'జోరు మీదున్నావు తుమ్మెదా…నీ జోరెవరి కోసమె తుమ్మెదా'…అనే పాట మాదిరిగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జంట కవుల వలె అంటుకు తిరుగుతూ యమ జోరుగా ఉన్నారు. వారి జోరంతా యూపీలో బీజేపీని చిత్తుగా ఓడించడం, మళ్లీ అఖిలేష్ నేతృత్వంలో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ లక్ష్య సాధనలో 'యువ జోడీ' తలమునకలుగా ఉన్నారు. జంటగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు యువ నాయకులు ఒకే డ్రస్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యేవరకు ఇద్దరూ ఒకే రకమైన డ్రస్‌లో ఉంటారని తెలుస్తోంది. పత్రికల్లో కనబడుతున్న ప్రచార ఫొటోల్లో, టీవీ దృశ్యాల్లో ఒకే రకంగా ఉన్నారు.
ఒకే మాట మాట్లాడుతున్నారు. ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారు. తామిద్దరం ఒకే వయసువాళ్లమని చెబుతున్నారు. అంటూ ఇద్దరిదీ ఒకే ఏజ్ గ్రూపన్నమాట. రాహుల్ వయసు 46 ఏళ్లు కాగా, అఖిలేష్‌కు 43 ఏళ్లు. తేడా ఒక్కటే…రాహుల్ అవివాహితుడు. అఖిలేష్ వివాహితుడు. అభివృద్ధికి తాము రెండు సైకిల్ చక్రాలవంటివారమని అఖిలేష్ చెబుతుండగా, తమది గంగ-యమున సంగమమని రాహుల్ అభివర్ణిస్తున్నారు. తమది 'ప్రజాకూటమి' అని, ఒక్క సీటూ వదలకుండా గెలుచుకుంటామని అంటున్నారు. ఎన్ని సీట్లు గెలుచుకుంటారో చెప్పలేంగాని ఇద్దరు యువ నాయకులు జనాలకు కనువిందు చేస్తున్నారు. 403 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెసు అతి కష్టమ్మీద 105 సీట్లు తన వాటాగా సాధించుకోగలింది. చివరకు ఆ క్రెడిట్ కూడా రాహుల్ గాంధీకి కాకుండా ప్రియాంక గాంధీకి పోయింది.
ఇప్పుడైతే ఇద్దరు యువ నాయకులు ఉత్సాహంగా ఉన్నారుగాని అఖిలేష్ అధికారంలోకి వచ్చాక కూడా ఇలాగే ఉంటారా అనేది చెప్పలేం. అఖిలేష్ తీరు చూస్తే రాహుల్‌ని కేర్ చేయనట్లుగా కనబడుతోంది. యూపీలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసుకున్న కాంగ్రెసు చివరకు ఎస్పీకి జూనియర్ భాగస్వామిగా మారాల్సిన గతి పట్టింది. ఇదివరలో బిహార్‌లోనూ నితీష్, లాలూ కూటమిలో చేరి కొన్ని సీట్లు దక్కించుకుంది. యూపీలో కాంగ్రెసు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను తన అభ్యర్థిగా ప్రకటించి అధికారమే తమ లక్ష్యమని ప్రకటించినప్పుడు అన్ని మీడియా సంస్థలు కాంగ్రెసుకు అంత సీన్ లేదని తెలియచేశాయి. అవి నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది.
2012లో ఈ పార్టీకి 28 స్థానాలొచ్చాయి. ఈ ఐదేళ్లలో కాంగ్రెసు పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారింది. అందుకే అఖిలేష్ ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కాంగ్రెసు 138-140 సీట్లు అడగ్గా ఈయన 99 ఇస్తానన్నారు. చివరకు అది 105 దగ్గర సెటిలైంది. అఖిలేష్ లక్ష్యం మళ్లీ ముఖ్యమంత్రి కావడం. రాహుల్ గాంధీ లక్ష్యం గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లను రెట్టింపు చేయడం. గత ఎన్నికల్లో 28 స్థానాలు వచ్చాయి కాబట్టి ఈసారి 56 స్థానాలు సాధించాలని అనుకుంటున్నారు. ఇక తన సోదరి ప్రియాంక గాంధీ కాంగ్రెసు పార్టీకి పెద్ద ఆస్తి అని చెబుతున్న రాహుల్ ఆమె ప్రచారంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కూటమి తరపున ప్రచారం చేయాలా వద్దా అనేది ఆమె ఇష్టమన్నారు.
కాని కాంగ్రెసు తరపున ఉన్న నలభైమంది ప్రధాన ప్రచారకర్తల్లో ప్రియాంక కూడా ఉన్నారు. అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతాడా? కాడా? అనేదాని కంటే రాహుల్ కాంగ్రెసుకు అత్యధికంగా సీట్లు సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడా? లేదా? అనేదే ప్రధానాంశమైంది. పార్టీ సీట్లను రెట్టింపు చేస్తే నాయకులు ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు.