ఏ రాయి అయినా ఒకటే పన్నూడగొట్టడానికి.. అన్నట్టు, పన్నుల భారం రోజురోజుకీ పెరుగుంది తప్ప తగ్గేది కాదు. జిఎస్‌టి రాకతో ప్రజలకు 'పన్నుల భారం తగ్గుతుంది' అన్న మాటకు అసలు అర్థమే లేదు. మీడియా మాత్రం కోడై కూసేస్తోంది, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని. ఇంతకన్నా 'బూతు జోకు' ఇంకొకటి వుండదు. ఎందుకంటే, రోజురోజుకీ మార్కెట్‌లో ధరలు పెరగడం తప్ప, తగ్గడం అనేది జరగదుగాక జరగదు.
కేంద్రం విధించే పన్నులు, రాష్ట్రాలు విధించే పనులు, ఇవి కాకుండా అదనపు సెస్సులు, మట్టి, మశానం.. ఇవన్నీ కలుపుకుంటే, వినయోగదారుడి జేబుకి చిల్లుపడటం మామూలే. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఈ పన్నులన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చి, దానికి 'జిఎస్‌టి' అనే పేరు పెట్టి, సింపుల్‌గా జేబులోంచి పెద్ద నోటు లాగేస్తారన్నమాట. అంతే తేడా. పన్నుల పేరుతో దోపిడీ మాత్రం షరామామూలే.
'ఎక్కువగా వినియోగంలో వుండే సాధారణ అవసరాలకు సంబంధించిన వస్తువులు' కేటగిరీ కింద దేన్ని వుంచాలి.? అన్నదానిపై పాలకుల్లో కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ అలాగే వుంటుంది. మంచి నీళ్ళకు సైతం పన్నులు కడుతున్న రోజులివి. కాబట్టి, పన్నులు లేని 'వస్తువు' అనేదాన్ని ఊహించుకోవడం దాదాపుగా అసాధ్యం. 'లేదు' అని చెబితే, అది నిజంగానే పెద్ద జోక్ అవుతుంది మరి.!
పెట్రోధరల్నే తీసుకుంటే, అంతర్జాతీయ మార్కెట్‌కి అనుగుణంగా ఒకప్పుడు మన దేశంలో పరిస్థితులుండేవి. ఇప్పుడు అలా కాదు. అంతర్జాతీయ మార్కెట్ ఎలా వున్నా, ఇక్కడ మాత్రం మంట మండిపోతూనే వుంది. ఒకప్పుడు పెట్రోధరల విషయంలో ఆందోళనలు చేసిన బీజేపీ, ఇప్పుడు అధికార పీఠమెక్కాక, పెట్రోధరలకు ఇంకాస్త మంట జోడిస్తోంది. ఎందుకు.? అని ప్రశ్నించడానికి, ప్రతిపక్షం బలంగా లేదక్కడ.
జిఎస్‌టి అయినా, ఇంకొకటైనా దేశాన్ని ఉద్ధరించేస్తుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదన్నది నిర్వివాదాంశం. మరి, జిఎస్‌టి పేరుతో కేంద్రం చేస్తున్న ఓవరాక్షన్, దానికి వంతపాడుతున్న రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, ఈ మొత్తం వ్యవహారానికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న మీడియా.. ఇదంతా సామాన్యుడిపై మూకుమ్మడి దాడిగానే పరిగణించాలేమో.!