ఎన్‌కౌంటర్ జరిగిందనే వార్త.. ఆ వెంటనే అది బూటపు ఎన్‌కౌంటర్ అనే ఖండన.. ఇది చాలా సర్వసాధారణమైన వ్యవహారం. ఎన్‌కౌంటర్ల యందు ఫేక్ ఎన్‌కౌంటర్లు వేరయా.. అనే మాట పరమ రొటీన్. 'సినిమాలు చూడట్లేదేటి.?' అన్న కోణంలో ఆలోచిస్తే మాత్రం, ప్రతి ఎన్‌కౌంటర్ ఫేక్ ఎన్‌కౌంటర్‌లానే కన్పిస్తుంది.
పోలీసు ఓ దొంగనో, గూండానో పట్టుకోవడం, అరెస్టు చేసినట్లే చేసి పారిపొమ్మనడం, కాల్చి పారేసి.. 'తప్పించుకుని పారిపోతుండగా, పట్టుకునే ప్రయత్నంలో దొంగ ఎదురుదాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది..' అంటూ ఎన్నో సినిమాల్లో ఫేక్ ఎన్‌కౌంటర్ల దుమ్ము దులిపేస్తూనే వున్నారు. చాలా ఎన్‌కౌంటర్లు ఇలాగే జరుగుతాయట. ఒకటీ అరా సందర్భాల్లో మాత్రమే అసలు ఎన్‌కౌంటర్లు జరుగుతాయట.
పోలీసుల కోణంలో చూస్తే మాత్రం, 'ఎన్‌కౌంటర్ అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజాస్వామ్యంలో రెండు సమాంతర ప్రభుత్వాలు పనిచేయకూడదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవరూ తుపాకీపట్టరాదు. మావోయిస్టుల ఏరివేత క్రమంలో ప్రాణాలొడ్డి పోరాడుతున్న వారి గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించాలి..' అన్న వాదన తెరపైకి వస్తుంటుంది.
నిజమే, మావోయిస్టులు, పోలీసుల్ని దొంగదెబ్బ తీయడం ఇటీవలి కాలంలో తరచూ వింటున్నాం. కొందరు పోలీసుల్ని ముందుగా చంపేసి, వారి మృతదేహాల కోసం వచ్చే పోలీసుల్ని చంపేయడం అనేది ఓ 'యుద్ధ వ్యూహం'గా మారిపోయింది మావోయిస్టులకి. ఇది క్షమించరాని నేరం. దానికి మావోయిస్టుల వెర్షన్ ఇంకోలా వుంటుంది. పోలీసులు చేసే కుట్రల ముందు తమ వ్యూహాలు దిగదుడుపు.. అంటారు మావోయిస్టులు.
ఎవరి వాదన వారిదే. కానీ, ఎవరికీ ప్రాణం విలువ తెలియకుండా పోతోంది. ఓ పక్క సరిహద్దుల్లో పొరుగు దేశాలతో యుద్ధం చేయాల్సిన దుస్థితి. పొరుగుదేశం పాకిస్తాన్ ఎగదోస్తున్న తీవ్రవాదం ఏ క్షణాన దేశంలో ఎక్కడ అలజడి సృష్టిస్తుందోనన్న టెన్షన్. ఈ పరిస్థితుల్లో, మావోయిస్టులు దేశంలో అంతర్యుద్ధం కోసం ప్రయత్నిస్తుండడం అవసరమా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. బడుగు బలహీన వర్గాల కోసమే తమ పోరాటం.. అన్నది మావోయిస్టుల వాదన.
ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకరి వాదనతో, ఇంకొకరి వాదన ఎక్కడా ఏకీభవించదు. కాబట్టే, అటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఈ అంతర్యుద్ధంలో బలైపోవాల్సిందే.
తాజాగా ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఇదే అతి భారీ ఎన్‌కౌంటర్.23 మంది మావోయిస్టుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మావో ముఖ్య నేతలే ఇందులో ప్రాణాలు కోల్పోయారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మావోయిస్టుల సమాచారమయ్యారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారట. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారని ఏపీ పోలీస్ బాస్ ప్రకటించేశారు. కానీ, పౌర హక్కుల సంఘాలు మాత్రం ఇది పోలీసులు చేసిన పాశవిక హత్యల పరంపర.. అంటూ ఆరోపిస్తున్నారు. ఎవరికి వారే యమునాతీరే. 23 మంది ప్రాణాలు పోయాయ్. ఇది మాత్రమే వాస్తవం.