ఊసరవెల్లి రంగులు మార్చడం అనేది ప్రకృతి ధర్మం. కానీ, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఊసరవెల్లిలా మారిపోతున్నారు. అందుకే, రాజకీయ వ్యభిచారం.. అన్న పదం ఉపయోగిస్తే, 'వ్యభిచారం' కూడా సిగ్గుపడ్తుంది. ఊసరవెల్లి అని అనాల్సి వస్తే, ఊసరవెల్లి కూడా సిగ్గుతో బిక్కచచ్చిపోతుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారిని, అలా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించేవారినీ, రాజకీయ వ్యభిచారం, ఊసరవెల్లి రాజకీయం.. అనడం కన్నా, అంతకన్నా పెద్ద పెద్ద పదాల్ని ఏమైనా కనుగొని, వారిపై ప్రయోగించాలేమో.!
ఇక, అసలు విషయానికొస్తే, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని నిరసిస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు గతంలో కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్. పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కీ, అలాగే పార్టీ ఫిరాయించిన నేతలకీ నోటీసులు జారీ చేసింది. దాంతో, నోటీసులు అందుకోనున్న అందరికీ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయ్యింది.
పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వుండనే వుంది. కానీ, అందులో విశేషాధికారాల్ని స్పీకర్‌కే కట్టబెట్టారు. దానర్థం, స్పీకర్‌ని అడ్డంపెట్టుకుని అకృత్యాలకు పాల్పడమని కాదు. స్పీకర్ వ్యవస్థకి ఆ స్థాయి గౌరవం వుందని. రాజ్యాంగ బద్ధంగా స్పీకర్ వ్యవహరిస్తారనీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారనీ భావించి, స్పీకర్‌కి మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విశేషాధికారాల్ని కట్టబెడితే, స్పీకర్ వ్యవస్థ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
'మా పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారు.. ఆయనపై అనర్హత వేటు వెయ్యండి..' అంటూ పార్టీలు చేసే ఫిర్యాదుల్ని స్పీకర్ పట్టించుకోలేదు. 'ఫలానా పార్టీకి చెందిన నేతలు మన పార్టీలోకి వచ్చేశారు.. ఆ పార్టీ విలీనమైనట్లు ప్రకటించేయండి..' అని అధికార పార్టీ చెబితే చాలు, గంగిరెద్దులా స్పీకర్ వ్యవస్థ తలూపేస్తోంది. ఇదీ నేటి రాజకీయం. ఈ పరిస్థితుల్లో అసలు స్పీకర్ వ్యవస్థకు విశేషాధికారాలు ఎందుకు కట్టబెట్టాలి.? అన్న చర్చ జరగడం సహజమే.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. అధికార పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసి, 'రాజకీయ వ్యభిచారానికి' పాల్పడుతుండడం బహిరంగ రహస్యం. విపక్షంలో వున్నప్పుడు పార్టీ ఫిరాయింపు అంటే రాజకీయ వ్యభిచారం అన్న పార్టీలే, అధికారంలోకి వచ్చాక ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. 'అప్పుడు మీరు పెంట తిన్నారు కదా, ఇప్పుడు మేం పెంట తింటే తప్పేంటట.?' అంటూ నిస్సిగ్గుగా అధికార పార్టీలు చెప్పుకుంటుండడం రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ట.
సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది గనుక, పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం తప్పకపోవచ్చు.. అన్న చిన్నపాటి ఆశ ప్రజాస్వామ్యవాదుల్లో కన్పిస్తోంది. కానీ, న్యాయస్థానాల్నే ఏమార్చగల స్థాయిలో దిక్కుమాలిన రాజకీయాలు చేయడంలో ఆరితేరిపోయాయి రాజకీయ పార్టీలు. చూద్దాం.. సుప్రీంకోర్టు జోక్యంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.! సుప్రీం కూడా ఏమీ చేయలేకపోతే, ఇక దేశాన్ని ఎవడూ బాగుచేయలేడు.!