అనగనగా ఓ మాజీ మావోయిస్టు.. రాజకీయ నాయకులు పిలిచి చేరదీశారు. పోలీసులూ వాడుకున్నారు. వారి అండదండలతో ఆ మాజీ మావోయిస్టు కాస్త గ్యాంగ్‌స్టర్ అయ్యాడు. సింపుల్‌గా గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ కథ ఇదే. ప్రస్తుతానికి నయీమ్ ప్రాణాలతో లేడు. అందుకే, నయీమ్‌ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ అనగలుగుతున్నారు. లేదంటే, రాజకీయ నాయకుల్లో ఎవరికీ అతన్ని గ్యాంగ్‌స్టర్ అనే ధైర్యం వుండేది కాదేమో.!
'అవును, కొన్ని కేసుల్లో మాజీ మావోయిస్టుల్ని కోవర్టులుగా వాడుకుంటాం. మాజీ మావోయిస్టులనే కాదు.. నేరస్తుల్ని అయినాసరే, అవసరానికి వాడుకుంటాం..' అని సెలవిచ్చారో మాజీ పోలీస్ ఉన్నతాధికారి. 'నయీమ్ అనుచరుల్లో కొంతమంది మా పేరు చెప్పుకుని తిరుగుతుండొచ్చు.. మా అనుచరులుగా వున్నవారే, నయీమ్ వెంట తిరిగి వుండొచ్చు.. అది మాకు సంబంధం లేని విషయం..' అని ఓ రాజకీయ నేత సెలవిస్తారు. 'నేను నయీమ్ మనిషిని కాదు.. నేను నయీమ్ బాధితుడ్ని..' అంటాడు ఇంకో రాజకీయ ప్రముఖుడు. 'ఎన్నికల్లో నన్ను నయీమ్ భయపెట్టాడు..' అని ఇంకొకాయన బహిరంగ సభలో కామెడీ చేస్తారు. వాట్ ఏ రాజకీయం.! నయీమ్ ఆత్మ ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతూ వుంటే గనుక, ఈ రాజకీయాల్ని చూసి ఏమనుకుంటుంది.?
బతికుండగా నయీమ్‌ని అందరూ వాడుకున్నవారే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కారణం, ఆయన్ని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులే గ్యాంగ్‌స్టర్‌గా మార్చారు. పోలీసు అధికారులు.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, నయీమ్ సన్నిహితుల్లో ఎక్కువమంది పోలీసు అధికారులే వున్నారు గనుక. నయీమ్‌కి సంబంధించిన సమాచారం అందరికన్నా ఎక్కువగా మీడియాకే తెలుసు. ఎందుకంటే, మీడియాలోనూ నయీమ్ అనుచరులు వున్నారట.
అందుగలడిందులేడని సందేహము వలదు.. అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. మీడియా ప్రతినిథులకీ నయీమ్‌తో సత్సంబంధాలున్నాయన్న మాట వాస్తవమే. అందుకే, పోలీసులు సమాచారాన్ని లీక్ చేయకపోయినా, రాజకీయ నాయకులు పెదవి విప్పకపోయినా, ఫలానా నేత, ఫలానా పోలీస్ అధికారి.. నయీమ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి వున్నారంటూ మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలుగు చూస్తున్నాయి.
నయీమ్ తన మీద ఓ సినిమా తీసుకుందామనుకున్నాడట. పది నుంచి పాతిక కోట్ల దాకా బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకున్నాడట. కథ ఓకే చేసుకున్నాడట. అదీ గోవాలో. అంతేనా, నయీమ్ రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. ఇక్కడితో ఆగలేదు, నయీమ్ ఇంకా పెద్ద డాన్ అవుదామనుకున్నాడు. తద్వారా ప్రభుత్వానికి సమాంతరంగా మాఫియా అనే వ్యవస్థను నడపాలనుకున్నాడు. ఇవేవీ అసత్యాలు కావు. అన్నీ నిజాలే. కాలం కలిసిరాలేదు. ఎక్కడో తేడా కొట్టింది. నయీమ్ హతమయ్యాడు.
అప్పుడు నయీమ్‌తో సన్నిహితంగా వున్నవారే, ఇప్పుడు నయీమ్‌తో తమకు సంబంధం లేదనుకుంటున్నారు. ఇదో తేనెతుట్టె. అందుకే, దాన్ని కదిలించడం అంత తేలిక కాదు. కదిలిస్తే, మొత్తంగా అందరి జాతకాలూ బయటపడిపోతాయ్. కోట్లు.. వందల కోట్లు.. గజాలు, సెంట్లు.. ఎకరాలు.. వందల ఎకరాలు.. గ్రాములు, తులాలు.. కిలోల లెక్కన ఆభరణాలు.. ఇదీ నయీమ్ నేర సామ్రాజ్యం. ఇందులో భాగస్వాములు చాలామందే. కానీ, నయీమ్ ఒక్కడే చనిపోయాడు. ఇంకేముంది, రహస్యం సమాధిలోకి.!