ళపాటు పరిపాలన చేపట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు పరిస్థితులు వేరు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ ఇలా పలు ముఖ్యమైన నగరాలు ఆంధ్రప్రదేశ్‌కి వున్నాయి. వీటిల్లో దేన్నో ఒకదాన్ని తాత్కాలిక రాజధానిగా చేసుకోవచ్చు. ఆల్రెడీ విజయవాడను కొన్నాళ్ళ క్రితమే తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు కూడా. పదేళ్ళు ఎటూ హైద్రాబాద్‌లో అవకాశం వుంది గనుక, అక్కడినుంచే పరిపాలనా సాగింది. దాంతో, చెట్టుకింద.. అన్న ప్రస్తావనే రాదిక్కడ.
చంద్రబాబు పదే పదే, 'నేను బస్సులో పడుకున్నాను..' అని చెబుతుంటారు. అంత ఖర్మ ఆయనకేంటి.? పార్టీ కార్యాలయాలు విజయవాడలో పెద్దయెత్తున వున్నాయి. అధికార పార్టీ నేతలకైతే పెద్ద పెద్ద భవంతులే వున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకీ కరువేమీ లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లూ అందుబాటులోనే వున్నా, దేన్నీ వినియోగించుకోలేదు. దానికి కారణాలు వేరే వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
'మనల్ని మనం కించపర్చుకుంటే ఏమొస్తుంది.?' అన్న మినిమమ్ కామన్‌సెన్స్ అధికార పార్టీ నేతల్లో కన్పించదు. నిజమే, ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా నష్టపోయింది. కానీ, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఏం చేస్తున్నామో కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రత్యేక హోదా అడగరు, ప్రత్యేక ప్యాకేజీ ఊసెత్తలేదు. ప్రత్యేక సహాయం పేరుతో బిచ్చమేస్తోంటే, అదే పరమాన్నం అంటారు. రెండున్నరేళ్ళ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఓ ప్రకటన వచ్చిందంతే. రాజధాని నిర్మాణం ఇంకా మిధ్యగానే వుంది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సెంటిమెంట్లను రగల్చాలనుకుంటే ఎలా.?
అయ్యిందేదో అయిపోయింది, ఇక జరగాల్సిన పని చూడాలంతే. తాత్కాలిక సచివాలయానికి అవసరమౌన మౌళిక సదుపాయాల్ని పెంచి, గుంటూరు – విజయవాడతో కనెక్టివిటీని విస్తరించగలిగితే, క్రమక్రమంగా ఆ ప్రాంతం రానున్న రోజుల్లో మహానగరంగా దానంతట అదే రూపొందుతుంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని సంగతి దేవుడెరుగు, ముందు వెలగపూడి దశ మార్చేందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. చంద్రబాబూ ఆ పని చేస్తారా ఇకనైనా.?