అబ్జర్వేషన్‌: తేల్చేస్తార్లే.. తొందరేముంది.?

'పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపాల్సిందే..'  Advertisement – విపక్షంలో ఏ పార్టీ వున్నా చెప్పే మాట ఇదే.  'మా పార్టీ విధానాలు నచ్చి వస్తున్నారు.. మేమేం వారిని లాక్కోవడంలేదు.. చట్టం తన పని తాను…

'పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపాల్సిందే..' 

– విపక్షంలో ఏ పార్టీ వున్నా చెప్పే మాట ఇదే. 

'మా పార్టీ విధానాలు నచ్చి వస్తున్నారు.. మేమేం వారిని లాక్కోవడంలేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పార్టీ ఫిరాయించినవారి అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు..' 

– అధికారంలో ఎవరున్నా చెప్పే మాట ఇదే. 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు అత్యంత నీఛస్థాయికి దిగజారిపోయాయి. పార్టీ ఫిరాయింపులే రాజకీయ పరమార్ధం.. అన్నట్లు అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 'ఒకప్పుడు మేం బాధితులం.. అందుకే ఈసారి ఛాన్స్‌ మాకొచ్చింది.. మేం ఎంజాయ్‌ చేస్తున్నాం..' అన్నట్లుగా వుంది టీడీపీ, టీఆర్‌ఎస్‌ల వైఖరి. చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ, తెలంగాణలో బాధిత పార్టీగా మారిపోయింది. 

హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా.. ఎవరేమనుకున్నాసరే, 'నిస్సిగ్గు రాజకీయమే మా విధానం..' అన్నట్లుగా అటు టీడీపీ, ఇటు టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో అయితే ఏకంగా, పార్టీ ఫిరాయించిన నేతకి మంత్రి పదవి ఇచ్చేశారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. 

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఈపాటికే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి వుందట. అందులో నలుగురు వరకూ పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రి పదవులు దక్కనున్నాయట. కానీ, సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల అంశంపై కేసు నడుస్తున్న దరిమిలా, ఆ కేసు ఓ కొలిక్కి వచ్చేదాకా తొందరపడకూడదని చంద్రబాబు అనుకుంటున్నారట. లేదంటే, ఈపాటికి ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్‌ మంత్రి అయిపోయి వుండేవారు.. అలాగే పార్టీ ఫిరాయించినవారిలో ఆ నలుగురూ మంత్రులైపోయి వుండేవారే. 

'నవంబర్‌ 8 లోగా పార్టీ ఫిరాయింపులపై స్పందించాల్సిందే.. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో నవంబర్‌ 8లోగా చెప్పండి..' అంటూ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తుతానికి ఏపీ స్పీకర్‌కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కి అందే ఆదేశాలే, నైతికంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కి కూడా వర్తిస్తాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఆల్రెడీ రెండున్నరేళ్ళు పూర్తయిపోయింది. ఇంకో రెండేళ్ళు గడిపేయడం పెద్ద విషయం కాదు. 'అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం..' అని తెలంగాణ స్పీకర్‌ సుప్రీంకోర్టుకి పేర్కొన్నా, ఆ 'త్వరలో' అన్న పదానికి నిర్వచనం చెప్పేందుకు రెండేళ్ళు ఏం ఖర్మ, ఇరవయ్యేళ్ళు అయినా పట్టొచ్చుగాక. చాలా కేసుల్లో 'జస్టిస్‌ డిలేయ్‌డ్‌ ఈజ్‌ జస్టిస్‌ డినైడ్‌..' అని వింటుంటాం. ఇది కూడా అంతే. ఐదేళ్ళ తర్వాత అనర్హత వేటు పడితే ఉపయోగం ఏముంటుందట.? 

ఇదిలా వుంటే, చట్ట సభల వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం కుదరదంటూ అధికారంలో వున్న పార్టీలు వితండవాదాన్ని తెరపైకి తీసుకురావడం మామూలే. ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా పార్టీ ఫిరాయింపులపై ఆదేశాలు జారీ చేస్తే, చివరి ఆయుధం అదే మరి.!