ఒకే హీరో.. ఏడాదికి 36 సినిమాలు!

‘వచ్చే ఏడాదిలో టాలీవుడ్ లో ఫలానా స్టార్ హీరో సినిమాలు మూడు రిలీజ్ కానున్నాయి!’ అనేది ప్రస్తుతానికి గిన్నిస్ బుక్ వరకూ ఎక్కించదగ్గ వార్త! ఒక స్టార్ హీరో మూడు సినిమాలు చేస్తున్నాడంటే అదో…

‘వచ్చే ఏడాదిలో టాలీవుడ్ లో ఫలానా స్టార్ హీరో సినిమాలు మూడు రిలీజ్ కానున్నాయి!’ అనేది ప్రస్తుతానికి గిన్నిస్ బుక్ వరకూ ఎక్కించదగ్గ వార్త! ఒక స్టార్ హీరో మూడు సినిమాలు చేస్తున్నాడంటే అదో సంచలనం అవుతోంది… మరి తనకంటూ వ్యక్తిగతంగా గుర్తింపును కలిగిన ఒక హీరో ఒక ఏడాది లో ముప్పై సినిమాల్లో నటిస్తే! అవన్నీ ఒకే ఏడాదిలో విడుదల అయితే… దాన్ని ఏమనాలి? ఈ తరం సినీ ప్రేక్షకులు అయితే అదసలు సాధ్యమా! అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాం. అయితే అది సుసాధ్యమని నిరూపించాడు మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి. ఇప్పుడు కాదు.. మూడు దశాబ్దాల కిందటే ఆయన ఆ ఫీట్‌ను చేసి చూపించాడు. మరి ఇప్పుడు స్టార్ హీరోలు అలా ఎందుకు చేయడం లేదు.. అనేది మాట్లాడుకోవడం కన్నా.. త్రిశక చిత్ర మమ్ముట్టి వైభవాన్ని గుర్తు చేసుకోవడంతోనే సినిమా అంటే ఆసక్తి ఉండే వాళ్లకు ఆనందం.

కొట్టాయం ప్రాంతంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన మమ్ముట్టి మొదట సినిమాలతో ఎలాంటి సంబంధమూ లేదు! లా చదివి.. ప్రాక్టీస్ మొదలు పెట్టి పెళ్లి చేసుకొని సెటిలయిపోయిన అనంతరం.. అనూహ్యంగా సినిమాల వైపు వచ్చాడు. అద్భుతమైన సినిమాలు చేశాడు. అసాధ్యమనుకొన్న రికార్డులను సృష్టించాడు. మళయాలం చాలా చిన్న చిత్ర పరిశ్రమ టాలీవుడ్ తో పోలిస్తే.. తెలుగులో ఇప్పుడు చిన్న సినిమాలు రూపొందించే బడ్జెట్ తో అక్కడ ఒక భారీ సినిమానే రూపొందించేస్తారు. అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పుడూ ఈ తేడా కొనసాగుతూనే ఉంది. 

అయితే నంబరాఫ్ సినిమాల విషయంలో మాత్రం మళయాల చిత్ర పరిశ్రమ ఎక్కడా వెనుకబడలేదు. ప్రయోగాలకు నెలవైన ఆ గడ్డపై తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ధీటుగా సినిమాలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక లీడ్ రోల్స్ లో నటించిన హీరోగా రికార్డు ఒకనాటి మళయాల సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ పేరు మీద ఉందంటే.. ఆ ఇండస్ట్రీ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది కూడా మళయాల స్టారే.. అది మమ్ముట్టీనే!

తెలుగు వరకూ ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన హీరోగా కృష్ణ పేరును చెబుతారు.  నంబరాఫ్ సినిమాల విషయంలో తెలుగులో టాప్ పొజిషన్ లో ఉన్నది కూడా సూపర్ స్టారే. మరి కృష్ణతో పోలిస్తే మమ్ముట్టీ డబుల్ వేగంతో సినిమాలు పూర్తి చేసే టైపు! ఒక ఏడాదిలో గరిష్టంగా 35 సినిమాలు చేసిన ఘనత ఈ హీరోది! 

36 సినిమాలు అంటే నెలకు కనీసం మూడు సినిమాలు. ప్రస్తుత హీరోలకు ఏడాదికి మూడు సినిమాలు కూడా చేయడం సాధ్యం కాదు కానీ.. మమ్ముట్టికి మాత్రం నెలకు మూడు సినిమాలు చేయడం సాధ్యం అయ్యింది. అలా ఒక ఏడాది ఏదో రికార్డు కోసం చేయలేదు. వరసగా కొన్ని సంవత్సరాల పాటు మమ్ముట్టి అదే ధాటినే కొనసాగించాడు. 1980లో మమ్ముట్టి కెరీర్ మొదలైంది. అయితే తొలిసినిమాకు విడుదల కష్టాలు. అంతే.. ఇక  అయిపోయిందని అనుకొన్నాడాయన.. అయితే రెండో సినిమా దగ్గర నుంచి చలన చిత్ర కొత్త అధ్యాయం మొదలైంది.

1981లో చేసిన సినిమాలు ఈ హీరోని ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేలా చేశాయి. అక్కడ నుంచి తనదైన శైలిని క్రియేట్ చేశాడు మమ్మట్టి. 1982లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా విడుదలైన సినిమాల సంఖ్య మొత్తం 32!  1983లో మరో మూడు అడుగులు ముందుకేశాడు. ఆ ఏడాదిలో  ఏకంగా 35 సినిమాలు విడుదల అయ్యాయి. 1984 మరో 35, 85లో మరో 35.. 86లో పాత రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 36 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు ఈ హీరో! దాదాపు ఐదేళ్ల సమయంలో మమ్ముట్టి నటించగా విడుదలైన సినిమాల సంఖ్య 150 కి పైనే!

వంద సినిమాలు పూర్తి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో ఒక గ్రేట్ అచీవ్ మెంట్. హీరోలకైనా, నిర్మాతలకైనా, దర్శకులకైనా లైఫ్ టైమ్ గోల్! అలాంటి రికార్డును సృష్టిస్తే దాన్నే జీవితకాలం చెప్పుకోవచ్చు. మరి అలాంటి రికార్డును మూడేళ్లలోనే సృష్టించేసిన ఘనత మమ్ముట్టిది.

బహుశా అప్పుడు కథలు వినే టైమ్ కూడా ఉండక పోయ్యుండొచ్చు. సినిమాలు ఎప్పుడు విడుదలవుతున్నాయనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా నటించుకొంటూ వెళ్లి పోయ్యుండొచ్చు. ఎలా వ్యవహరించి ఉన్నా.. ఆ ఫీట్ మాత్రం అసాధారణమైనది. ఆ తర్వాతి కాలంలో అంతలా కాకపోయినా.. మమ్ముట్టీ కెరీర్ వేగంగానేసాగింది. దాదాపు 35 యేళ్ల కెరీర్ లో మమ్ముట్టి దాదాపు 400 సినిమాలు చేశాడు. 

వీటిలో అద్భుతం అనిపించుకొన్న సినిమాలు.. జాతీయ అవార్డులు పొందినవి ఉన్నాయి! వాటిలో చాలా సినిమాలను తెలుగు హీరోలు కూడా రీమేక్ చేసుకొన్నారు. మరికొన్ని డబ్ అయ్యాయి. వ్యక్తిగతంగా జాతీయ ఉత్తమ నటుడిగా మూడు సార్లు పురస్కారాన్ని పొందాడు మమ్ముట్టి. కమల్ హాసన్ కూడా ఇలాంటి హ్యాట్రిక్‌ను సృష్టించాడు. మరి సినిమాల విడుదల విషయంలో రికార్డులను సృష్టించిన మమ్ముట్టి నటించిన తొలి సినిమా ఇప్పటికీ విడుదల కాకపోవడాన్ని కొసమెరుపుగా చెప్పాలి!